వెనెజువెలా: పాపం వాళ్లు… శిథిలాల్లో ప్రాణాల కోసం పోరాటం! | Venezuela Tragedy: Earthquake After Deportation Leaves 100 Migrants Missing | Sakshi
Sakshi News home page

వెనెజువెలా: పాపం వాళ్లు… శిథిలాల్లో ప్రాణాల కోసం పోరాటం!

Jun 30 2026 10:44 AM | Updated on Jun 30 2026 11:14 AM

Venezuela Tragedy: Earthquake After Deportation Leaves 100 Migrants Missing

ఒక దేశం నుంచి బలవంతంగా పంపించారు. పోనీలే.. స్వస్థలానికి చేరామన్న ఊపిరి కూడా తీసుకోకముందే ప్రకృతి రూపంలో వచ్చిన విధ్వంసం వారిని మింగేసింది. డిపోర్ట్‌ చేసిన కొద్ది గంటల్లోనే భారీ భూకంపం వారిని శిథిలాల కిందకి లాక్కెళ్లింది. కొందరు ప్రాణాలతో బయటపడగా.. వంద మందికి పైగా ఇప్పటికీ కనిపించకుండా పోవడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేపుతోంది.

వెనెజువెలాను కుదిపేసిన జంట భూకంపాలు ఇప్పటివరకు కనీసం 1,719 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా ప్రకటించారు. నేషనల్ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్‌ రోడ్రిగెస్‌ ప్రకారం 5,034 మంది గాయపడ్డారు, ఇంకా వేలాది మంది ఆచూకీ లేని పరిస్థితి నెలకొంది. వారం గడిచినా.. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. 

గత బుధవారం సాయంత్రం 7.2 మరియు 7.5 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపాలు.. దేశ చరిత్రలోనే అత్యంత ప్రాణాంతక విపత్తులుగా మారాయి. లా గ్వైరా సహా పలు ప్రాంతాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. భవనాలు కూలిపోవడంతో రోడ్లు, హోటళ్లు, నివాసాలు శిథిలాలుగా మారాయి. అయితే అప్పటి నుంచి ప్రకంపనలు ఆగకపోవడంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటిదాకా 500కు పైగా ప్రకంపనలు(ఆఫర్ట్‌ షాక్స్‌) సంభవించినట్లు తెలుస్తోంది. 

ఈ విపత్తు సమయంలోనే అమెరికా నుంచి డిపోర్ట్‌ చేయబడిన 146 మంది వెనిజులా వలసదారులు దేశానికి చేరుకున్నారు. వారిని లా గ్వైరాలోని హోటల్‌లో తాత్కాలికంగా ఉంచగా, కొన్ని గంటల్లోనే అదే ప్రాంతాన్ని భూకంపం తీవ్రంగా దెబ్బతీసింది.

డిపోర్టేషన్‌ తర్వాతే విధి పరీక్ష
డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక.. వలస నియంత్రణ చర్యల్లో భాగంగా కఠిన వైఖరి అవలంభిస్తున్నారు. అక్రమ చొరబాటు దారులంటూ బేడీలు వేయించి మరీ యుద్ధ విమానాల్లో.. అత్యంత దయనీయమైన పరిస్థితుల నడుమ స్వస్థలాలకు పంపించి వేస్తున్నారు. అలా డిపోర్టేషన్‌ ఫ్లైట్‌లలో భాగంగా వచ్చిన ఈ వెనెజువెలా వలసదారులు, స్వదేశానికి తిరిగొచ్చిన వెంటనే ఈ విపత్తులో చిక్కుకున్నారు. ఇది ఇప్పుడు అంతర్జాతీయంగా మానవతా చర్చకు దారితీస్తోంది.

ఆ 100 మంది ఎక్కడ?
హోటల్‌ శిథిలాల నుంచి కొందరు బయటపడగా, మరికొందరు ఐదు కిలోమీటర్ల దూరం నడిచి సహాయం కోరారు. కానీ 100 మందికి పైగా వలసదారుల ఆచూకీ ఇంకా తెలియకపోవడం ఆందోళన పెంచుతోంది. వాళ్లంతా ఇంకా శిథిలాల కిందే చిక్కుకుని ఉంటారని చెబుతున్న అధికారులు.. వాటిని తొలగించే పనిని కొనసాగిస్తున్నారు. లిస్బెత్‌ పోర్టిల్లో అనే శరణార్థి సహా కొందరు వలసదారులు శిథిలాల నుంచి బయటపడి ప్రాణాలతో తప్పించుకున్నారు. “చుట్టూ అరుపులు, పరుగులు, దుమ్ము… ఎవరూ ఎవరిని గుర్తుపట్టలేని పరిస్థితి. కొందరు దుస్తులు, మరికొందరు చెప్పుల్లేకుండా ప్రాణభయంతో పరుగులు తీశారు” అని ఆమె వివరించింది. రెండో అంతస్తులో ఉన్న గదిలోనే ఆమె శిథిలాల కింద ఇరుక్కున్నప్పటికీ అదృష్టవశాత్తు బయటపడింది. “నేను మళ్లీ పుట్టాను… దేవుడు నాకు రెండో అవకాశం ఇచ్చాడు” అంటూ ఆమె కన్నీళ్లతో చెప్పిన మాటలు ఇప్పుడు ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి.

మృతుల సంఖ్య పెరుగుతున్న భయం
ప్రభుత్వ లెక్కల ప్రకారం 1,719 మంది మరణించగా, 15,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఇంకా వేలాది మంది గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి మరింత విషమించవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి (UN) 10,000 బాడీ బ్యాగ్స్ పంపించాలని నిర్ణయించింది. 24 దేశాలు కలిసి 521 టన్నుల సహాయాన్ని పంపించాయి. 2,700కు పైగా రెస్క్యూ సిబ్బంది, 86 డాగ్ యూనిట్లు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి. అమెరికా కూడా తన సహాయాన్ని 300 మిలియన్ల డాలర్లకు పెంచింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement