ఫరీదాబాద్: హర్యానాలోని ఫరీదాబాద్‌లో సభ్య సమాజం తలదించుకునే అమానుష ఘటన వెలుగు చూసింది. కేవలం హోంవర్క్ చేయలేదన్న చిన్న కారణంతో ఓ కసాయి తండ్రి తన నాలుగేళ్ల కూతురిని అతి కిరాతకంగా హతమార్చాడు. బల్లబ్‌గఢ్‌కు చెందిన కృష్ణ జైస్వాల్ (31) తన కుమార్తె వంశిక (4) హోంవర్క్‌లో ఒకటి నుండి 50 వరకు అంకెలు రాయలేకపోయిందన్న కోపంతో విచక్షణ కోల్పోయాడు. చపాతీలు చేసే కర్రతో విచక్షణారహితంగా కొట్టడంతో ఆ చిన్నారి కుప్పకూలిపోయింది.
అనంతరం, నిందితుడు ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడిన కుమార్తెను బల్లబ్‌గఢ్‌లోని సివిల్ ఆసుపత్రికి తీసుకువెళ్లి, మెట్లపై నుంచి జారిపడిందని వైద్యులను నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆమె శరీరంపై పలు గాయాలు, ఫ్రాక్చర్లు, తలకు తీవ్రమైన దెబ్బలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తొలుత ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ మార్చురీకి తరలించారు.
ఈ ఘాతుకం జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్న నిందితుని ఆరేళ్ల కుమారుడు నిజాన్ని బయటపెట్టాడు. తన సోదరి అంకెలు రాయలేకపోయినందుకు తండ్రి ఎలా కొట్టాడో ఆ బాలుడు తన తల్లికి, ఆపై పోలీసులకు వివరించాడు. భార్య ఫిర్యాదు, బాలుని వాంగ్మూలం ఆధారంగా నిందితుడు కృష్ణ జైస్వాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, అరెస్టు చేసిన పోలీసులు అతనిని ఫరీదాబాద్ కోర్టులో హాజరుపరిచారు. తదుపరి విచారణ నిమిత్తం న్యాయస్థానం అతడిని ఒక రోజు పోలీస్ రిమాండ్‌కు పంపింది.


