నోఓటు యుద్ధం!
జనగామ: జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ పురపోరు రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. రెబల్స్ దూసుకురావడం, నోటు, మద్యం ప్రవాహం, అనేక వార్డుల వారీగా హోరాహోరీ త్రిముఖ పోటీతో ఎన్నికలను రణరంగంగా మార్చేసింది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు రూ.500 నుంచి రూ.5,000 వరకు నగదు, గిఫ్టులు, మద్యం,, చీరలు, వెండి కాయిన్ల పంపిణీతో ప్రలోభాల రాజకీయాలు చేపట్టారు.
పొత్తులు, రెబల్స్ రాజకీయాలు
రెండు మున్సిపాలిటీల్లో కలిపి 209 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అందులో జనగామలో 127, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 82 మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్, వామపక్ష పార్టీల పొత్తు ఎన్నికల వేడిని పెంచగా, ముఖ్యంగా జనగామలో 3, 5, 7వ వార్డుల్లో సీపీఎం, 11వ వార్డులో సీపీఐ పోటీతో రసవత్తర రాజకీయం నెలకొంది. 17వ వార్డులో కాంగ్రెస్, సీపీఎం ఇద్దరికీ బీఫాంలు ఇవ్వడంతో అక్కడ ఫ్రెండ్లీ పోటీ నెలకొంది. జనగామ పరిధిలో 17 వార్డుల్లో 40 మంది రెబల్స్ పోటీ బరిలో నిలవడం కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. 23, 14, 5, 3వ వార్డుల్లో కాంగ్రెస్ రెబల్స్ భూష పర్వతాలు, దూసరి ధనలక్ష్మి, మిద్దెపాక భాస్కర్ బరిలో నిలవడంతో అక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. 7వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి, మాజీ కౌన్సిలర్ ఆకుల రజని ప్రధాన పార్టీలకు గట్టి చెక్ పెట్టడంతో గెలుపు ఎవ్వరిదనే అంచనాలు అంతు చిక్కడం లేదు. 15వ వార్డులో బీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థి, మాజీ కౌన్సిలర్ మారబోయిన పాండు గెలుపు కోసం పరితపిస్తుండగా, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు కూడా బలమైన ప్రచారంతో పోటీని హోరాహోరీగా మార్చారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో 30 మంది రెబల్స్ పోటీలో ఉండడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల వ్యూహాలు ఒక్కసారిగా మారిపోయాయి.
స్టేషన్‌లోనూ నువ్వా నేనా?
స్టేషన్‌ఘన్‌పూర్ 5వ వార్డులో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. స్టేషన్‌ఘన్‌పూర్‌లో 1, 5, 4, 10, 14వ వార్డుల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ నెలకొంది. 16వ వార్డులో కాంగ్రెస్ రెబల్ గట్టి పోటీ ఇస్తుండగా, 17వ వార్డులో బీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థి బరిలో నిలిచారు. స్టేషన్‌లో కూడా ఓటుకు రూ.2 వేల నుంచి రూ.4వేల వరకు పంపిణీ చేసినట్లు సమాచారం.
ఓటుకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు
డబ్బు, మద్యం, చీరలు, వెండికాయిన్లు
‘మాకు తక్కువ ఎందుకిస్తున్నారు..?’
అంటూ పలు వార్డుల్లో ఓటర్ల ఆగ్రహం
రెండు మున్సిపాలిటీల్లో 48వార్డులు..
బరిలో 209 మంది అభ్యర్థులు
ఎవరూ తగ్గట్లే!
ఈసారి పురపోరులో ఓట్ల కొనుగోలుకు సంబంధించిన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు మున్సిపాలిటీల్లో చాలా వార్డుల్లో ఒక్కో ఓటుకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు ఇవ్వడం జరుగుతుండగా, కొన్నిచోట్ల స్వతంత్ర అభ్యర్థులు రూ.4వేల నుంచి కేవలం రూ.500, వెండి ఉంగరం ఇస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు. కొన్ని వార్డుల్లో రూ.4వేలు, మద్యం బాటిల్, గిఫ్టులు, చీరలు పంపిణీ చేసినట్లు సమాచారం. ఆయా వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఇప్పటికే రెండు మూడు విడతల్లో రూ.ఐదు వేల వరకు పంపిణీ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. స్వతంత్రులు మాత్రం అప్పులు చేసి ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఒకచోట రూ.4,000, మరోచోట రూ.2,000, ఇంకోచోట రూ.2,500 పంపిణీ చేస్తున్న సమయంలో పక్క వార్డుల ఓటర్లు తమకు తక్కువ ఎందుకిస్తున్నారు? అంటూ అభ్యర్థులను నిలదీశారు.
ఉత్కంఠ
గత రెండు ఎన్నికల్లో చోటుచేసుకున్న ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకొని ఈసారి పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. మొత్తం 750 మంది పోలీసు బలగాలను రంగంలోకి దించారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ ప్రత్యక్ష పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. జనగామలో 8, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 4 పోలింగ్ కేంద్రాలను క్రిటికల్ స్టేషన్లుగా గుర్తించి, అక్కడ ఎస్సై స్థాయి అధికారులను మోహరించారు. మొత్తం పోలింగ్ ప్రక్రియ అంతా సీసీ కెమెరాలు, మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో సాగనుంది.


