బీచుపల్లి క్షేత్రంలో దేవాదాయశాఖ కమిషనర్
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని మంగళవారం రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ హరీశ్ సందర్శించారు. అభయాంజనేయస్వామిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ సిబ్బంది ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ఈఓ రామన్‌గౌడ్ కమిషనర్‌ను శేషవస్త్రంతో సత్కరించగా.. అర్చకులు మారుతీచారి తీర్థప్రసాదాలను అందజేశారు.
జాతీయ కబడ్డీ టోర్నీకి జిల్లా క్రీడాకారిణి
గద్వాలటౌన్: కలకత్తాలో ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలకు జిల్లా క్రీడాకారిణి రాజేశ్వరి ఎంపికయ్యారు. అయిజ మండలం పులికల్‌కు చెందిన రాజేశ్వరి ఎంఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఇటీవల నల్లగొండ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు తరఫున ఆమె పాల్గొని అత్యంత ప్రతిభకనబర్చడంతో జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలో రాజేశ్వరిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు డీకే స్నిగ్ధారెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్సింహ, కోశాధికారి చందు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవి, ఉపాధ్యక్షులు నగేశ్, వెంకటేశ్, సంయుక్త కార్యదర్శులు జగదీశ్, పాషా, రాజేందర్ పాల్గొన్నారు.
నట్టల నివారణతోనే జీవాల్లో ఎదుగుదల
గద్వాల(ఇటిక్యాల): జీవాలు ఆరోగ్యంగా ఎదిగేందుకు నట్టల నివారణ ముఖ్యమని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డా.శివానందస్వామి అన్నారు. మంగళవారం ఇటిక్యాలలో సర్పంచ్ జీవన్‌రెడ్డితో కలసి జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జీవాల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న నట్టల నివారణ మందును పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మేకలు, గొర్రెల్లో నట్టలను నివారించడం వల్ల ఆకలి గుణం పెరిగి, మేత అధికంగా తీసుకుంటాయని తెలిపారు. యజ మానులకు అధిక మాంసం ఉత్పత్తి జరిగి, ఆర్ధికంగా లాభాలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి భువనేశ్వరి, సిబ్బ ంది మాసుమన్న, కార్తీక్, మురళి పాల్గొన్నారు.
కుష్టు నిర్మూలనకు
కృషి చేద్దాం
ఎర్రవల్లి: కుష్టివ్యాధిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని రాష్ట్ర ఎల్‌సీడీసీ ప్రోగ్రాం అధికారిణి డా.జరీనా భాను అన్నారు. ఎల్‌సీడీసీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎర్రవల్లి మండలం కొండేరులో ఆశావర్కర్లు చేపట్టిన ఇంటింటి సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చర్మంపై మచ్చలు ఏర్పడి, స్పర్శ కోల్పోతే సస్పెక్టెడ్ కేసుగా నమోదు చేయాలని సూచించారు. ఆ కేసులను మండల వైద్యాధికారి పరీక్షించిన తర్వాత నిర్దారణ చేసుకోవాలన్నారు. లెప్రసీ వ్యాధిపై అందరికీ అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో లెప్రసీ నోడల్ పర్సన్ రమేశ్, ఏఎన్‌ఎం నర్మద పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.8,090
గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు మంగళవారం 326 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటా గరిష్టంగా రూ. 8,090, కనిష్టంగా రూ. 5,299, సరాసరి రూ. 6,890 ధరలు లభించాయి. అదే విధంగా క్వింటా ఆముదాలు అమ్మకానికి రాగా.. రూ. 5,877 ధర పలికింది. 286 క్వింటాళ్ల వరి (సోన) అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 2,570, కనిష్టంగా రూ. 2,110, సరాసరి రూ. 2,368 ధరలు వచ్చాయి. 86 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,469, కనిష్టంగా రూ. 4,526, సరాసరి రూ. 5,829 ధరలు లభించాయి.
బీచుపల్లి క్షేత్రంలో దేవాదాయశాఖ కమిషనర్


