బ్లాక్ మార్కెట్ దందా...
యుద్ధ ప్రభావంతో బుకింగ్‌ల వెల్లువ
జనగామ: ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగి ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సరఫరాలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితుల ప్రభావం జిల్లాలో కమర్షియల్ గ్యాస్ కస్టమర్లపై తీవ్రంగా పడింది. కమర్షియల్ సిలిండర్ల కొరత నాలుగు రోజులుగా కొనసాగుతుండటంతో హోట ల్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, టీ దుకాణాల కార్యకలాపాలు చాలా చోట్ల స్తంభించాయి. పరిస్థితి ఇంకా అలా గే కొనసాగితే గృహ వినియోగదారులకు కూడా సిలిండర్ల కొరత తప్పదన్న భయం నెలకొంది.
బుకింగ్‌ల వెల్లువ, సర్వర్లు డౌన్
యుద్ధం కారణంగా ధరలు పెరుగుతాయనే ఆందోళన ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో అవసరమున్నా లేకున్నా అడ్వాన్స్‌గా గ్యాస్ కోసం బుకింగ్ చేస్తున్నారు. జనగామ పట్టణంలో రోజుకు 1,000 నుంచి 1,800ల బుకింగ్‌లు వస్తుండగా, మండలాల్లో 150 నుంచి 400 బుకింగ్‌లు నమోదవుతున్నాయి. సాధారణంగా జిల్లా కేంద్రంలో రోజువారీ బుకింగ్‌లు 300 నుంచి 400 మధ్యే ఉండేది. అయితే అత్యవసర భయంతో మూడు రెట్లు పెరగడంతో గ్యాస్ కంపెనీల సర్వర్లు కూడా నిలకడ కోల్పోతున్నాయని ఏజెన్సీ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. బుకింగ్ చేసినా సిలిండర్ సమయానికి రాకపోవడంతో ప్రజలు ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. కొరత లేదు.. ముందస్తు బుకింగ్‌లను చేయవద్దంటూ నిర్వాహకులు చెబుతున్నా వినియోగదారుల భయం తగ్గడం లేదు. ప్రస్తుతం జనగామ పట్టణానికి ప్రతి రోజు 524 సబ్సిడీ సిలిండర్లు వస్తుండగా, మండలాల వారీగా ఇంతే మొత్తంలో వస్తున్నాయి. బుకింగ్‌లు ఒక్కసారిగా పెరగడంతో కొరత ఉన్నట్టు కనిపిస్తోంది.
జిల్లాలో కమర్షియల్ కనెక్షన్లు తక్కువ
జిల్లాలో సబ్సిడీ సిలిండర్ల కనెక్షన్లు 1.60లక్షలు ఉండగా, కమర్షియల్ కనెక్షన్లు 378 మాత్రమే ఉన్నాయి. కానీ కమర్షియల్ సిలిండర్ల సప్లై నాలుగు రోజుల క్రితమే నిలిచిపోయింది. దీంతో కలెక్టరేట్‌లోని క్యాంటిన్ నిర్వాహకులు కట్టెల పొయ్యిలను ఉపయోగించి రోజువారీ కార్యకలాపాలు నెట్టుకొస్తున్నారు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, టీ దుకాణాల్లో అయితే పరిస్థితి మరింత దారుణం. నాలుగు రోజులుగా కమర్షియల్ సిలిండర్లు లేకపోయినా, పలు హోటళ్లు వాటితో వ్యాపారం చేయడంపై గ్యాస్ ఏజెన్సీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ది గుమతి నిలిచిపోయిన కమర్షియల్ సిలిండర్లు ఎక్కడ నుంచి వస్తున్నాయని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. సబ్సిడీ గృహ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో కొనుగోలు చేసి, వాటిని కమర్షియల్ సిలిండర్లలో రీఫిల్ చేస్తున్నారనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం ఓఎస్‌డీ ప్రభాకర్, లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో భారీ తనిఖీలు చేపట్టారు. 18 హోటల్స్, టిఫిన్ సెంటర్లలో జరిగిన రైడ్స్‌లో 45 సబ్సిడీ సిలిండర్లను సీజ్ చేశారు. నిర్వాహకులపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇకపై సబ్సిడీ సిలిండర్లను కమర్షియల్‌గా వాడితే కఠిన చర్యలు తప్పవని, జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని హెచ్చరించారు. వారి వెంట జనగామ అధికారులు ఇట్టబోయిన శ్రీనివాస్, లచ్చు నాయక్ ఉన్నారు.
జిల్లాలో గ్యాస్ కొరత లేదు. ఆందోళనతో ఒక్కసారిగా బుకింగ్ చేసుకుని, ఇంకా సిలిండర్లు సప్లై చేయడం లేదని మా వద్దకు వస్తున్నారు. రోజు వారీగా సిలిండర్లతో వచ్చే లోడ్‌ను వినియోగదారులకు ఇంటింటికీ వెళ్లి అందిస్తున్నాం. కమర్షియల్ సిలిండర్ల సప్లై నాలుగు రోజుల క్రితమే నిలిచి పోయింది. సబ్సిడీ సిలిండర్ల కొరత ఏ మాత్రం లేదు.
– కాశీ విశ్వనాథం,
గ్యాస్ ఏజెన్సీ మేనేజర్, జనగామ
కమర్షియల్ సిలిండర్ సాధారణ ధర రూ.2,100 ఉండగా, ప్రస్తుతం బ్లాక్ మార్కెట్‌లో రూ.2,500 నుంచి రూ.3,000 వరకు అమ్ముతున్నట్లు సమాచారం. ఇక సబ్సిడీ సిలిండర్లను కూడా కొందరు అదనపు ధరలకు కొనుగోలు చేసి, మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు ప్రచారం ఉంది. ప్రస్తుత సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుంటున్న దళారులకు అధికారులు చెక్ పెట్టాల్సిన అవసరం పెరిగింది. ఇప్పటికిప్పుడు గృహ వినియోగదారులకు సబ్సిడీ సిలిండర్ల కొరత లేకున్నప్పటికీ, బుకింగ్‌లు విపరీతంగా పెరగటం, కమర్షియల్ మార్కెట్ ఇప్పటికే కుప్పకూలడంతో పరిస్థితి ఇలాగే కొనసాగితే డొమెస్టిక్ సిలిండర్ సరఫరాపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని తెలుస్తోంది. దీంతో ముందే డబుల్ సిలిండర్ తీసుకుని నిల్వ చేసుకో వడానికి ప్రయత్నిస్తున్నారు. కట్టెల కొరత ప్రస్తుతం లేకున్నప్పటికీ, జిల్లాలో కర్రలు క్వింటాళుకు రూ.700 ధర పలుకుతోంది.
పట్టణంలో రోజుకు వెయ్యి నుంచి 1,800 బుకింగ్‌లు
నిలిచిన సప్లై..
బ్లాక్ మార్కెట్‌లో
రూ.3వేలు..?
18 హోటళ్లపై విజిలెన్స్ రైడ్, 40 సిలిండర్ల సీజ్
గుట్టుచప్పుడు కాకుండా రీఫిల్లింగ్ దందా


