స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో ఎలక్షన్లను స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర రిజ్వాన్ బాషా షేక్ కోరారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనున్నట్లు తెలి పారు. పోలింగ్ నేపథ్యంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, అనుచరులు ఎన్నికల ప్రవర్తన నియమాలు–2019ను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో ఆయుధాలు నిషేధమని, ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహణ కోసం ఎవరూ ఆయుధాలతో పోలింగ్ కేంద్రానికి, దాని పరిసర ప్రాంతాలకు రావడానికి అనుమతి లేదని తెలిపారు. ఉల్లంఘనకు పాల్పడిన వారికి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చని హెచ్చరించారు. అభ్యర్థికి ఒక్క వాహనం మాత్రమే అనుమతి ఉంటుందని, అభ్యర్థి ఏజెంట్ లేదా ఇతర పార్టీ నేతలకు వేరే వాహనాలకు అనుమతి లేదన్నారు. అభ్యర్థి హాజరు లేకపోతే, అతడి పేరుతో అనుమతించిన వాహనాన్ని ఇతరులు వినియోగించరాదన్నారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఓటర్లను పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లడం లేదా తిరిగి తీసుకురావడం పూర్తిగా నిషేధమన్నారు. ఇది క్రిమినల్ నేరంగా పరిగణించబడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ప్రచారం పూర్తిగా నిషేధమని, అలాగే పోలింగ్ బూత్‌తో పాటు వాటి పరిసరాల్లో మొబైల్ ఫోన్లు, వైర్‌లెస్ సెట్లు, కార్డ్‌లెస్ ఫోన్లు, వాడటం లేదా తీసుకెళ్లడం నిషేధమన్నారు. అనంతరం కలెక్టర్ ఎన్నికల పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలను పరిశీలించి, స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ హాల్స్‌కు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ వెంట జనగామ ఆర్డీఓ గోపీరాం, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ తదితర అధికారులు ఉన్నారు.


