రెండు పనిదినాల్లో పరిష్కారం..
ఖిలా వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆర్టీఏ సేవలన్నీ వందశాతం ఆన్‌లైన్‌లోకి తెచ్చింది. శుక్రవారం నుంచి పేపర్ రహిత సేవలను పక్కాగా అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రవాణాశాఖ అధికారులు కార్యాలయాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. జనవరి 24 నుంచి వాహనాలు విక్రయించిన షోరూంలలోనే నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహన రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ విధానాన్ని రవాణాశాఖ డిప్యూటీ ట్రాన్స్‌ఫోర్ట్ కమిషనర్ సురేశ్‌రెడ్డి పర్యవేక్షణలో ఆరు జిల్లాల షోరూం డీలర్ల వద్ద తాత్కాలిక, పర్మనెంట్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.
దరఖాస్తుల సమర్పణ ఆన్‌లైన్‌లోనే..
వాహనాల శాశ్వత నమోదు కోసం షోరూం డీలర్ల వద్ద దరఖాస్తుల సమర్పణకు బదులుగా వందశాతం పేపర్ రహిత ఆన్‌లైన్ విధానం అమలు చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. డీలర్లు.. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం ఫామ్ –20 (ఫైనాన్షియర్ సంతకం అవసరమైతే), ఇతర పేపర్ ఆధారిత ప్రతాలను స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా సంబంధిత ఆర్టీఏ కార్యాలయాలకు పంపిస్తున్నారు. ఈ విధానం వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆలస్యం జరుగుతున్నట్లు రవాణాశాఖ గుర్తించింది. అన్ని పత్రాలు స్కాన్ చేసి ఆన్‌లైన్ పంపిస్తే అధికారులు పరిశీలించి ఆదే రోజు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయింపుతోపాటు కార్డు జారీకి ఆదేశాలు వెళ్లనున్నాయి.
నేటినుంచి పేపర్‌రహిత సేవలు ..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయాల్లో, షోరూం డీలర్లకు ఫామ్ 20, ఇతర పేపర్ పత్రాలను నేరుగా సమర్పించే విధానాన్ని పూర్తిగా రద్దు చేసి శుక్రవారం ఉదయం నుంచి వాహన షోరూంలో జరిగే తాత్కాలిక రిజిస్ట్రేషన్(టీఆర్) వాహనాలకు, డీలర్లు ఫామ్ –20, ఇతర పత్రాలు స్కాన్ కాపీలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వాహనం తీసుకోగానే పత్రాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేసే బాధ్యత డీలర్లదే. తప్పుడు లేదా నకిలీ పత్రాలు సమర్పిస్తే క్రిమినల్ చర్యలు ఉంటాయని డీటీసీ సురేశ్‌రెడ్డి స్పష్టం చేశారు.
నేటినుంచి వందశాతం పేపర్ రహిత సేవలు
ఫామ్20, ఇతర పత్రాలు నేరుగా సమర్పించే విధానం రద్దు
పత్రాలన్నీ స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సిందే..
ఆర్టీఏ కార్యాలయాల్లో పక్కాగా అమలుకు నిర్ణయం
వాహన షోరూం డీలర్ నుంచి ఆర్టీఏ కార్యాలయానికి ఆన్‌లైన్‌లో పంపించిన దరఖాస్తులను రెండు పనిదినాల్లో అధికారులు పరిశీలించి ఆమోదం లేదా రివ్యూ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆలస్యం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటాం. డీలర్ల వద్ద 7రోజులకు మించి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచకూడదు. ఉల్లంఘన జరిగితే వారి లాగిన్ నిలిపివేస్తారు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. డీలర్లు అందరూ ఆన్‌లైన్ సేవలను వినియోగించుకుని, వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఫామ్ 20, ఇతర పత్రాలను ఆన్‌లైన్ విధానంలోనే సమర్పించాలి.
– సురేశ్‌రెడ్డి, డీటీసీ


