
ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగింది. శాంతి చర్చల్లో ముందడుగు పడకపోతే కఠినంగా వ్యవహరిస్తానంటూ రష్యాపై రంకెలు వేసిన ట్రంప్.. అలస్కా చర్చల తర్వాత కాస్త మెత్తబడ్డాడు. ఉక్రెయిన్ శాంతి చర్చలు అర్ధరహితంగా ముగిసినట్లు వాళ్ల ప్రకటనలను బట్టి స్పష్టమవుతోంది. ఈ క్రమంలో.. ట్రంప్ ఇంకా అలస్కాలో ఉండగానే పుతిన్ అక్కడి నుంచి నిష్క్రమించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే..
అలస్కాలో జర్నలిస్టులు సంధించిన ప్రశ్నలను ఇరు దేశాల అధినేతలు స్వీకరించలేదు. తాము చెప్పాలనుకున్నది చెప్పి.. తలోదారి వెళ్లిపోయారు. యాంకరేజ్ విమానాశ్రయంలో, అలాగే చర్చలు ప్రారంభం కావడానికి ముందు పీస్ రూమ్‌లోనూ ఇరు దేశాధినేతలు మీడియా ముందు ఆసీనులయ్యారు. ఆ సమయంలో ఉక్రెయిన్ కాల్పుల విరమణ, యుద్ధంలో సాధారణ పౌరులు మరణించడం లాంటి ప్రశ్నలు పుతిన్‌కు ఎదురయ్యాయి.
‘‘సాధారణ పౌరుల్ని చంపడం ఇంకెప్పుడు ఆపుతారు?’’ అంటూ ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా.. దానికి పుతిన్ తనకేమీ వినబడడం లేదన్నట్లు సైగ చేసి చూపించారు. అదే సమయంలో ‘‘ట్రంప్ మిమ్మల్ని మాత్రమే ఎందుకు నమ్ముతున్నారు?’’ అని మరో విలేఖరి ప్రశ్నించగా.. జర్నలిస్టుల గోలతో పుతిన్ ఇచ్చిన వివరణ వినిపించనట్లే కనిపించింది.
పుతిన్‌పై అంతర్జాతీయ నేరస్థుల కోర్టు కేసు ఉన్నప్పటికీ.. అమెరికా భూభాగంలోకి ఎందుకు ఆహ్వానించారు?.
ఉక్రెయిన్‌ను నేరుగా భాగం కానీయకుండా కాల్పులవిరమణ డీల్ కుదర్చాలని ట్రంప్ భావిస్తున్నారా?.
పుతిన్ ఎలాంటి రాయితీలు ఇవ్వవచ్చు? ట్రంప్ ఏమి అంగీకరించవచ్చు?
ఇది యుద్ధ విరామానికి దారి తీస్తుందా? లేదంటే రాజకీయ నాటకం మాత్రమేనా? అని ప్రశ్నలు గుప్పించారు. అయితే వీటిలో వేటికి సమాధానాలు రాలేదు.
దీంతో.. సోషల్ మీడియా సదరు జర్నలిస్టుల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతోంది. ఇవే ప్రశ్నలను గాజాపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహును అడిగే దమ్ముందా? అని నిలదీస్తోంది.
‘‘2023 అక్టోబర్ 7వ తేదీన గాజా యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్ దాడులతో ఇప్పటిదాకా 60 వేలమందికిపైనే మరణించారు. అందులో 70 శాతం మహిళలు, చిన్నారులే ఉన్నారని నివేదికలు గణాంకాలతో సహా చెబుతున్నాయి. అయితే ఈ మరణాలపై నెతన్యాహు ఏనాడూ స్పందించగా పోగా.. కనీసం విచారం కూడా వ్యక్తం చేసింది లేదు. పైగా ఎంతసేపు హమాస్ అంతమే శాంతికి మార్గం అంటూ చెబుతూ వస్తున్నారు. దీనికి తోడు మానవతా సాయం అందకుండా చేశారనే ఆరోపణలు ఆయపై ఉన్నాయి. ఈ క్రమంలో యుద్ధ నేరాల కింద అంతర్జాతీయ న్యాయస్థానం నెతన్యాహుపై వారెంట్ సైతం జారీ చేసింది.

ఈ పరిణామాలపై ఇటు ఇజ్రాయెల్.. అటు అమెరికా జర్నలిస్టులెవరూ ఆయన్ని ప్రశ్నించే సాహసం చేయలేకపోయారు. మరోవైపు.. రెండుసార్లు నెతన్యాహు అమెరికా పర్యటనకు వచ్చారు. ఆ సమయంలోనూ జర్నలిస్టులెవరూ.. గాజా పౌరుల మరణాల గురించి ఎందుకు నిలదీయలేదు?’’ అని సోషల్ మీడియా కోడై కూస్తోంది.
ఇదిలా ఉంటే.. 2022 ఫిబ్రవరిలో మొదలైన ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో లక్షల మంది మరణించారు. మూడున్నరేళ్ల యుద్ధానికి పుల్‌స్టాప్ పెట్టే ఉద్దేశంలో పర్సూయింగ్ పీస్ పేరిట అలస్కా చర్చల్లో పాల్గొన్నారు. ట్రంప్-పుతిన్‌లు ఐదారుగంటలు అలస్కాలోనే గడపగా.. రెండున్నర గంటలపాటు చర్చలు జరిగాయి. అయితే.. ఉక్రెయిన్ కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు పట్టుబట్టగా.. అందుకు రష్యా అధినేత ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది.
Vladimir Putin’s reaction was nothing short of remarkable—reporters shouted, but his expression told its own story. pic.twitter.com/07vkASuJIc
— Tarique Hussain (@Tarique18386095) August 15, 2025
భేటీకి ముందు జర్నలిస్టుల ప్రశ్నలకు స్పందించని ఇరువురు నేతలు.. సంయుక్తంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లోనూ మీడియా ప్రతినిధులను ప్రశ్నలకు అనుమతించలేదు. మరోవైపు.. అలస్కా చర్చల సారాంశం కోసం రష్యా అధికారుల బృందాన్ని పలువురు జర్నలిస్టులు కలిసే ప్రయత్నమూ విఫలమైంది. అదే సమయంలో.. ట్రంప్ తన అనుకూల రిపోర్టర్లతో పుతిన్‌పై ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేశారని, దాని నుంచి పుతిన్ భలేగా తప్పించుకున్నారనే వాదన నెట్టింట నడుస్తోంది.
.. అలస్కాలో ట్రంప్ దౌత్యం విఫలమేనని కొన్ని అమెరికన్ మీడియా చానెల్స్ ప్రముఖంగా చర్చిస్తున్నాయి. కానీ, ట్రంప్ మాత్రం ఎంతో కొంత పురోగతి సాధించాం అని చెబుతుండడం గమనార్హం. ‘‘పుతిన్ చాలా టఫ్, స్ట్రాంగ్ ఫెల్లో. ఇక దారికి రావాల్సింది జెలెన్‌స్కీనే’ అన్నట్లు ఫ్యాక్స్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. ఇంకోవైపు.. అలస్కాలో ట్రంప్-పుతిన్ భేటీలో రష్యా అనుకూల ఏకపక్ష డీల్ కుదరనందుకు సంతోషమంటూ ఉక్రెయిన్ ఎద్దేవా ప్రకటన విడుదల చేసింది.