‘క్లాడ్ 5’ విడుదలకు ట్రంప్‌ సర్కార్‌ గ్రీన్ సిగ్నల్ | US Clears Anthropics Claude Mythos 5 After Brief Ban | Sakshi
Sakshi News home page

‘క్లాడ్ 5’ విడుదలకు ట్రంప్‌ సర్కార్‌ గ్రీన్ సిగ్నల్

Jun 27 2026 9:53 AM | Updated on Jun 27 2026 10:06 AM

US Clears Anthropics Claude Mythos 5 After Brief Ban
  • క్లాడ్ మైథోస్ 5 పై నిషేధం ఎత్తివేత 
  • ట్రంప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
  • అమెరికా జాతీయ భద్రత వర్సెస్ ఏఐ 
  • 100కు పైగా సంస్థలకు ఆంత్రోపిక్ ఏఐ యాక్సెస్

వాషింగ్టన్‌: అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఏఐ పరిశోధనా సంస్థ ‘ఆంత్రోపిక్’ (Anthropic) అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన సైబర్ సెక్యూరిటీ మోడల్ ‘క్లాడ్ మైథోస్ 5’ (Claude Mythos 5) విడుదలకు డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా విధించిన రెండు వారాల నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేస్తూ, దేశంలోని సుమారు 100కు పైగా భాగస్వామ్య సంస్థలకు దీనిని అందుబాటులోకి తెచ్చేందుకు వాణిజ్య విభాగం అనుమతించింది.

లూత్నిక్ లేఖతో వీడిన ఉత్కంఠ
అమెరికా వాణిజ్య శాఖ కార్యదర్శి హోవార్డ్ లూత్నిక్, ఆంత్రోపిక్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ కంప్యూట్ ఆఫీసర్ టామ్ బ్రౌన్‌కు పంపిన అధికారిక లేఖ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఏఐ మోడల్‌కు సంబంధించి తగిన భద్రతా ప్రమాణాలు అమలులో ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. జూన్ 12న జారీ చేసిన లేఖ తదనంతరం ఆంత్రోపిక్ సంస్థ ప్రభుత్వంతో కలిసి భద్రతా పరమైన లోపాలను సరిదిద్దడంలో గణనీయమైన పురోగతి సాధించిందని లూత్నిక్ వెల్లడించారు. ఈ అనుమతితో ఫార్చ్యూన్ 500 కంపెనీలతో పాటు వందకు పైగా ప్రతిష్టాత్మక సంస్థలు మైథోస్ 5 ని ఉపయోగించుకోనున్నాయి. అలాగే ఈ సంస్థల్లోని విదేశీ ఉద్యోగులు కూడా దీనిని యాక్సెస్ చేయడానికి అనుమతి లభించింది.

అసలు నిషేధానికి కారణం ఏంటి?
చైనాకు సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఒక దక్షిణ కొరియా టెలికాం కంపెనీకి ఆంత్రోపిక్ సంస్థ ఈ మైథోస్ మోడల్ యాక్సెస్ ఇవ్వడం అమెరికా ప్రభుత్వంలో తీవ్ర ఆందోళన కలిగించింది. దీంతో పాటు అమెజాన్, యూఎస్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ లు కూడా ‘ఫేబుల్ 5’ మోడల్ జైల్‌బ్రేక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. ఈ జాతీయ భద్రతా కారణాల వల్లనే ట్రంప్ ప్రభుత్వం రెండు వారాల క్రితం ఆంత్రోపిక్ అత్యంత శక్తివంతమైన మోడళ్లపై ఎగుమతి నియంత్రణల కింద నిషేధం విధించింది. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి ఆంత్రోపిక్ తన సీనియర్ సైబర్ సెక్యూరిటీ, ఏఐ సేఫ్టీ బృందాలను వాషింగ్టన్‌కు పంపి ప్రభుత్వంతో చర్చలు జరిపింది.

వినియోగదారులకు నిరాశేనా?
ఈ తాజా నిర్ణయం ప్రకారం మైథోస్ 5 కేవలం సైబర్ రక్షకులు, మౌలిక సదుపాయాల కల్పన సంస్థలకే పరిమితం కానుంది. సాధారణ వినియోగదారుల కోసం దీనిని ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై ఆంత్రోపిక్ ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు, ‘ఫేబుల్ 5’ మోడల్‌ను తిరిగి సాధారణ వినియోగంలోకి తీసుకురావడానికి వైట్ హౌస్‌తో చర్చలు కొనసాగుతున్నాయని ఆంత్రోపిక్ ప్రతినిధి ఎడ్వర్డో మైయా సిల్వా తెలిపారు. కాగా, ఈ పరిణామానికి సరిగ్గా ఒక రోజు ముందే, ఓపెన్ ఏఐ తన రాబోయే ‘జీపీటీ 5.6’ మోడల్‌ను నేరుగా కాకుండా ప్రభుత్వం ఆమోదించిన భాగస్వాములకు మాత్రమే విడతల వారీగా విడుదల చేయాలని ట్రంప్ సర్కార్ ఆదేశించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement