గప్‌చుప్‌గా పంచుడు! | - | Sakshi
Sakshi News home page

గప్‌చుప్‌గా పంచుడు!

Feb 10 2026 7:45 AM | Updated on Feb 10 2026 7:45 AM

గప్‌చ

గప్‌చుప్‌గా పంచుడు!

జనగామ: మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం ఐదు గంటలతో అధికారికంగా ముగిసింది. ప్రచార పరిమితులు అమల్లోకి రావడంతో జనగామ, స్టేషన్‌ ఘన్‌పూర్‌ మున్సిపాలిటీల్లో నిశ్శబ్దం అలుముకుంది. పోలింగ్‌కు 48 గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో మైకులు, ర్యాలీలు, రోడ్‌షోలు, బహిరంగ ప్రచారం ఆగిపోయినా, పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఇంటింటి ప్రచారంలో వేడి పెంచారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్‌ పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ కాగా, పోలీసులు, ఎలక్షన్‌ నిఘా టీంలు మద్యం సరఫరా, డబ్బు పంపిణీ, గిఫ్టుల పంపకాలపై నిఘా మరింత కఠినతరం చేశారు.

భారీ ర్యాలీలు..జోరు ప్రచారం

చివరి రోజు ప్రచారంలో అధికార కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌, సీపీఎం, బీజేపీ, స్వతంత్రులు ప్రదర్శన, ర్యాలీలు చేపట్టారు. బీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్‌ తరఫున ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్‌ అభ్యర్థుల బలం, అభివృద్ధి హామీలను ప్రజలకు నాయకులు వివరించారు. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో 30 వార్డుల్లో వందలాది మంది కార్యకర్తలతో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. గులాబీ జెండాలతో నిండిన ర్యాలీలో యువత భారీగా పాల్గొని ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేపట్టారు. సీపీఎం, సీపీఐతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈసారి ఓటర్లను ఆకర్షించేందుకు వాడవాడలా భారీ ర్యాలీలతో రంగంలోకి దిగి తమ శక్తిని చాటుకున్నారు.

ఎన్నికల సంఘం అప్రమత్తం

ప్రచార ముగింపు నేపథ్యంలో ఎన్నికల అధికారులు, పోలీసు బృందాలు రాజకీయ పార్టీల కదలికలపై ప్రత్యేకంగా నిఘా పెట్టాయి. డబ్బు, మద్యం, గిఫ్ట్‌ సరఫరా జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. పోలింగ్‌కు రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో అన్ని పార్టీలూ ఓటర్లను టచ్‌ చేస్తూ చివరి నిమిషంలో గెలుపు కోసం ప్రతి ప్రయత్నంలో వేగం పెంచారు. ఈసారి ఫలితాలు ఎలా ఉండబోతాయో పట్టణం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

మద్యం దుకాణాలు బంద్‌

పురపాలిక ఎలక్షన్ల నేపథ్యంలో ఈ నెల9వ తేదీ 5 గంటల నుంచి 11వ తేదీ పోలింగ్‌ ముగిసే వరకు జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ రెండు మున్సిపాలిటీల పరిధిలో 17 మద్యం దుకాణాలు, 5 బార్లు మూసివేయనున్నారు. ఇందుకు సంబంధించి ఎకై ్సజ్‌ శాఖ మద్యం దుకాణాలతో పాటు బార్‌లను మూసివేసి సీజ్‌ చేశారు. అనంతరం ఓట్ల లెక్కింపు రోజు సైతం వీటిని మూసివేయనున్నారు. మున్సిపల్‌ పరిధిలో వైన్స్‌లను మూసివేశారు. పెంబర్తి, నెల్లుట్ల, రఘునాథపల్లి మండలాల నుంచి పెద్దఎత్తున మద్యం తరలించనుండగా, చాలా మంది అభ్యర్థులు రెండు రోజలు ముందుగానే రహస్య ప్రాంతాల్లో డంప్‌ చేసినట్లు సమాచారం. ఓటుకు నోటుతో పాటు సిట్టింగ్‌లతో పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు అన్ని వార్డుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

బయటి హడావిడి ఆగింది.. ఇంటింటి బాట మొదలైంది

సరిగ్గా సాయంత్రం ఐదు గంటలు దాటగానే ఎన్నికల నియమావళి ప్రకారం అన్ని మైకులు ఆగిపోయాయి. రాజకీయ నేతలు కూడా మౌనాన్ని పాటించాల్సి రావడంతో వీధులు ఒక్కసారిగా ప్రశాంత వాతావరణంలోకి జారుకున్నాయి. అయితే ప్రచారం ముగిసిందే కానీ పోరు చల్లారలేదు. విప్‌ బీర్ల ఐలయ్య, ఎంపీ, కొమ్మూరి, ధన్వంతి 5 గంటల సమయం కంటే నాలుగు నిమిషాల ముందుగానే ప్రచారరథం నుంచి కిందకు దిగగా, ఎమ్మెల్యే ర్యాలీ నుంచి ముందుగానే క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను సంప్రదించడం మాత్రమే ప్రస్తుతం పార్టీలు, అభ్యర్థుల ప్రధాన వ్యూహంగా మారింది. వార్డుల్లో ఇప్పటికే ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, సంఘాల వారీగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం, గిఫ్ట్‌ ప్యాకెట్లు, వెండి కాయిన్లు, ఓటుకు నోటు పద్ధతి, బాండ్‌ పేపర్లపై హామీలు ఇలా ఎన్నో రూపాల్లో గంపగుత్తగా ఓట్ల కొనుగోలు ప్రయత్నంలో వేగం పెంచారు. కొందరు అభ్యర్థులు సంఘాల ఆధ్వర్యంలో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఓట్ల బ్లాకులను తమవైపు తిప్పుకునేందుకు కసరత్తులు చేస్తున్నారని సమాచారం.

ముగిసిన పురపోరు ప్రచారం

మూగబోయిన జనగామ,

స్టేషన్‌ ఘన్‌పూర్‌ మున్సిపాలిటీల వీధులు

చివరిరోజు అన్ని పార్టీల జోరు ప్రచారం

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ భారీ ర్యాలీలు

సంఘాల వారీగా రహస్య ఒప్పందాలు

48 గంటల్లో పోలింగ్‌...

అంతటా ఉత్కంఠ

గప్‌చుప్‌గా పంచుడు! 1
1/2

గప్‌చుప్‌గా పంచుడు!

గప్‌చుప్‌గా పంచుడు! 2
2/2

గప్‌చుప్‌గా పంచుడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement