సౌదీ చమురు నౌకపై దాడి.. ఇద్దరు సిబ్బంది మృతి | S​​audi Oil Tanker Attack Oman Two Crew Members Killed | Sakshi
Sakshi News home page

సౌదీ చమురు నౌకపై దాడి.. ఇద్దరు సిబ్బంది మృతి

Sep 8 2026 4:26 AM | Updated on Sep 8 2026 4:26 AM

S​​audi Oil Tanker Attack Oman Two Crew Members Killed

మస్కట్‌: ఒమన్‌లోని ముసందమ్‌ గవర్నరేట్‌ సమీప సముద్ర జలాల్లో సౌదీ జెండాతో ప్రయాణిస్తున్న చమురు నౌకపై దాడి జరిగినట్లు ఒమన్‌ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో నౌకలో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బంది మృతి చెందారు. ‘ఎస్ఐడీఆర్‌’ అనే చమురు నౌకపై ఓ ప్రాజెక్టైల్‌ తాకడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

ముసందమ్‌ తీరానికి సమీపంలో సముద్రంలో ప్రయాణిస్తున్న సమయంలోనే ఈ నౌకపై దాడి జరిగినట్లు సమాచారం. ఘటన జరిగిన సమయంలో నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. దాడి అనంతరం నౌకలో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో వెంటనే సహాయక చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న వెంటనే ఒమన్‌ నావికాదళానికి చెందిన నౌక ఘటనాస్థలికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. నౌకలో ఉన్న సిబ్బందిని రక్షించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. సహాయక చర్యల్లో భాగంగా 16 మంది సిబ్బందిని సురక్షితంగా బయటకు తరలించి, వారికి అవసరమైన వైద్యసాయం అందించినట్లు అధికారులు స్పష్టం చేశారు.

ప్రమాదం జరిగిన నౌక పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్లు ఒమన్‌ మారిటైమ్‌ సెక్యూరిటీ సెంటర్‌ తెలిపింది. ఘటనకు సంబంధించి అవసరమైన సహాయక చర్యలను పూర్తి చేసినట్లు పేర్కొంది. ఈ దాడికి సంబంధించిన ఇతర వివరాలపై అధికారులు ఇంకా సమాచారం తెలియాల్సి ఉందని అధికారలు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement