బాహుబలి బాంబు | USA strikes on Iran nuclear sites used bunker buster bombs | Sakshi
Sakshi News home page

బాహుబలి బాంబు

Jun 23 2025 5:13 AM | Updated on Jun 23 2025 5:13 AM

USA strikes on Iran nuclear sites used bunker buster bombs

అత్యంత ఎత్తు నుంచి అమితమైన వేగంతో దూసుకొచ్చే బంకర్‌ బస్టర్‌బాంబు

ఎప్పుడెప్పుడా అని ఇజ్రాయెల్‌ ఎంతో ఆశగా ఎదురుచూసినా బంకర్‌ బస్టర్‌ బాంబులను అమెరికా మోసుకొచ్చింది. అనుకున్న లక్ష్యాలపై అమాంతం పడేసింది. పర్వతప్రాంతాన్ని పిండిముద్దలా బద్దలుకొట్టింది. 

అత్యంత పటిష్టమైన కఠినశిలలను సైతం తునాతునకలు చేసే వేల కేజీల బరువైన భారీ బాంబులతో ఇరాన్‌ అణుకేంద్రాలపై భీకర దాడులుచేసిన అమెరికా బీ–2ఏ స్పిరిట్‌ స్టెల్త్‌ బాంబర్‌ విమానాల గురించి, అవి ప్రయోగించిన భారీ బంకర్‌ బస్టర్‌ బాంబుల గురించే ఇప్పుడంతా మాట్లాడుకుంటున్నారు. 

భూతలం మీది లక్ష్యాలను తునాతునకలుచేసే బాంబులను ప్రయోగించడం సర్వసాధారణం. కానీ ఇలా భూగర్భంలోని లక్ష్యాలను సైతం అలవోకగా చేధించి ఛిన్నాభిన్నంచేయగల శక్తివంతమైన పేలుడు ఆయుధాన్ని అమెరికా ఇటీవలికాలంలో ఎప్పుడూ ప్రయోగించలేదు. మిత్రదేశానికి సాయంగా ఇరాన్‌ యుద్ధంలో అడుగుపెట్టిన తొలిరోజే భారీబాంబులతో యుద్ధాన్ని అమెరికా కొత్త మలుపు తిప్పింది. 

బాంబు బరువు 13,600 కిలోలు
ఇరాన్‌లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్‌ యురేనియం శుద్ధికర్మాగారాలపై ప్రయోగించిన జీబీయూ–57 ఏ/బీ మ్యాసివ్‌ ఆర్డ్‌నెన్స్‌ పెనిట్రేటర్‌(ఎంఓపీ) గైడెడ్‌ బాంబు బరువు ఏకంగా 13,600 కిలోలు. ఒక్కో బాంబు ఖరీదు రూ.170 కోట్లు. భూమిలోపల మరింత లోతుల్లో నిర్మించిన బంకర్లు, సొరంగాలను భూస్థాపితం చేయడమే లక్ష్యంగా అమెరికా వైమానికదళం కోసం ఈ బాంబులను రూపొందించారు. ఒక గది పరిమాణంలో పిండిముద్దపై ఎంతపెద్ద రాయి పడేస్తే అంతలోతుకు అది వెళ్తుందికదా. అలాగే ఎంత భారీ బరువైన బాంబును పడేస్తే తొలుత అది అంతలోతుకు వెళ్తుంది. తర్వాత అది పేలుతుంది. అత్యంత లోతుల్లోకి చేరేందుకు అనువుగా ఈ బాంబును అత్యంత ఎత్తులోంచి జారవిడుస్తారు. అడ్డంగా పడిపోకుండా నిటారుగా, బాణంలాగా భూమికి గుచ్చుకునేలా బాంబు కొనకు జీపీఎస్‌ ట్రాకర్‌ అమర్చుతారు. 

మెరుపువేగంతో దూసుకొచ్చి..
ఈ బాంబు పొడవు 20 అడుగులు. మొత్తం బాంబు బరువులో 80 శాతం బాడీ బరువే ఉంటుంది. మొత్తం వార్‌హెడ్‌లో కేవలం 20 శాతం మాత్రమే పేలుడుపదార్థం ఉంటుంది. తొలుత ఎక్కువ లోతుల్లోకి వెళ్లాలనే ఉద్దేశ్యంతో ఇలా దీనిని డిజైన్‌చేశారు. నేలను తాకినప్పుడు బయటిపొర ధ్వంసంకాకుండా ఉండేందుకు అత్యంత పటిష్టమైన ఫెర్రో–కోబాల్ట్‌ లోహమిశ్రమ కవచాన్ని అమర్చుతారు. చాలా లోతుకు వెళ్లాలంటే మరింత వేగంగా కిందకు పడాలి. అందుకోసం ఇది సూపర్‌సోనిక్‌ వేగంతో కిందకు దూసుకొస్తుంది. బరువు, వేగం, దిశ ఇలా అన్ని కలిసి దీనిని అత్యంత శక్తివంతమైన ఆయుధంగా మార్చేశాయి. . 

ఆగకుండా 61 మీటర్లు చొచ్చుకెళ్లి..
అత్యంత కఠినమైన శిలాప్రాంతంపై పడినా ఇది ఖచ్చితంగా 61 మీటర్ల లోతు అంటే 200 అడుగుల లోతు వరకు వెళ్లగలదు. అక్కడ ఇది పేలి ఆ ప్రాంతం మొత్తాన్ని నామరూపాల్లేకుండా తునాతు నకలు చేస్తుంది. అయితే ఆ లోతులో అణుకేంద్రంలేకుంటే ఎలా అనే సందేహం రావొచ్చు. మొదటి బాంబు పేలిన చోటే అత్యంత ఖచ్చితంగా మరో బాంబును పడేస్తారు. అది పేలి మరింత లోతు వరకు భూమిని పెకలించివేసి పెను విస్ఫోటనం సృష్టిస్తుంది. అలా అవసరమైనన్ని బాంబులను ఒకేచోట ఒకదాని వెంట మరోటి పడేసి లక్ష్యాన్ని ఎలాగైనా బద్దలుకొడతారు. కొత్తింటి కోసం బోరు వేసినప్పుడు ఉక్కు కేసింగ్‌లు ఎలాగైతే ఒకదాని వెంట మరోటి జతచేస్తూ రంధ్రం లోతును పెంచుకుంటూ పోతారో యుద్దంవేళ ఈ బాంబులతో అలా భూగర్భ నిర్మాణాలను నాశనంచేసే దాకా ఒకేచోట బాంబులను ప్రయోగిస్తారు. ఆదివారం అమెరికా జీబీయూ–57 ఏ/బీ మ్యాసివ్‌ ఆర్డ్‌నెన్స్‌ పెనిట్రేటర్‌(ఎంఓపీ) బాంబు ఇదే పనిచేసింది. 

బాంబుకు తగ్గ విమానం
ఇంతటి బరువైన బాంబులను అలవోకగా మోస్తూ అత్యంత ఎత్తుల్లో ప్రయాణించగల సామర్థ్యమున్న బాంబర్‌విమానానికి మాత్రమే ఇంతటి సత్తా ఉంటుంది. అమెరికా అమ్ము ల పొది లోని బీ–2 స్పిరిట్‌ స్టెల్త్‌ బాంబర్‌ విమా నం మాత్ర మే ఈ పనిచేయగలదు. అందుకే ట్రంప్‌సేన వీటిని కదనరంగంలో మొహరించి ఇరాన్‌ అణుక్షేత్రాలపై మెరుపుదాడులు చేయించింది. బాంబులను అమర్చకముందు ఈ స్టెల్త్‌ విమానం బరువు ఏకంగా 71,000 కేజీలు. ఇది ఒకేసారి రెండు ఎంఓపీ బాంబులను మోసుకెళ్లగలదు. ఒక్కో విమానం ఖరీదు ఏకంగా రూ.18,000 కోట్లు. ఈ విమానాన్ని నార్త్‌రోప్‌ గ్రూమ్మన్‌ అనే ఆయుధ తయారీసంస్థ తయారుచేసి అమెరికా ఆర్మీకి విక్రయించింది. ఈ విమానం ఎక్కడా ఆగకుండా ఏకధాటిగా 11,000 కిలోమీటర్లు ప్రయాణించగలదు. మార్గమధ్యంలో ఇంధనాన్ని గాల్లోనే నింపుకుంటే మరో 7,500 కి.మీ.లు ప్రయాణించి బాంబులేస్తుంది. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
 
Advertisement
Advertisement