జనగామ రూరల్: పరిపాలన సౌలభ్యంకోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. కానీ అక్కడ ఎలాంటి వసతులు కల్పించకపోవడంతో సమస్యలు పరిష్కారం కాక తిష్ఠవేసుకొని ఉన్నాయి. ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకులు తీసుకునే అవకాశం లేక కిలో మీటర్ల మేర ఇతర గ్రామాలకు వెళ్లి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. కొత్త జీపీలకు రేషన్ షాపులు ఇప్పటి వరకు రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయలేదు. దీంతో దివ్యాంగులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నూతన జీపీలకు రేషన్ షాఫులు కరువు..
జిల్లాలో 281 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో పాతవి 190, నూతనంగా 91 జీపీలు ఏర్పాటు అయ్యాయి. వాటిలో కొన్ని రేషన్ షాపులు ఏర్పాటు కాగా ఇంకా చేయాల్సి ఉంది. జిల్లాలో మొత్తం 335 రేషన్ షాపులు ఉండగా వాటిలో 1,86,294 కార్డులు ఉన్నాయి. కాగా కొత్తగా 24 దుకాణాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. నూతనంగా ఏర్పడిన జీపీల్లో రేషన్ షాపులు ఏర్పాటు చేయలేదు.
జిల్లాలో రేషన్ షాపుల పరిస్థితి
500 జనాభా ఉన్న వాటికి కొత్తగా రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయాలి. కాని ప్రభుత్వ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. జనగామ మండలంలోని పెద్దతండా (ఎం), పెద్దతండా (వై) తండాల వారు మరిగడి, ఎర్రగొల్లపహడ్‌కు వెళ్లి తీసుకోవల్సిన పరిస్థితి ఉంది. అలాగే జఫర్‌గఢ్ మండలంలోని ముగ్థాంతండా, దరాగ్యతండా, లక్ష్మి నాయక్ తండా, ఏంబీ తండాలు నూతనంగా ఏర్పాటయ్యాయి. తండాల వారు రేషన్ కోసం రేగడితండాకు వెళ్లాల్సి ఉంది. మాసిరెడ్డిపల్లి వారు 7 కిలోమీటర్లు ఉప్పుగళ్లుకు వెళ్లి తీసుకుంటున్నారు. తరిగొప్పుల మండలంలోని జాలుబాయి తండా ప్రజలు బొంతగట్టు నాగారానికి వెళ్తున్నారు. లింగాల ఘణపురం మండలంలోని రామచంద్రాగుడెం ప్రజలు జీడికల్‌కు, చిక్కుడుగూడెం ప్రజలు నాగా రం గ్రామానికి, మంధొని గూడెం ప్రజలు మాణిక్యపూరానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. చిల్పూర్ మండలంలో యాపలతోడు తండా పంచంగాల తండా, దేవోజీ తండా, రత్న నాయక్ తండా ప్రజలు లింగంపెల్లికి రేషన్ సరుకుల కోసం వెళ్లాల్సి వస్తోంది. బచ్చన్నపేట మండలం వీఎస్‌ఆర్‌నగర్ వాసులు కట్కూర్‌కు వెళ్తున్నారు. లక్ష్మిపూర్ గ్రామస్తులు బండనాగారానికి, కొడకండ్లలో రాగ్యానాయక్ తండా, గుమ్ముల బండ తండా, కడగుట్టతండా, బోదతండా వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు మూడు కిలోమీటర్లు వెళ్లి తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. పక్క గ్రామాలకు వెళ్లాలంటే ఆటో కిరాయి తీసుకోని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అధికారులు చొరవ తీసుకుని కొత్త జీపీల్లో రేషన్ షాపులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
కొత్త గ్రామపంచాయతీల్లో షాపులెక్కడ?
తీరని సమస్య..కిలోమీటర్ల ప్రయాణం
జిల్లాలో 281 జీపీలు, 1,86,294 రేషన్‌కార్డులు
కొత్తగా ఏర్పడాల్సిన షాపులు 24


