పరిష్కారమేది ?
స్వీకరణతో
సరి !
జనగామ రూరల్: ప్రజా సమస్యలపై దరఖాస్తులు తీసుకోవడమే తప్పా పరిష్కారం కావడం లేదని సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన గ్రీవెన్స్‌లో ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్ తదితర అధికారులు ప్రజల నుంచి 43 దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను తీర్చడానికి అధికారులు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై ఇచ్చిన దరఖాస్తులను తీసుకోని సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణి అనంతరం వివిధ అంశాలపై అధికారులతో కలెక్టర్ రిజ్వాన్ బాషా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో ఆధార్ అప్‌డేషన్ ప్రక్రియలో ఆధార్‌లో మార్పులు, చేర్పుల్లో జిల్లా టాప్‌లో ఉందని ఇలాగే కొనసాగేలా మానటరింగ్ కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. జిల్లాలో సరిపడా యూరియా స్టాక్ అందుబాటులో ఉందని మండల స్పెషల్ అధికారులు, తహసీల్దార్‌లు ఫర్టిలైజర్ షాప్‌లను పర్యవేక్షణ చేస్తూ రైతుల అవసరాలకు సరిపడా యూరియా సరఫరా అయ్యేలా చూడాలన్నారు. జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టళ్లలో మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. పీఎం పోషణ్ యాప్‌లో వంద శాతం ఎప్పటికప్పుడు డేటా ఎంట్రీ జరగాలన్నారు. జిల్లాలో మినీ మేడారం జాతరలు జరిగే ప్రాంతాల్లో వివిధ శాఖలకు అప్పగించిన బాధ్యతలను త్వరగా చేపట్టాలని భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు, జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
వినతుల్లో కొన్ని..
● రేషన్ కార్డు నెంబర్ ఆన్‌లైన్‌లో తప్పుగా పడడంతో ఇల్లు మంజూరు కాలేదని, సాక్షన్ ఆర్డర్ కాపీ అగిపోయిందని రఘునాథపల్లి మండల కేంద్రానికి చెందిన పాలమాకుల భాగ్య, నరేశ్ దంపతులు వినతి పత్రం అందించారు. సంబంధిత అధికారులకు తెలిపినా ఫలితం లేదన్నారు. అద్దె ఇంటిలో ఉంటూ ఇబ్బందులు పడుతున్నామని, విచారణ చేపట్టి ఇల్లు మంజూరయ్యేలా చూడాలని కలెక్టర్‌ను కోరారు.
● వారసత్వంగా వస్తున్న భూమి ఖాస్తులో ఉండగా తన పేరా భూమిని పట్టా చేయాలని పాలకుర్తి మండలం శాతపురం గ్రామానికి చెందిన దురా్గానీ సురేశ్ వినతి పత్రం అందించారు. గ్రామంలో సర్వే నెంబర్ 119బై1బై1లో 2.28 ఎకరాల భూమి అమ్మమ్మ దుర్గానీ మల్లమ్మ పేరు మీద ఉందని, తమకు తెలియకుండా మరో వ్యక్తి అక్రమంగా పట్టా చేసుకున్నారని విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరారు.
● తన భర్త వేల్పూల యాదగిరి పేరు మీద సర్వే నెంబర్ 63 సీ2,3 లో 23 గుంటల భూమి ఉందని, పట్టా పాస్ బుక్‌కూడ వచ్చిందని, గ్రామంలో కొంత మంది వ్యక్తులు 4 ఏళ్ల క్రితం ఉన్న భూమి అక్రమంగా పట్టా చేసుకున్నారని చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామానికి చెందిన వేల్పూల సరోజన వినతి పత్రం అందించింది. తమకు రావల్సిన రైతుభరోసా, ఇతర పథకాలు అందడం లేదని విచారణ చేపట్టి తన భర్త భూమిని తన పేరా పట్టా చేయాలని కోరింది.
రేషన్‌షాపు మంజూరు చేయాలి
నా పేరు లింగమూర్తి, దివ్యాంగుడిని. నా భార్య కూడా దివ్యాంగురాలు. మాకు గ్రామంలో ఎలాంటి ఆధారం లేదు. పెన్షన్‌తో కాలం వెళ్లదీస్తున్నాం. పిల్లల చదువులు, ఇతర అవసరాలు తీరడం లేదు. గ్రామంలో రెండు వేలకు పైగా జనాభా.. 1,050 రేషన్ కార్డులు ఉన్నాయి. గ్రామంలో ఒకే రేషన్ షాపు ఉంది. మాకు రేషన్ షాపు మంజూరు చేసి ఉపాధి చూపాలి.
– పిల్లి లింగమూర్తి, మీదికొండ, స్టేషన్‌ఘన్‌పూర్
●
ప్రజావాణిలో దరఖాస్తుదారుల ఆవేదన
ఏళ్ల తరబడిగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నామని వెల్లడి
కలెక్టరేట్ ప్రజావాణిలో 43 దరఖాస్తులు
పరిష్కారమేది ?


