జనగామ: జనగామ, బచ్చన్నపేట మండలాల పరిధిలోని విద్యుత్ వినియోగదారుల సమస్యలను తెలుసుకొని వాటికి తక్షణ పరిష్కారం చూపే లక్ష్యంతో ఎన్పీడీసీఎల్ శాఖ వినియోగదారుల ఫోరం ఆధ్వర్యంలో ఈనెల 13న (శుక్రవారం) ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఫోరం చైర్‌పర్సన్ ఎన్‌వీ వెంకటగోపాలచారి గురువారం తెలిపారు. జనగామ మండలం పెంబర్తి ఓల్డ్ సబ్‌స్టేషన్ కార్యాలయ ఆవరణలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. సమావేశంలో వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను రాతపూర్వకంగా సమర్పించవచ్చన్నారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్ల మార్పిడి, ఓల్టేజి హెచ్చుతగ్గులు, లోపాలు ఉన్న మీటర్ల మార్పు, కొత్త సర్వీసుల మంజూరు తదితర సమస్యలను వినియోగదారులు తమ దృష్టికి తీసుకు రావచ్చన్నారు.
కృత్రిమ మేధానైపుణ్యాలను పెంపొందించుకోవాలి
కేయూ క్యాంపస్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ముందంజలో నిలవాలంటే కృత్రిమ మేధా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి కోరారు. యూనివర్సిటీలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు గురువారం రూసా 2 ప్రాజెక్టు కింద రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాళ్లు ప్రొఫెసర్లు ఎన్.రమణ, కెభిక్షాలు, డాక్టర్ ఆసిం ఇక్బాల్, మహేందర్‌తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా దశమంత్‌రెడ్డి
జనగామ: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నాయకులు ఆరుట్ల దశమంతరెడ్డిని నియమిస్తూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ కార్యకలాపాలను ప్రజలకు చేరవేయడం, పార్టీ అభిప్రాయాలను సమర్థవంతంగా ప్రతిబింబించడం వంటి కీలక బాధ్యతలు రాష్ట్ర అధికార ప్రతినిధులపై ఉంటాయని ఆయన తెలిపారు.
మిర్చి యార్డులో దడవాయిల జీరో దందా
వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లోని మిర్చి యార్డులో కొంతమంది దడవాయిలు జీరో దందా యథేచ్ఛగా సాగిస్తున్నట్లు వెలుగుచూసింది. బుధవారం వచ్చిన మిర్చికి పలికిన ధరలను మార్కెట్ అధికారులు ఆన్‌లైన్‌లో పరిశీలించగా కొంతమంది రైతుల సరుకులకు సగం ధరలు పలికినట్లు వెల్లడి కావడంతో ఈ దందా వెలుగు చూసింది. ఇందుకు కారణమైన దడవాయిలు తూర్పాటి రమేష్, నిమ్మాని నాంపల్లి, ఆకుతోట సతీష్‌లకు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేషం నోటీసులు జారీ చేసి గురువారం వీరికి డ్యూటీలు వేయవద్దని ఆదేశాలు జారీ చేశారు. దందా కొన్నేళ్లుగా సాగుతున్నట్లు మార్కెట్‌లో చర్చించుకుంటున్నారు.


