25 శాతం సుంకాలు | Trump Announces 25 percent Tariff On India Along With Penalty | Sakshi
Sakshi News home page

25 శాతం సుంకాలు

Jul 31 2025 2:03 AM | Updated on Jul 31 2025 2:03 AM

Trump Announces 25 percent Tariff On India Along With Penalty

భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బాంబ్‌

రష్యాతో వ్యాపారం చేస్తున్నందుకు అదనంగా జరిమానా కూడా...

ఆగస్టు 1 నుంచి అమల్లోకి నిర్ణయాలు: ట్రంప్‌ ప్రకటన 

మోదీ ప్రభుత్వ ఘోర వైఫల్యం... మండిపడ్డ కాంగ్రెస్, విపక్షాలు

దేశ ప్రయోజనాలను కాపాడతాం: కేంద్రం

ప్రభావాన్ని సమీక్షిస్తున్నాం: కేంద్రం భారత్‌పై 25 శాతం సుంకాల విధింపు, రష్యాతో వర్తకం చేస్తున్నందుకు జరిమానా ప్రకటన తాలూకు ప్రభావాన్ని మదింపు చేస్తున్నట్టు కేంద్రం పేర్కొంది. ఈ విషయంలో దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఇరు దేశాలకూ ఆమోదనీయ, లాభదాయక రీతిలో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు కట్టుబడి ఉన్నాం. కొద్ది నెలలుగా ఆ దిశగాఅత్యున్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి’’అని గుర్తు చేసింది. వీటిలో భాగంగా ఆరో రౌండ్‌ చర్చల నిమిత్తం అమెరికా బృందం ఆగస్టు 25న భారత్‌ రానుంది.

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై అనూహ్యంగా భారీ టారిఫ్‌ బాంబు విసిరారు. భారత దిగుమతులపై ఏకంగా 25 శాతం సుంకాలు బాదారు. అంతేగాక వీటికి అదనంగా రష్యాతో వర్తకం చేస్తున్నందుకు భారత్‌పై ప్రత్యేకంగా జరిమానా కూడా విధించనున్నట్టు పేర్కొన్నారు. ఆ మొత్తం ఎంత న్నది పేర్కొనలేదు. ఈ నిర్ణయాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. తన సోషల్‌ మీడియా హ్యాండిల్‌ ‘ట్రూత్‌ సోషల్‌’లో బుధవారం ఈ మేరకు ఆయన పలు పోస్టులు పెట్టారు. అమెరికాతో భారత వర్తక విధానాలు, నిబంధనలను అత్యంత దారుణమైనవిగా అభివర్ణించారు.

‘‘భారత్‌ మా మిత్ర దేశమే. కానీ వర్తక, వాణిజ్య సంబంధాల విషయంలో ఆ దేశంతో అంతా సజావుగా లేదు. అమెరికాపై ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్‌లు వసూలు చేస్తున్న దేశాల్లో భారత్‌ ఒకటి. అందుకే ఆ దేశంతో మేం భారీ స్థాయిలో వ్యాపారం చేయడం లేదు’’అని రాసుకొచ్చారు. భారత్‌తో అమెరికాకు భారీ వర్తక లోటు ఉందని గుర్తు చేశారు. రష్యా నుంచి భారీగా చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తున్నందుకే అదనంగా జరిమానా విధిస్తున్నట్టు స్పష్టం చేశారు. ‘‘ఉక్రెయిన్‌లో జనహననం ఆగాలని ప్రపంచమంతా ఆకాంక్షిస్తోంది. ఇలాంటి సమయంలో అందుకు పాల్పడుతున్న రష్యాతో భారత్‌ భారీ వాణిజ్య సంబంధాలు నెరుపుతోంది’’అంటూ ఆక్షేపించారు.

అదే జరిగితే రష్యాతో వాణిజ్యం చేస్తున్నందుకు అమెరికా నుంచి జరిమానా ఎదుర్కోనున్న తొలి దేశం భారతే అవుతుంది. భారత్‌తో వర్తక ఒప్పందం నిమిత్తం అమెరికా బృందం ఆగస్టు 25 నుంచి భారత్‌లో పర్యటించనుందని కేంద్రం ప్రకటించిన మర్నాడే ట్రంప్‌ నుంచి అనూహ్యంగా సుంకాల పోటు నిర్ణయం వెలువడటం గమనార్హం. ఈ దెబ్బకు రూపాయి విలువ గత మూడేళ్లలో అత్యధికంగా బుధవారం ఏకంగా 89 పైసలు పతనమైంది. అమెరికా డిమాండ్లకు తలొగ్గేలా భారత్‌పై ఒత్తిడి పెంచడమే ట్రంప్‌ ప్రకటన ఉద్దేశమని భావిస్తున్నారు.

ఇటీవలి కాలంలో జపాన్, బ్రిటన్, యూరోపియన్‌ యూనియన్‌పై కూడా ట్రంప్‌ ఇలాంటి ఒత్తిళ్లే తెచ్చి అమెరికాకు అనుకూలంగా ఒప్పందాలు కుదుర్చుకుందని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. గతంలో చైనాపై కూడా ఇలాగే ట్రంప్‌ అడ్డగోలుగా టారిఫ్‌లను ప్రకటించడం, చివరికి వెనక్కు తగ్గడం తెలిసిందే. భారత చమురు దిగుమతుల్లో కేవలం 0.2 శాతంగా ఉన్న రష్యా వాటా ఉక్రెయిన్‌తో ఆ దేశం యుద్ధానికి దిగిన అనంతరం ఏకంగా 35 నుంచి 40 శాతానికి పెరిగింది. అయితే ఇప్పటికీ రష్యా నుంచి అతి పెద్ద చమురు దిగుమతిదారుగా చైనాయే నిలుస్తోంది. ఆ దేశంపై మాత్రం ట్రంప్‌ ఎలాంటి జరిమానాలు విధించలేదు. ట్రంప్‌ సుంకాల నిర్ణయంపై భారత పరిశ్రమల రంగం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

ట్రంప్‌ ప్రకటించిన 25 శాతం సుంకాలు ఇప్పటికే అన్ని దేశాలతో పాటు భారత్‌పైనా అమల్లో ఉన్న 10 శాతం బేస్‌లైన్‌ టారిఫ్‌లకు అదనమా, కాదా అన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. అన్ని దేశాలపై 10 శాతం టారిఫ్‌ ఏప్రిల్‌ 2 నుంచి అమల్లోకి వచి్చంది. దీనికి అదనంగా స్టీల్, అల్యుమినియం దిగుమతులపై 50 శాతం, ఆటో రంగంపై 25 శాతం అదనపు సుంకాలను కూడా ట్రంప్‌ విధించారు. ట్రంప్‌ ప్రకటన వెలువడ్డ కాసేపటికే కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌తో విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ భేటీ జరిపి పరిస్థితిని సమీక్షించారు. 

ఏప్రిల్లో 26 శాతం సుంకాలు 
భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఖరారు కాలేదని మంగళవారమే ట్రంప్‌ మీడియాకు చెప్పడం తెలిసిందే. 25 శాతం టారిఫ్‌ విధించనున్నట్టు అప్పుడే ఆయన సంకేతాలిచ్చారు. 20 నుంచి 25 శాతం దాకా టారిఫ్‌లు విధిస్తారా అని మీడియా ప్రశ్నించగా, అలాగే భావిస్తున్నట్టు బదులిచ్చారు. గత ఏప్రిల్‌ 2న భారత్‌పై 26 శాతం టారిఫ్‌లను ట్రంప్‌ ప్రకటించారు. కొద్ది రోజులకే ఆ నిర్ణయం అమలును 90 రోజుల పాటు, అంటే జూలై 9 దాకా, అనంతరం ఆగస్టు 1 దాకా వాయిదా వేశారు. అమెరికా, భారత్‌ నడుమ వాణిజ్య ఒప్పందం నిమిత్తం అత్యున్నత స్థాయి బృందాల నడుమ ఇప్పటికే ఐదు రౌండ్ల పాటు చర్చలు జరిగాయి. 

అతి పెద్ద వాణిజ్య భాగస్వామి 
2021–25 నడుమ భారత్‌కు అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. భారత మొత్తం ఎగుమతుల్లో అమెరికా వాటా 18 శాతం. అమెరికాతో భారత్‌కు 2022–23లో 27.7 బిలియన్లు, 2023–24లో 35.32 బిలియన్లు, 2024–25లో 41 బిలియన్‌ డాలర్ల మేరకు వాణిజ్య మిగులు నమోదైంది. 2024–25లో భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం 186 బిలియన్‌ డాలర్ల మేర నమోదైంది. వీటిలో భారత్‌ 86.5 బిలియన్‌ డాలర్ల మేర వస్తువులను ఎగుమతి చేయగా, 45.3 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులను అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది. సేవల రంగంలో అమెరికాకు 28.7 బిలియన్‌ డాలర్ల మేరకు ఎగుమతులు జరిపింది. 25.5 బిలియన్‌ డాలర్ల మేరకు దిగుమతులు చేసుకుంది.

మొత్తమ్మీద అమెరికాతో వాణిజ్యంలో భారత్‌ 44.4 బిలియన్‌ డాలర్ల మిగులు నమోదు చేసింది. ఇది ట్రంప్‌కు కంటగింపుగా మారింది. అందుకే ఇలా పదేపదే టారిఫ్‌ల కత్తి దూస్తున్నారు. 2024లో అమెరికాకు భారత ఎగుమతుల్లో డ్రగ్‌ ఫార్మూలాలు–బయోలాజికల్స్‌ (8.1 బిలియన్లు), టెలికాం పరికరాలు (6.5 బిలియన్లు), అరుదైన రాళ్లు (5.3 బిలియన్లు) పెట్రోలియం ఉత్పత్తులు (4.1 బిలియన్లు), వాహనాలు–ఆటో పరికరాలు (2.8 బిలియన్లు), బంగారం–ఇతర లోహాలు (3.2 బిలియన్లు) రెడీమేడ్‌ దుస్తులు, కాటన్‌ తదితరాలు (2.8 బిలియన్లు) ఇనుము, స్టీల్‌ ఉత్పత్తులు (2.7 బిలియన్లు) ప్రధానమైనవి. అమెరికా నుంచి దిగుమతుల్లో ప్రధానంగా చమురు (4.5 బిలియన్లు), పెట్రో ఉత్పత్తులు (3.6 బిలియన్లు), బొగ్గు, కోక్‌ (3.4 బిలియన్లు), వజ్రాలు (2.6 బిలియన్లు), ఎలక్ట్రిక్‌ యంత్రాలు (1.4 బిలియన్లు), విమాన, రాకెట్ల విడిభాగాలు (1.3 బిలియన్లు), బంగారం (1.3 బిలియన్లు) ఉన్నాయి. 

మోదీతో ట్రంప్‌ స్నేహానికి ఇదీ ఫలం!:  విపక్షాల ధ్వజం 
భారత్‌పై 25 శాతం టారిఫ్‌ల విధింపు మోదీ ప్రభుత్వ ఘోర వైఫల్యమేనంటూ విపక్షాలు దుయ్యబట్టాయి. మోదీతో స్నేహానికి ట్రంప్‌ ఏ మాత్రమూ విలువ ఇవ్వడం లేదనేందుకు ఇది తాజా నిదర్శనమని ఎద్దేవా చేశాయి. మోదీపై ట్రంప్‌ తారీఫ్‌ (పొగడ్తలు), హౌడీ మోడీ వంటి నినాదాలు ఎందుకూ కొరగానివని తేలిపోయిందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు.

భారత్‌–పాక్‌ యుద్ధాన్ని ఆపానని ట్రంప్‌ 30సార్లకు పైగా చెప్పుకున్నారు. పాక్‌ ఆర్మీ చీఫ్‌కు వైట్‌హౌస్‌లో ప్రత్యేక విందు ఇచ్చారు. ఐఎంఎఫ్‌ నుంచి భారీ ఆర్థిక సహాయ ప్యాకేజీ ఇప్పించారు. ఇన్ని చేస్తున్నా మౌనంగా భరిస్తే బహుశా ట్రంప్‌ నుంచి స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌ లభిస్తుందని మోదీ ఆశపడ్డారు. కానీ అలా జరగలేదు’’అన్నారు. కాంగ్రెస్‌ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నుంచి స్ఫూర్తి పొంది అమెరికా అధ్యక్షుని నిర్ణయాలను దీటుగా ఎదిరించాలని మోదీకి సూచించారు. టీఎంసీ, డీఎంకే, ఆర్జేడీ, వామపక్షాలు తదితరాలు కూడా మోదీ ప్రభుత్వానిది ఘోర వైఫల్యమంటూ నిందించాయి. ఇది భారత్‌కు తీవ్ర అవమానమని అభిప్రాయపడ్డాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement