ఆస్ట్రేలియాలో సోషల్ మీడియా బ్యాన్‌ ఫెయిల్? | Teenagers Outsmart Australias Social Media Ban | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలో సోషల్ మీడియా బ్యాన్‌ ఫెయిల్?

Jun 26 2026 1:19 PM | Updated on Jun 26 2026 1:23 PM

Teenagers Outsmart Australias Social Media Ban

ప్రపంచ దేశాలన్నీ ఆదర్శంగా చూసిన ఆస్ట్రేలియా సోషల్ మీడియా బ్యాన్‌ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదా? 16 ఏళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలనే ఉద్దేశం నెరవేరడం కష్టంగా ఉందా?. ప్రపంచంలోనే ఈ తరహా తొలి చట్టం అమల్లోకి తెచ్చిన ఆ దేశానికి.. ఆరు నెలలు తిరిగే సరికి పెద్ద షాక్‌ తగిలింది. 85 శాతం మంది పిల్లలు.. ఇప్పటికీ ఇప్పటికీ సోషల్ మీడియాను వినియోగిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.

పిల్లల్లో సోషల్ మీడియా వ్యసనం, మానసిక ఆరోగ్య సమస్యలు, ఆన్‌లైన్‌ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని 2025 డిసెంబర్‌ 10న చట్టం అమల్లోకి తెచ్చింది ఆంథోనీ అల్బనీస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం. దీని ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌, టిక్‌టాక్‌, ఫేస్‌బుక్‌ వంటి ప్రముఖ వేదికలు 16 ఏళ్లలోపు వారికి ఖాతాలు ఇవ్వకుండా ఈ చట్టం ఆదేశించింది. కాదని ముందుకు వెళ్తే.. భారీ జరిమానాలతో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆరంభంలో మంచి ఫలితం ఇవ్వడంతో.. ఈ నిర్ణయాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆదర్శంగా తీసుకున్నాయి.

అయితే, ఆ చట్టం అమల్లోకి వచ్చి ఆరు నెలలు గడిచిన తర్వాత పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించలేదని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. బ్రిటిష్ మెడికల్ జర్నల్ (BMJ)లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. 12 నుంచి 15 ఏళ్ల వయసున్న ఆస్ట్రేలియా పిల్లల్లో దాదాపు 85 శాతం మంది ఇప్పటికీ సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు.

ఈ అధ్యయనంలో పాల్గొన్న చిన్నారుల్లో దాదాపు మూడింట రెండొంతుల మంది.. నిబంధనల్లోని లొసుగులను వినియోగించుకున్నట్లు తేలింది. 16 ఏళ్లకు పైబడిన వారికే ఖాతాలు అనుమతించే నిబంధనను తప్పించుకునేందుకు.. తమ వయసును 16 ఏళ్లు దాటినట్లు నమోదు చేయడమో లేదంటే సెల్ఫీ ఆధారిత వయస్సు ధ్రువీకరణను దాటేయడమో చేస్తున్నారాట. తద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సోషల్‌ మీడియా ఖాతాలను యథావిధిగా కొనసాగించినట్లు అధ్యయనం వెల్లడించింది. దీంతో బ్యాన్‌ అమలులోని లోపాలు బహిర్గతమయ్యాయి.

దీంతో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన ఈ మోడల్‌పై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో చట్టం అమలులో లోపాలను సరిదిద్దేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం మరింత కఠిన వైఖరిని అవలంభించాలని నిర్ణయించింది. 

ఇప్పటికే పలు వేదికలు ఈ నిర్ణయంపై కోర్టుల్ని ఆశ్రయించాయి. దీంతో న్యాయపరమైన సవాళ్లను కూడా తట్టుకునేలా చట్టాన్ని బలోపేతం చేయడమే కాకుండా.. దేశంలోని ఈ-సేఫ్టీ కమిషన్‌కు మరిన్ని అధికారాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. నిబంధనలు పాటించని సోషల్ మీడియా సంస్థలపై.. 49.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల(సుమారు 322 కోట్ల రూపాయలు) వరకు జరిమానా విధించే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే కొన్ని వేదికలపై చట్టపరమైన చర్యలకు సైతం అల్బనీస్‌ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఇక.. ఆస్ట్రేలియా ప్రయోగాన్ని అనుసరించేందుకు ఇప్పటికే పలు దేశాలు అడుగులు వేస్తున్నాయి. టీనేజర్లకు(16 ఏళ్లలోపు) సోషల్ మీడియాతో పాటు గేమింగ్‌, లైవ్‌-స్ట్రీమింగ్‌ వేదికలపైనా బ్రిటన్ ఆంక్షలు విధించే ప్రణాళికను ప్రకటించింది. ఫ్రాన్స్, స్పెయిన్, గ్రీస్, నార్వే వంటి దేశాలు కూడా చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు లేదంటే నిషేధాల దిశగా కసరత్తు చేస్తున్నాయి.

మొత్తానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన ఆస్ట్రేలియా సోషల్ మీడియా బ్యాన్‌ ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే దీన్ని వైఫల్యంగా అంగీకరించకుండా.. చట్టంలోని లోపాలను సరిదిద్దుతూ మరింత సమర్థవంతంగా అమలు చేయడంపైనే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇప్పుడు దృష్టి పెట్టింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement