న్యూయార్క్: భారత్ నుంచి మొదటిసారిగా అమెరికా పర్యటనకు వెళ్లిన ఒక కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. న్యూయార్క్ నగరంలోని ప్రసిద్ధ సెంట్రల్ పార్క్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన గుర్రపు బగ్గీ ప్రమాదంలో 18 ఏళ్ల భారతీయ యువకుడు రోమంచ్ మహాజన్ దుర్మరణం పాలయ్యాడు. డ్రైవర్ అజాగ్రత్త, అదుపుతప్పిన గుర్రం కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఫొటో కోసం ఆగిన వేళ.. ఊహించని ప్రమాదం
న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. దీపక్ మహాజన్ తన భార్య ప్రియ, కుమారుడు రోమంచ్, కుటుంబంలోని మరో సభ్యుడితో కలిసి సెంట్రల్ పార్క్‌లో గుర్రపు బగ్గీ షికారుకు వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో, వారి కుటుంబీకులకు ఒక ఫొటో తీసేందుకు బగ్గీ డ్రైవర్ కిందికి దిగాడు. నిబంధనల ప్రకారం డ్రైవర్ అలా దిగకూడదు. అదే సమయంలో ఆ గుర్రం అకస్మాత్తుగా బెదిరి, డ్రైవర్ నియంత్రణలో లేకపోవడంతో వేగంగా పరుగెత్తడం ప్రారంభించింది. బగ్గీ అదుపుతప్పి వేగంగా దూసుకుపోవడంతో లోపల ఉన్న కుటుంబ సభ్యులు ప్రాణభయంతో కేకలు వేశారు.
Here’s a video of the horse breaking free and the carriage driver chasing after it.
A person comes jumping/falling out of the carriage at the end of the clip. pic.twitter.com/BZmEOXqhxC
— Gus Saltonstall (@GusSaltonstall) June 17, 2026
తల్లిని రక్షించే క్రమంలో అనంత లోకాలకు
గుర్రం వేగంగా పరుగెడుతున్న క్రమంలో బగ్గీ మరో వాహనాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రోమంచ్ తల్లి ప్రియ మొదట బగ్గీ నుంచి కిందపడిపోయారు. ఆమెను కాపాడే ప్రయత్నంలో 18 ఏళ్ల రోమంచ్ కూడా వేగంగా వెళ్తున్న బగ్గీ నుంచి కిందికి దూకాడు. దురదృష్టవశాత్తూ అతను కింద పడేటప్పుడు తల భూమికి బలంగా తగలడంతో తీవ్ర గాయాలపాలై స్పృహ కోల్పోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ రోమంచ్ మృతి చెందాడు. మిగిలిన ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ హృదయవిదారక సంఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
నిషేధానికి పెరుగుతున్న డిమాండ్
ఈ ఘోర ప్రమాదం న్యూయార్క్ నగరంలో గుర్రపు బగ్గీల భద్రతపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. న్యూయార్క్ స్టేట్ సెనేటర్ ఎరిక్ బాట్చర్ బాధిత కుటుంబానికి సంతాపం ప్రకటిస్తూ, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో ఇలాంటి గుర్రపు బగ్గీలు ఉండటం సురక్షితం కాదని అన్నారు. ఈ సంస్కృతిని ముగించేందుకు తక్షణమే ‘రైడర్స్ లా’ బిల్లును ఆమోదించి, నగరంలో గుర్రపు బగ్గీలను పూర్తిగా నిషేధించాలని ఆయన న్యూయార్క్ సిటీ కౌన్సిల్‌ను డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: చాట్‌జీపీటీ గురువు కాదు.. కాలేజీకి డుమ్మా కుదరదు!


