
మాస్కో: రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై అతని రహస్య కుమార్తె ఎలిజవేటా క్రివోనోగిఖ్(22) పలు సంచలన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అతను తన జీవితాన్ని నాశనం చేయడంతో పాటు లక్షలాదిమందిని పొట్టన పెట్టుకున్నాడని ఎవరిపేరు చెప్పకుండానే వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆరోపణలు క్రెమ్లిన్(రష్యాన్ ప్రభుత్వ అధికార నివాసం) అధినేతపైనే అని మీడియా చెబుతోంది.
జర్మన్ వార్తాపత్రిక బిల్డ్ టెలిగ్రామ్ చానల్‌లో ఎలిజవేటా క్రివోనోగిఖ్ వరుస పోస్ట్‌లను ఉంచారు. వాటిలో ఆమె ‘నా ముఖాన్ని మళ్లీ ప్రపంచానికి చూపించడం అనేది నాకు విముక్తినిస్తుంది. నేను ఎవరో.. నా జీవితాన్ని ఎవరు నాశనం చేశారనేది నాకు గుర్తు చేస్తుంది’ అని పేర్కొంది. 2022లో రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో ఆమె ఖాతా మాయమయ్యింది. 2003లో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జన్మించిన క్రివోనోగిఖ్, పుతిన్, అతని మాజీ ఉద్యోగి స్వెత్లానా క్రివోనోగిఖ్ కుమార్తె అనే వాదన వినిపిస్తుంటుంది.
2020లో రష్యన్ మిలియనీర్ స్వెత్లానా క్రివోనోగిఖ్ ఆస్తులపై దర్యాప్తు చేసిన సమయంలో ఎలిజవేటా క్రివోనోగిఖ్ రష్యన్ అధ్యక్షుడి రహస్య కుమార్తె అని కనుగొన్నట్లు స్వతంత్ర మీడియా సంస్థ ప్రోక్ట్ పేర్కొంది. స్వెత్లానా క్రివోనోగిఖ్ ఈ సంపదను రష్యన్ నాయకుని ద్వారా పొందారనే ఆరోపణలున్నాయి. స్వెత్లానా కుమార్తెకు పుతిన్ పోలికలున్నాయని ప్రోక్ట్ పేర్కొంది. అయితే, క్రెమ్లిన్ ఈ వాదనను తోసిపుచ్చింది. అవి నిరాధారమైనవని పేర్కొంది. ఎలిజవేటా క్రివోనోగిఖ్ జనన ధృవీకరణ పత్రంలో ఆమె తండ్రి పేరు లేదు. 2021లో జరిగిన ఒక ఆడియో ఇంటర్వ్యూలో, ఎలిజవేటా క్రివోనోగిఖ్.. పుతిన్‌తో తనకున్న పోలికలను ధృవీకరించలేదు. తిరస్కరించనూలేదు.