పక్కాగా పోలింగ్ ఏర్పాట్లు
● డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో వసతులు
కల్పించాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ రూరల్: జిల్లాలో జరిగే మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని ఇందుకు ఏర్పాట్లు పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. ఈ నెల11న జనగామ, స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్, పోలింగ్ స్టేషన్లలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, నోడల్ అధికారులతో సోమవారం గూగుల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ అధికారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. వందశాతం వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాటు చేస్తామని, పోలింగ్ అనంతరం బ్యాలెట్ పేపర్లను జాగ్రత్తగా స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరచ్చాలన్నారు.
ఎన్నికల నియమాలు కట్టుదిట్టంగా అమలు..
స్వేచ్ఛాయుతంగా, ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుందని ఈ నేపథ్యంలో 09.02.2026 సాయంత్రం 5.00 గంటల నుంచి 11.02.2026 సాయంత్రం 5.00 గంటల వరకు నిశ్శబ్ద కాలం అమల్లో ఉంటుందని తెలిపారు. జనగామ మున్సిపాలిటీకి ఏకశిలా బీఎడ్ కళాశాల, హైదరాబాద్ రోడ్, ఘన్‌పూర్ మున్సిపాలిటీకి సోషల్ వెల్ఫేర్ స్కూల్ నుంచి పోలింగ్ సిబ్బందికి అవసరమైన సామగ్రి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.
‘పది’ ఫలితాల్లో మొదటి స్థానంలో నిలవాలి
విజయోస్తు 2.0తో జిల్లాను మొదటి స్ధానంలో నిలపాలని, విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలంటే ప్రణాళికబద్ధంగా చదవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. స్టేషన్ రోడ్‌లోని ప్రభుత్వం ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు విజయోస్తు 2.0 స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్, హెచ్‌ఎం నర్సింహరెడ్డి, గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు.
సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన తప్పనిసరి
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన తప్పనిసరిగా ఉండాలని, స్థిరమైన వ్యవసాయ అభివృద్ధి కోసం సోక్ పిట్ల ఏర్పాటు అవసరమని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని పొలాల్లో ఎర్త్ ఆగర్‌యంత్రం ద్వారా సోక్ పిట్లు తవ్వే విధానంపై డెమో కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పాలీహౌస్‌ను సందర్శించి, అందులో కూరగాయల సాగు చేస్తున్న రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని, ఏఈఓ అనిల్, అధికారులు, రైతులు పాల్గొన్నారు.


