
ట్రంప్ యంత్రాంగం సమూల మార్పులు
నూతన విధానం ఈ నెల 20 నుంచే అమల్లోకి
వాషింగ్టన్: అమెరికాలో ఉంటున్న వేలాదిమంది భారతీయులు ఏళ్లుగా ఎదురుచూస్తున్న గ్రీన్ కార్డ్ పైనా ట్రంప్ ప్రభుత్వం దృష్టిపడింది. ఇటీవలే భారతీయులు ఎక్కువగా ఉపయోగించుకునే హెచ్1బీ వీసాపై కఠిన చర్యలను ప్రకటించడం తెల్సిందే. ఇప్పుడిక గ్రీన్‌కార్డు దరఖాస్తుదారుల ఇంటర్వ్యూ ప్రక్రియలో కఠినతరమైన నిబంధనలను ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చింది.
ఇందులో భాగంగా ఇంటర్వ్యూల పరిధి మరింత విస్తృతం కానుంది. పరీక్ష కూడా కఠినంగా మారనుంది. దరఖాస్తుదారుల సత్ప్రవర్తనపై ఇమిగ్రేషన్ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేపడతారు. కొత్త విధానం ఈ నెల 20వ తేదీ నుంచే అమల్లోకి రానుండటం గమనార్హం. అమెరికా విలువలను పూర్తిగా స్వీకరించే వారు మాత్రమే పౌరులయ్యేలా చూడటమే ఈ మార్పుల లక్ష్యమని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) చెబుతోంది.
ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూలు నిర్వహించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా హోమ్‌ల్యాండ్ డిఫెండర్స్ పేరుతో అధికారులను కూడా నియమిస్తోంది. అయితే, దరఖాస్తు దారులకు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి రెండంటే రెండు అవకాశాలు మాత్రమే ఉంటాయి. రెండో ప్రయత్నంలో విఫలమైతే వారికి పౌరస త్వాన్ని తిరస్కరిస్తారని తెలిపింది. అమెరికా లో ఒక వ్యక్తిని శాశ్వత నివాసి అని చూపే అధికారిక గుర్తింపు పత్రమే గ్రీన్ కార్డ్. హోల్డర్లను అధికారికంగా చట్టబద్ధమైన శాశ్వత నివాసులుగా పిలుస్తారు.
ఈ విధానం సమగ్రతను స్థాపించడమే తాజా మార్పుల లక్ష్యమని యూఎస్‌సీఐఎస్ అంటున్నప్పటికీ, వలసదారుల ఉద్దేశాలను సందేహించే అవకాశం ఉందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పౌరశాస్త్ర పరీక్ష. కొత్తగా ప్రవేశపెట్టే ఈ పరీక్షలో దరఖాస్తుదారులకు అమెరికా చరిత్ర, ప్రభుత్వంపై ఉన్న అవగాహనను అంచనా వేస్తారు. మొత్తం 128 ప్రశ్నల నుంచి దరఖాస్తుదారులు 20 ప్రశ్నలను ఎన్నుకుని 12 ప్రశ్నలకు సమాధానం సరిగ్గా ఇవ్వాల్సి ఉంటుంది.
గతంలో 10 ప్రశ్నల్లో ఆరింటికి సరైన సమాధానం ఇవ్వాల్సి ఉండేది. ఈ పరీక్షతోపాటు అభ్యర్థుల సత్ప్రవర్తనను ఇమిగ్రేషన్ అధికారులు అంచనా వేయడం కూడా కఠినతరమైందే. కేవలం నేర రహిత ప్రవర్తన ఉంటే చాలదు. అమెరికా సమాజానికి సానుకూలంగా చేసిన మేలును కూడా చూస్తారు. ఇందులో, 1991 నుంచి వారి చుట్టుపక్కల వారిని సైతం విచారిస్తారు. దరఖాస్తుదారులు తెలిసిన సహ ఉద్యోగులు, సంబంధిత సంస్థల యజమానులు, ఇతరులను కూడా ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూలు చేసి, ప్రవర్తనను బేరీజు వేస్తారు.
ఇందులోనూ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండొచ్చు. దీని వల్ల భారతీయులపై ప్రత్యేకంగా వివక్ష చూపే అవకాశముందన్న ఆందోళనలు వ్యక్తమవుతు న్నాయి. అమెరికాలోని వలసదారుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. వేలాది మంది భారతీయులకు గ్రీన్‌కార్డు ఉంది. పెద్ద సంఖ్యలో భారతీయులు ఎన్నో ఏళ్లుగా ఈ ‘పచ్చకార్డు’కోసం ఎదురు చూస్తున్నారు. 2024 గణాంకాల ప్రకారం అమెరికా పౌరుల్లో 6.1 శాతం, అంటే 49,700 మంది భారతీయులున్నారు. ఈ విషయంలో అమెరికాకు పొరుగునున్న మెక్సికో మొదటిస్థానంలో నిలిచింది.