నేడు కోస్గికి సీఎం రాక
కోస్గి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం కోస్గికి రానున్నారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలో పంచాయతీ పాలకవర్గాల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంగళవారం ఎస్పీ వినీత్‌తో కలిసి నారాయణపేట, వికారాబాద్ కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ప్రతీక్ జైన్ పరిశీలించారు. పంచాయతీ పాలకవర్గాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించే స్థానిక లక్ష్మీనర్సింహ ఫంక్షన్‌హల్‌తోపాటు సభాస్థలం, హెలీప్యాడ్, సీఎం కాన్వాయ్ రూట్, వాహనాల పార్కింగ్, బారికేడ్లు తదితర భద్రతాపరమైన అంశాలను పరిశీలించి.. అధికారులకు సూచనలు చేశారు. అనంతరం వికారాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల నుంచి సీఎం పర్యటన బందోబస్తుకు వచ్చిన 800 మంది పోలీసులతో ఎస్పీ వినీత్ సమావేశమై మాట్లాడారు. మొత్తం 10 సెక్టార్లుగా విభజించి.. ఏఎస్పీలు, డీఎస్పీలను ఇన్‌చార్జిలుగా నియమించామని తెలిపారు. ప్రత్యేక బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం జరిగే ప్రదేశంలో అదనపు బలగాలతో భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. సీఎం కాన్వాయ్ రూట్‌లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, ప్రజలకు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు.


