జిల్లాలో పరీక్షల నిర్వహణ వివరాలు
జనగామ: జిల్లా వ్యాప్తంగా ఈనెల 14 (శనివారం) నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. విద్యార్థులు కఠోర శ్రమ, ఆత్మవిశ్వాసంతో ప్రిపరేషన్ అవుతుండగా, విజయోస్తు అంటూ అధికారులు, ఉపాధ్యాయులు దీవిస్తున్నారు. విద్యలో ఉన్నతి సాధించే ఈ కీలక దశలో విద్యార్థులు ఎలాంటి టెన్షన్, ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచిస్తున్నారు. ఈసారి రాష్ట్రంలో జిల్లా అత్యుత్తమ ఫలితాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని జిల్లా విద్యాశాఖ ప్రత్యేక పర్యవేక్షణ చేస్తోంది. ప్రత్యేక తరగతులు, రిమైండర్ క్లాసులతో విద్యార్థుల్లో నమ్మకం పెంపొందించారు.
జిల్లాలో విద్యార్థుల హాజరు,
సెంటర్ల వివరాలు
జిల్లాలో 183 ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలలు ఉండగా, పదో తరగతి పరీక్షలకు 6,645 మంది హాజరు కానున్నారు. కాగా ఒకేషనల్ పరీక్షల కోసం 713 మంది విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. పరీక్షల నిర్వహణ కోసం 39 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల సమయంలో సెంటర్ల పరిసర ప్రాంతాల్లో ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదనపు భద్రత నిమిత్తం 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.
కఠిన నియంత్రణ...సెల్‌ఫోన్లకు నో
పరీక్ష కేంద్రంలో విద్యార్థులు మాత్రమే కాదు, పర్యవేక్షణలో ఉన్న అధికారులు కూడా సెల్‌ఫోన్లు తీసుకురావడం నిషేధం. ప్రశ్నపత్రాలను పోలీస్ ఎస్కార్ట్‌తో ఉదయం పరీక్షలకు ముందు సెంటర్లకు తరలించనున్నారు. ప్రస్తుతం అన్ని పోలీస్ స్టేషన్లలోని స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశ్నపత్రాల బండిల్‌ను ఓపెన్ చేస్తారు. పరీక్షా సమయం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, ఫిజిక్స్, బయాలజీ (సైన్స్) 9.30 నుంచి 11.00 వరకు జరుగనుంది. ఇదిలా ఉండగా ఏప్రిల్ 15న ఒకేషనల్ పరీక్షలు ఉదయం 9.30 నుంచి 11.00 వరకు జరుగుతాయి.
పోలీస్, విద్యాశాఖ ఏర్పాట్లు
పదో తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. పరీక్ష కేంద్రాలు, మార్గాలు అన్ని పర్యవేక్షణలో ఉంటాయి. విద్యాశాఖ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్లు పరీక్షల పరిస్థితిని నిరంతరం పరిశీలించనున్నారు.
పాఠశాలలు 183 (ప్రభుత్వ, ప్రైవేటు)
సెంటర్లు 39
విద్యార్థులు 6,445
ఒకేషనల్ విద్యార్థులు 713
నేటి నుంచి పదో తరగతి
వార్షిక పరీక్షలు
అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ
39 సెంటర్లలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్.. జిరాక్స్ సెంటర్ల మూసివేత


