
దక్షిణాఫ్రికా అధ్యక్షుడితో వాగ్వాదం
మీ దేశంలో శ్వేతజాతి రైతులను ఊచకోత కోశారని ఆరోపణలు
అసలు బాధితులు నల్లజాతీయులేనని దీటుగా బదులిచ్చిన రమఫొసా
మరోసారి రచ్చబండగా మారిన వైట్‌హౌస్ ఓవల్ ఆఫీస్
వాషింగ్టన్: కొన్ని వారాల క్రితం శ్వేతసౌధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మీడియా సాక్షిగా తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని ఏమాత్రం మార్చుకోలేదు. సాదరంగా ఆహా్వనించి నిందారోపణల బురద కుమ్మరించడం అగ్రరాజ్యానికి ఏమాత్రం తగదని ఆనాడే ప్రపంచమీడియా తీవ్రంగా మందలించినా ట్రంప్ తన తెంపరితనాన్ని ఏమాత్రం తగ్గించుకోలేదని బుధవారం మరోసారి రుజువైంది.
వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటారనే ఆశతో వైట్‌హౌస్‌కు విచ్చేసిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫొసాకు ట్రంప్ ఆరోపణలతో స్వాగతం పలికారు. దక్షిణాఫ్రికాలో వేలాది మంది శ్వేతజాతి రైతులను వధించారని ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో హతాశుడైన రమఫొసా వెంటనే తేరుకుని ట్రంప్‌కు దీటుగా బదులిచ్చారు.
అసలేం జరిగిందంటే?
శ్వేతసౌధంలో మీడియా సమక్షంలో సంయుక్తంగా మాట్లాడేందుకు రమఫొసా సిద్ధంకాగా ట్రంప్ మీడియాతో మాట్లాడటం వదిలేసి అక్కడే ఉన్న పెద్ద టెలివిజన్‌లో ఒక వీడియో చూపిస్తాం చూడండని అక్కడి వారందరినీ ఆదేశించారు. ‘‘శ్వేతజాతీయులను చంపేయండి. శ్వేతజాతి రైతులను కాల్చిచంపండి’’ అంటూ దక్షిణాఫ్రికాలో చిన్నపాటి కమ్యూనిస్ట్‌పార్టీ అయిన ఎకనమిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ నేత జూలియస్ మలేమా పాడుతున్నట్లు ఆ వీడియోలో ఉంది.
వీడియో ప్లే అవడం పూర్తయ్యాక ట్రంప్ రమఫొసాను ఉద్దేశించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ‘‘ దక్షిణాఫ్రికాలో నల్లజాతీయులు జాత్యహంకారానికి గురయ్యారనేది ఒట్టిమాట. వాస్తవానికి వేలాది మంది శ్వేతజాతి రైతులను ఊచకోత కోశారు. ఆ దేశంలో ఎన్నో ప్రాంతాలు శ్వేతజాతీయుల సమాధి దిబ్బలుగా మారాయి. శ్వేతజాతీయులు పీడనకు, వేదనకు గురయ్యారు. మీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో చాలా మంది శ్వేతజాతీయులు బతుకుజీవుడా అంటూ అమెరికాకు శరణార్థులుగా వలసవచ్చారు. వాళ్లకు మేం ఆశ్రయం కల్పించాం’’ అంటూ ట్రంప్ చెప్పుకుంటూ పోయారు.
శ్వేతజాతీయుల అవస్థలు ఇవి అంటూ విదేశీ వార్తాసంస్థల్లో ప్రచురితమైన కథనాల జిరాక్స్ కాపీలను మీడియా ప్రతినిధులకు చూపించి రమఫొసాకు అందజేశారు. వీటికి సంజాయిషీ చెప్పాలని డిమాండ్‌చేశారు. ‘‘ అన్ని హత్యలే. దక్షిణాఫ్రికాలో ఎక్కడ చూసినా మరణాలే’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ వైఖరితో ఒక్కసారిగా విసిగిపోయిన రమఫొసా పట్టరాని ఆగ్రహంతో ఉన్నాసరే సంయమనం పాటించారు. హుందాగా వ్యవహరిస్తూ సూటిగా మాట్లాడారు. ‘‘ అసలేంటీ వీడియో?. నేనెప్పుడూ ఈ వీడియో చూడలేదు. ఎక్కడిదీ వీడియో?. ఈ వీడియో ఎంత వరకు వాస్తవం?’’ అంటూ ట్రంప్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.
‘‘ దశాబ్దాలుగా జాత్యహంకారానికి, పీడనకు కోట్లాదిమంది నల్లజాతీయులు బాధితులయ్యారు. లెక్కలేనంత మంది బలయ్యారు. మా దేశంలో శ్వేతజాతీయుల ఊచకోత అనేది పూర్తిగా అబద్ధం. నిజానికి ఆఫ్రికనర్స్‌గా పిలిచే మైనారిటీ శ్వేతజాతీయులే చాన్నాళ్లు మా దేశాన్ని చెండుకు తిన్నారు. ఆఫ్రికన్ల దీనగా«థను వినే ఓపిక మీకు ఉంటే మా బాధ సరిగ్గా అర్థమవుతుంది.’’ అని రమఫొస సూటిగా సమాధానం ఇచ్చారు. ట్రంప్ చూపిన వీడియోలో ఒక రోడ్డు పక్కన చోట పెద్ద సంఖ్యలో సమాధులు ఉన్నాయి. అయితే ఇవి నిజమైన సమాధులు కావని, 2020లో ఖ్వజూలు–నటాల్ ప్రావిన్సులో ఒక రైతు జంట పొలంలో హత్యకు నిరసనగా ఏర్పాటుచేసిన నకిలీ సమాధులు అని కొందరు వాదించారు.

ఉంటే ఇచ్చేవాడినే
శ్వేతజాతి, నల్లజాతీయుల్లో ఎవరు పీడనకు గురయ్యారని ఓవైపు ట్రంప్, రమఫొసా వాదించుకుంటుంటే ఒక విలేకరి మధ్యలో కల్గజేసుకుని వందల కోట్ల రూపాయల విలువైన విమానాన్ని బహుమతిగా స్వీకరించడం ఎంత వరకు నైతికతగా అనిపించుకుంటుంది? అని ట్రంప్‌ను సూటి ప్రశ్న వేశారు. దీంతో చిర్రెత్తికొచ్చిన ట్రంప్.. ‘‘ నువ్వో చెత్త రిపోర్టర్‌వు. ఇంత కీలకమైన విషయంపై చర్చిస్తుంటే మధ్యలో నీ విమానం గోల ఏంటి?. నువ్వు అసలు ప్రశ్నలు అడగొద్దు’’ అని అతనిపై ట్రంప్ అరిచాడు. ఆగ్రహంతో ఊగిపోతున్న ట్రంప్‌ను కూల్ చేసేందుకు రమఫొసా మధ్యలో కలుగజేసుకున్నారు.
‘‘ ఖతార్ మాత్రమే కాదు. కావాలంటే మేం కూడా మీకు విమానాన్ని బహుమానంగా ఇస్తాం’’ అని అన్నారు. దీనికి ట్రంప్ వెటకారంగా బదులిచ్చారు. ‘‘ అగ్రరాజ్యమైన అమెరికాకే ఎయిర్‌ఫోర్స్‌వన్‌గా కొత్త విమానాన్ని ఇచ్చే దమ్ముంటే మీరూ ఇవ్వొచ్చు. నేను తీసుకునేందుకు రెడీ’’ అని అన్నారు. వెంటనే రమఫొసా ‘‘ అగ్రరాజ్యంగా ఉండి కూడా మీరు ఇంకొకరి నుంచి తీసుకునే స్థితిలో ఉన్నా.. ఇచ్చే స్థితిలో మేం లేము. మా వద్ద అసలు విమానమే లేదు’’ అని అనేసరికి అక్కడ ఉన్న వాళ్లంతా ఘొల్లున నవ్వేశారు.