జనగామ: పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎల్‌పీజీ గ్యాస్ సరఫరాపై వినియోగదారులు గందరగోళం చెందుతున్న దృష్టా మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లతో సమీక్షించారు. ఈసందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించే పరిస్థితుల్లో ప్రచారంపై అధికార యంత్రాంగం అ ప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. జిల్లాలో వినియోగదారులకు గ్యాస్ కొరత లేదన్నారు. జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసి, గ్యాస్ నిల్వలు, సరఫరా మీద ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తామన్నారు. అసత్య ప్రచారాలను ఆసరాగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా సిలిండర్లను బ్లాక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీసీలో రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, డీసీపీ రాజమహేంద్రనాయక్, వ్యవసాయ, మార్కెటింగ్, సివిల్ సప్లై తదితర శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో
మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
జిల్లాలో గ్యాస్ కొరత లేదు: కలెక్టర్


