
ఉక్రెయిన్ శాంతి చర్చల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల భేటీ తేదీ, వేదిక ఖరారు అయ్యింది. ఆగస్టు 15వ తేదీన అలస్కాలో తాను పుతిన్‌తో భేటీ కాబోతున్నట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించారు.
నాకు, పుతిన్‌కు మధ్య భేటీ కోసం అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆ సమావేశం వచ్చే శుక్రవారం ఆగస్టు 15వ తేదీన గ్రేట్ అలస్కా స్టేట్‌లో జరగోబోతోంది అని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారాయన. మరోవైపు.. క్రెమ్లిన్ వర్గాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి. అయితే ఈ చర్చలతో ట్రంప్ ఏం సాధించబోతున్నారనే విశ్లేషణ ఇప్పటికే మొదలైంది.
ఉక్రెయిన్–రష్యా యుద్ధం 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైనప్పటి నుంచి శాంతి చర్చలు పలు దఫాలుగా జరిగాయి. ఇస్తాంబుల్(టర్కీ)లో చర్చలు జరిగినా, తన రాయబారితో ట్రంప్ స్వయంగా ఇరు దేశాల మధ్య ట్రంప్ సంప్రదింపులు ఇప్పటివరకు శాంతి ఒప్పందం కుదరలేదు. అయితే ఈ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం కనుగొనడం కోసం స్వయంగా ట్రంపే ఇప్పుడు రంగంలోకి దిగబోతున్నారని వైట్‌హౌజ్ అంటోంది. తద్వారా యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడనున్నాయని అంటోంది. భౌగోళికంగా తటస్థ ప్రాంతం కావడం వల్ల ఉక్రెయిన్ చర్చలకు అలస్కా ఎంపిక చేసినట్లు చెబుతోంది. కొసమెరుపు ఏంటంటే.. యుద్ధ రుణభారంతో కుంగిపోయిన పూర్వపు రష్యా సామ్రాజ్యపు అధినేత జార్ అలెగ్జాండర్-2 1867లో అలస్కాను అమెరికాకు 7.2 మిలియన్ డాలర్లకు అమ్మేశాడు.
రష్యా డిమాండ్లు
• క్రిమియా, డోనెత్స్క్, లుహాన్స్క్ వంటి ప్రాంతాలను ఉక్రెయిన్ వదులుకోవాలని రష్యా కోరుతోంది.
• నాటోలో చేరే ఉక్రెయిన్ ఆలోచనను విరమించుకోవాలని రష్యా పట్టుబడుతోంది.
ఉక్రెయిన్ వైఖరి
• భూభాగాలపై రాజీకి ఉక్రెయిన్ నిరాకరణ
• అంతర్జాతీయ మద్దతుతో శాంతి చర్చలు కొనసాగించాలన్న పట్టుదల
ఇప్పటివరకు రష్యా కాల్పుల విరమణకు అంగీకరించింది లేదు. అమెరికా ప్రతినిధులు జెలెన్‌స్కీతో కూడిన త్రైపాక్షిక సమావేశాన్ని ప్రతిపాదించినా, రష్యా ఇంకా స్పందించలేదు. మరోవైపు.. పుతిన్ శాంతి చర్చలు నాటకీయంగా మార్చేశారని జెలెన్‌స్కీ విమర్శిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో.. తమ భాగస్వామ్యం లేకుండా శాంతి చర్చలు జరగడం సరికాదని అంటున్నారాయన. ఈ తరుణంలో.. మొన్నటిదాకా నియంతగా జెలెన్‌స్కీపై మండిపడ్డ ట్రంప్, ఇప్పుడు భేటీ కావడానికి సుముఖత వ్యక్తం చేయడం గమనార్హం.
తాను ఈ ఏడాది జనవరిలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలకాలని ట్రంప్ తీవ్రంగా భావిస్తున్నారు. జెలెన్‌స్కీని తన దగ్గరకు రప్పించుకున్నప్పటికీ.. విమర్శించి పంపించారే తప్ప చర్చల్లో పురోగతి సాధించలేకపోయారు. ఆపై అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్‌ను ఇరు దేశాలకు పంపించి దౌత్యం నడిపించారు కూడా. ఈ క్రమంలో ఇటు రష్యా డిమాండ్లకు తలొగ్గాలని ఉక్రెయిన్‌కు సూచించడంతో పాటు చర్చల్లో ఉక్రెయిన్‌ను భాగం చేయాలని ట్రంప్ భావిస్తున్నారు.
పుతిన్ స్పందన
ట్రంప్ ఉంటే అసలు ఈ యుద్ధం జరిగేదే కాదు
ట్రంప్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నాను
అమెరికా, రష్యా ప్రశాంతంగా మాట్లాడుకోవాలి
జెలెన్‌స్కీ అభిప్రాయం
అమెరికా నాయకత్వంపై ఆశ ఉంది
రష్యా దాడులు ఆగకపోతే శాంతి సాధ్యం కాదు
ట్రంప్–పుతిన్ చర్చల్లో ఉక్రెయిన్ ఉండాల్సిందే
పుతిన్, ట్రంప్ చివరిసారిగా 2018 ఫిన్లాండ్ రాజధాని హెల్సెంకీలో భేటీ అయ్యారు. అలాగే దాదాపు పదేళ్ల తర్వాత పుతిన్ అమెరికాకు రానున్నారు. శాంతి చర్చల్లో ఈ ఇద్దరి భేటీ కీలకం కానుంది. అలాగే ఈ సమావేశం ప్రపంచ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తనను తాను శాంతికాముకుడిగా ప్రకటించుకున్న ట్రంప్.. ఇప్పటిదాకా పలు దేశాల మధ్య యుద్ధాలను ఆపానంటూ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఈ యుద్ధాన్ని కూడా ఆపేస్తాడా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. అలాగే ఉక్రెయిన్ యుద్ధాన్ని తానే ఆపేస్తానంటూ మొదటి నుంచి ట్రంప్ చెబుతూ వస్తున్నారు. అయితే..
ట్రంప్ ఉక్రెయిన్ శాంతి చర్చల విషయంలో దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. ఆర్థిక ఒత్తిడి, రాయబార చర్చలు, వ్యక్తిగత సంబంధాలు ద్వారా యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. మూడు దేశాల మధ్య సహకారం, నమ్మకం, ప్రామాణిక చర్చలపైనే ఈ సంక్షోభం ముగియడం అనేది ఆధారపడి ఉంటుందన్నది విశ్లేషకుల మాట.