రష్యాలో కొత్త వైరస్‌పై ఆందోళన.. భారత్‌కు ముప్పు ఉందా? | What we know about the plague scare in Russia Details Here | Sakshi
Sakshi News home page

రష్యాలో కొత్త వైరస్‌పై ఆందోళన.. భారత్‌కు ముప్పు ఉందా?

Oct 7 2026 9:09 AM | Updated on Oct 7 2026 9:21 AM

What we know about the plague scare in Russia Details Here

రష్యాలోని సైబీరియాలో ఓ యాంటీ-ప్లేగు పరిశోధనా సంస్థలో పనిచేసే 28 ఏళ్ల యువతి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఆమె ప్లేగుతో చనిపోయిందన్న ప్రచారం మొదలైనప్పటికీ.. రష్యా అధికారులు మాత్రం దీనిని ఖండిస్తున్నారు. అయితే మృతురాలితో సంబంధం ఉన్నవారిని వైద్య పర్యవేక్షణలో ఉంచడం, ల్యాబ్‌ సిబ్బందిని ఐసోలేషన్‌లో పెట్టడం, కొన్ని ఆసుపత్రుల్లో అదనపు ఆంక్షలు విధించడం అనుమానాలకు తెరలేపింది. దీంతో అసలు ఏం జరిగింది? ఆమెకు సోకింది ప్లేగేనా? ల్యాబ్‌లో ఏదైనా ప్రమాదం జరిగిందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా బయో ల్యాబ్‌లో చోటుచేసుకున్న ఈ మరణంపై సీఎన్‌ఎన్‌ సహా అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడటం మరింత ఆసక్తిని రేపుతోంది.

అసలు ఏం జరిగిందంటే.. ఇర్కుట్స్క్‌ యాంటీ ప్లేగు రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేసే దర్యా షిపిలోవా సెప్టెంబర్‌ 29న ఆసుపత్రిలో చేరినట్లు రష్యా, స్థానిక మీడియా కథనాలు తెలిపాయి. అక్టోబర్‌ 2న ఆమె మరణించింది. రష్యా ఆరోగ్య పర్యవేక్షణ సంస్థ రోస్పోట్రెబ్నాడ్జోర్‌ ప్రకారం.. ఆమెకు ‘తెలియని కారణంతో వచ్చిన న్యూమోనియా’ ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆమె మృతదేహంలో ఆమె పనిచేసిన ల్యాబ్‌కు సంబంధం ఉన్న ప్రమాదకర సూక్ష్మజీవులు గుర్తించలేదని అధికారులు తెలిపారు. కాగా, కొన్ని స్థానిక, అంతర్జాతీయ మీడియా కథనాల్లో ఆమె ప్లేగు పరిశోధన సమయంలో అనుకోకుండా వ్యాధికారక పదార్థానికి గురై ఉండొచ్చన్న కథనాలు వెలువడ్డాయి. ముఖ్యంగా ‘ప్లేగు బ్యాక్టీరియా ఉన్న టెస్ట్‌ ట్యూబ్‌ పగిలింది’ అన్న వాదన కూడా ప్రచారంలోకి వచ్చింది.

దీంతో, యువతి మృతితో ఆమె పనిచేసిన సంస్థలోని 60 మందికి పైగా సిబ్బందిని ఐసోలేషన్‌లో ఉంచినట్లు వార్తలు వచ్చాయి. ఆమెతో పరిచయం ఉన్న పలువురిని కూడా వైద్య పర్యవేక్షణలోకి తీసుకున్నారు. కొన్ని నివేదికల ప్రకారం దాదాపు 200 మందిని పరిశీలనలో ఉంచారు. ఇదే సమయంలో ఇర్కుట్స్క్‌ ప్రాంతంలోని కొన్ని ఆసుపత్రుల్లోనూ అదనపు ఆంక్షలు అమలు చేయడంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది. ముఖ్యంగా కొన్ని ఆసుపత్రుల్లో ‘అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి ప్లేగు’ అనుమానిత లక్షణాలపై ఉన్నట్టు ఆసుపత్రి పత్రుల్లో పేర్కొన్నట్టు సమాచారం బయటకు వచ్చింది. దీంతో అధికారులు ఏదో విషయాన్ని దాచిపెడుతున్నారన్న అనుమానాలు సోషల్‌ మీడియాలో వెల్లువెత్తాయి. అయితే రష్యా ప్రభుత్వం మాత్రం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని చెబుతోంది.

ప్లేగు భయానికి కారణమేంటి?
రష్యాలోని ఇర్కుట్స్క్‌ ప్రాంతంలో ఉన్న ఈ సంస్థ సాధారణ ఆసుపత్రి కాదు. ప్లేగు సహా అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధులపై పరిశోధనలు, పర్యవేక్షణ చేసే ప్రత్యేక సంస్థ. అందుకే అక్కడ పనిచేసే ఉద్యోగి అనుమానాస్పద న్యూమోనియాతో మరణించడం సహజంగానే ప్రపంచ ఆరోగ్య సంస్థలు, ఇతర దేశాల దృష్టిని ఆకర్షించింది. అయితే, ఇప్పటివరకు ప్లేగు కేసు అధికారికంగా నిర్ధారణ కాలేదు. రష్యా అధికారులు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కి ఇర్కుట్స్క్‌లో ప్లేగు కేసులు నమోదు కాలేదని తెలిపారు. మృతురాలితో సంబంధం ఉన్న వ్యక్తులను పరీక్షించగా వారిలోనూ ప్రమాదకర వ్యాధికారకాలు గుర్తించలేదని చెప్పారు. ఇక, ఈ ఘటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ రష్యా అధికారులతో నేరుగా సంప్రదింపులు జరిపింది. దీనికి సంబంధించిన పరిస్థితులు, నిర్వహించిన పరీక్షలు, వాటి ఫలితాలపై వివరాలు కోరింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి రష్యా వెలుపల ప్రజారోగ్య ముప్పు చాలా తక్కువగా ఉందని WHO అంచనా వేసింది. రష్యా అధికారులు కూడా ఇర్కుట్స్క్‌లో ప్లేగు కేసు లేదని స్పష్టం చేశారు.

ట్రంప్‌ ఏమన్నారు?
రష్యా ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా స్పందించారు. ఈ అంశంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో త్వరలో ఫోన్‌లో మాట్లాడనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కేసుపై అమెరికా నిఘా వర్గాలు ‘చాలా లోతుగా’ పరిశీలిస్తున్నాయని, మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. అంతకుముందు ట్రంప్‌.. అవసరమైతే రష్యాకు ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అమెరికా సాయం చేస్తుందని చెప్పారు. వ్యాధికారక సూక్ష్మజీవులు గతంతో పోలిస్తే మరింత బలంగా మారుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా రష్యా ఈ ఘటనపై ప్రపంచానికి మరింత సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని అన్నారు.

భారత్‌కు ముప్పు ఉందా?
ప్రస్తుతం భారత్‌ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పడానికి అందుబాటులో ఉన్న సమాచారం సరిపోతుంది. దీనికి ప్రధాన కారణం రష్యాలోనే ప్లేగు కేసు ఇంకా అధికారికంగా నిర్ధారణ కాకపోవడం. అంతేకాదు, మృతురాలితో సంబంధం ఉన్నవారిలో ప్రమాదకర వ్యాధికారకాలు గుర్తించలేదని రష్యా అధికారులు WHOకి తెలిపారు. అయితే పరిస్థితి పూర్తిగా స్పష్టమయ్యే వరకు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు నిఘా కొనసాగించడం సహజమే. ఒకవేళ న్యూమోనిక్‌ ప్లేగు నిర్ధారణైతే.. అది శ్వాసకోశ బిందువుల ద్వారా మనుషుల మధ్య వ్యాపించే అవకాశం ఉన్నందున సన్నిహిత కాంటాక్టులను గుర్తించడం, ఐసోలేషన్‌, పరీక్షలు, త్వరిత చికిత్స కీలకంగా మారతాయి. ప్లేగుకు యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందుబాటులో ఉంది. మరోవైపు రష్యాలోని పరిణామాల నేపథ్యంలో మధ్య ఆసియా దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి. కజకిస్థాన్‌, కిర్గిజిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, తజికిస్థాన్‌ సరిహద్దుల్లో ఆరోగ్య నియంత్రణ చర్యలను పెంచినట్లు నివేదికలు వెల్లడించాయి.

రష్యా ఎందుకు ఇలా చేస్తోంది?
ఇదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది. రష్యా అధికారులు మాత్రం ఎలాంటి ప్లేగు వ్యాప్తి లేదని చెబుతున్నారు. మరోవైపు ల్యాబ్‌ సిబ్బందిని ఐసోలేషన్‌లో పెట్టడం, ఆసుపత్రుల్లో అదనపు ఆంక్షలు విధించడం వంటి చర్యలు చేపట్టడంతో ప్రజల్లో అనుమానాలు పెరిగాయి. అయితే ముందస్తు జాగ్రత్తగా కాంటాక్టులను పర్యవేక్షించడం, ఐసోలేషన్‌లో ఉంచడం వంటి చర్యలు ప్రమాదకర అంటువ్యాధి అనుమానం వచ్చినప్పుడు సాధారణ ప్రజారోగ్య చర్యల్లో భాగం కావచ్చు. ప్రస్తుతం అసలు తేలాల్సిన విషయం ఒక్కటే.. దర్యా షిపిలోవా మృతికి కారణమైన వ్యాధికారకం ఏమిటి? రష్యా దర్యాప్తు, ల్యాబొరేటరీ పరీక్షల తుది ఫలితాలు వెల్లడైతేనే ఈ ఘటన వెనుక ఉన్న వాస్తవం మరింత స్పష్టమవుతుంది. 

ఇదీ చదవండి: సౌదీకి పాక్‌ బలగం.. హౌతీలను ఓడించే దమ్ముందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement