నిత్యావసర వస్తువుల ధరలు ఇలా..
యుద్ధప్రభావం..
సలసలకాగుతున్న వంటనూనె ధరలు
పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు కుదేలవుతున్నాయి. యుద్ధ ప్రభావం భారత్‌లోని ఇంధన, నిత్యావసర సరుకుల మార్కెట్‌పై పడుతోంది. దిగుమతి చేసుకునే సరుకుల రవాణా ఖర్చులు యుద్ధం కారణంగా పెరిగాయి. దీంతో పాటు పలు వస్తువులు పశ్చిమాసియా నుంచి రావాల్సి ఉండడం కూడా ధరల పెరు గుదలకు మరో కారణం. యుద్ధం మరింత కాలం కొనసాగితే ధరా భారం తీవ్రం కానుంది.
జనగామ: ఇప్పటికే గ్యాస్ ధరలు పెరిగి గృహ బడ్జెట్‌కు భారంగా మారాయి. సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌పై రూ.60, కమర్షియల్ సిలిండర్‌పై రూ.114 వరకూ పెరగడం సాధారణ కుటుంబాలకు పెద్ద దెబ్బగా మారింది. వంటనూనెల ధరలు కూడా మండిపోతున్నాయి. సన్‌ఫ్లవర్, పామాయిల్ తదితర నూనెల దిగుమతులకు అంతరాయం కలగడంతో ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గతంలో లీటర్‌కు రూ.155 ఉన్న సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్రస్తుతం రూ.170కు చేరింది. 5 లీటర్ల క్యాన్ రూ.780 నుంచి రూ.880కూ, 15 లీటర్ల క్యాన్ రూ.2380 నుంచి రూ.2480 వరకు పెరిగాయి. పామాయిల్ ప్యాకెట్ ధర రూ.111 నుంచి రూ.120కు చేరింది. రైస్‌బ్రాన్ ఆయిల్‌లో లీటర్‌కు రూ.10 చొప్పున పెరుగుదల నమోదైంది.
ఇతర నిత్యావసరాలపై కూడా..
ఒకవైపు నూనెల ధరలు పెరుగుతుండగా, మరోవైపు వెల్లుల్లి, పల్లీల ధరలు వినియోగదారులను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కిలో పల్లీలు రూ.120 నుంచి రూ.165కు పెరగడం గమనార్హం. వెల్లుల్లి ధర రూ.120 నుంచి రూ.150కు ఎగబాకింది. దీంతో పల్లీల ఆధా రంగా తయారయ్యే అనేక ఉత్పత్తుల ధరలపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ప్లాస్టిక్ ఉత్పత్తుల మార్కెట్లో కూడా ధరల పెరుగుదల వేగం తగ్గడం లేదు. గ్యాస్ ఆధారిత తయారీ కావడంతో మినీ వాటర్ గ్లాసుల ప్యాకెట్ ధర రూ.25 నుంచి రూ.35, జంబో గ్లాసుల ప్యాకెట్ రూ.35 నుంచి రూ.60కు పెరిగింది. హ్యాండిల్ కవర్ల కిలో ధర రూ.120 నుంచి రూ.170, బిగ్ సైజ్ కవర్లు రూ.145 నుంచి రూ.220కు పెరగడం చిన్న వ్యాపారులను, రిటైల్ షాపులను ఇబ్బందుల్లోకి నెడుతోంది. యుద్ధం కొనసాగుతున్నంతకాలం ధరలు ఇంకా ఎక్కడికి చేరతాయో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలావుండగా, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ బుకింగ్ తేదీలను పెంచడం కూడా కొరత భయాన్ని మరింత పెంచింది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో స్పష్టత లేకపోవడంతో రాబోయే రోజుల్లో ధరలు స్థిరపడతాయా, సరుకుల కొరత మరింత పెరుగుతుందా అనే అంశాలపై వినియోగదారులు, వ్యాపార వర్గాలు తీవ్ర అనిశ్చితిలో ఉన్నారు.
– సిరిపాటి రాందాస్,
గోపాల్‌నగర్, బచ్చన్నపేట
వెల్లుల్లి, పల్లి, ఇతర నిత్యావసర
సరుకులది అదే తీరు
దిగుమతి వస్తువులపై రవాణా
భారమే కారణం
ప్లాస్టిక్ ఉత్పత్తుల ధరలు కూడా పెంపు
పేద, మధ్యతరగతి ప్రజలకు భారం
వస్తువు గత ధర ప్రస్తుతం ధర పెరిగిన ధర
సబ్సిడీ సిలిండర్ రూ.907.50 రూ.957.50 రూ.60
కమర్షియల్ సిలిండర్ రూ.1,997 రూ.2,111 రూ.114
సన్‌ఫ్లవర్ ఆయిల్ (1 లీ.) రూ.155 రూ.170 రూ.15
సన్‌ఫ్లవర్ క్యాన్ (5 లీ.) రూ.780 రూ.880 రూ.100
సన్‌ఫ్లవర్ క్యాన్ (15 లీ.) రూ.2380 రూ.2,480 రూ.100
రైస్‌బ్రాన్ ఆయిల్ (1 లీ.) రూ.160 రూ.175 రూ.10
పామాయిల్ ప్యాకెట్ రూ.111 రూ.120 రూ.09
పల్లీలు (1 కిలో) రూ.120 రూ.165 రూ.45
వెల్లుల్లి (1 కిలో) రూ.120 రూ.150 రూ.30


