Shubhanshu Shukla: భూమిపైకి శుభాంశు శుక్లా | Shubhanshu Shukla to Land on Earth | Sakshi
Sakshi News home page

Shubhanshu Shukla: భూమిపైకి శుభాంశు శుక్లా

Jul 15 2025 3:05 PM | Updated on Jul 15 2025 4:16 PM

Shubhanshu Shukla to Land on Earth

వాషింగ్టన్‌: అంతరిక్షంలో భారత కీర్తిపతాకను సమున్నతంగా ఎగరేసిన మన ముద్దుబిడ్డ శుభాంశు శుక్లా నింగి నుంచి సగర్వంగా నేలకు తిరిగొచ్చాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో అడుగుపెట్టిన తొలి భారతీయునిగా చెరిగిపోని రికార్డును తన పేరిట లిఖించుకున్న శుభాంశు.. మరో ముగ్గురు సహచర వ్యోమగాములతో కలిసి సురక్షితంగా భూపైకి చేరుకున్నారు

యాక్సియం-4 మిషన్ లో భాగంగా... అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా, మరో ముగ్గురు వ్యోమగాములు భూమిపైకి చేరుకున్నారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 2.50 నిమిషాలకు కాలిఫోర్నియా సమీపంలోని సముద్ర జలాల్లో ల్యాండింగ్‌ అయ్యారు. డ్రాగన్‌ స్పేస్‌ క్యాప్స్‌లో భూమి మీదకు చేరుకున్నారు. వ్యోమగాములను ఏడు రోజుల పాటు క్వారంటైన్‌కు తరలించేందుకు స్పేస్‌ ఎక్స్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఐఎస్‌ఎస్‌ నుంచి ఘనంగా వీడ్కోలు 
ఐఎస్‌ఎస్‌లోని ఏడుగురు సహచర వ్యోమగాములు శుభాంశు బృందానికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఆ సందర్భంగా పరస్పర కౌగిలింతలు, కరచాలనాలు ముగిసిన అనంతరం వాతావరణం ఉద్వేగపూరితంగా మారింది. 18 రోజుల పాటు కలిసి గడిపిన క్షణాలను అందరూ ఆనందంగా నెమరేసుకున్నారు. ముఖ్యంగా శుభాంశు రుచి చూపిన క్యారెట్, పెసరపప్పు హల్వాను ఎన్నటికీ మర్చిపోలేమని సహచరులు చెప్పుకొచ్చారు.  

జూన్ 25న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర ప్రారంభం
శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర జూన్ 25, 2025న ప్రారంభమైంది. అమెరికాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ ద్వారా శుక్లా బృందం అంతరిక్షంలోకి వెళ్లింది. 28 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోకి ప్రవేశించారు. అక్కడ పైలట్‌ శుక్లా నేతృత్వంలోని గ్రూప్‌ మొత్తం 60 రకాల శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించింది. ఇందులో శుక్లా ఒక్కరే స్వయంగా 7 ప్రయోగాలు నిర్వహించారు. 

ఫ్లోటింగ్‌ వాటర్‌ బబుల్‌ 
ఐఎస్‌ఎస్‌లో 60కి పైగా ప్రయోగాలు 
శుభాంశు బృందం ఐఎస్‌ఎస్‌లో 18 రోజులు గడిపింది. ఆ క్రమంలో 60 కీలక ప్రయోగాలు చేపట్టింది. అంతరిక్షంలో జీరో గ్రావిటీ పరిస్థితుల్లో మానవ కండరాలకు కలిగే నష్టంపై శుక్లా అధ్యయనం చేశారు. మానవ జీర్ణవ్యవస్థ ఖగోళంలో ఎలా పని చేస్తుందనే అంశంపై భారత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక వీడియోను ఆయన రూపొందించారు. 

దాంతోపాటు నలుగురు వ్యోమగాముల బృందం తమ మానసిక స్థితిగతులపైనా ప్రయోగాలు చేసి చూసింది. ఆ క్రమంలో ఫ్లోటింగ్‌ వాటర్‌ బబుల్‌ తయారు చేసి అందులో గడిపింది. అది అద్భుతమైన అనుభవమని శుభాంశు గుర్తు చేసుకున్నారు. ‘‘ఐఎస్‌ఎస్‌లో ప్రతి క్షణాన్నీ పూర్తిగా ఆస్వాదించా. ముఖ్యంగా కిటికీ పక్కన కూచుని కిందకు చూడటాన్ని. బహుశా నా జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన అనుభూతి అది’’ అని చెప్పారు. అంతరిక్షంలో వ్యవసాయం దిశగా కూడా వ్యోమగాములు పలు కీలక పరీక్షలు జరిపారు.

శుభాంశు వచ్చేశాడు..

76 లక్షల మైళ్లు..288 భూ ప్రదక్షిణలు 
శుభాంశు బృందం ఐఎస్‌ఎస్‌లో గడిపిన 18 రోజుల్లో భూమి చుట్టూ ఏకంగా 76 లక్షల మైళ్లకు పైగా ప్రయాణించింది. ఆ క్రమంలో 288 సార్లు భూప్రదక్షిణలు చేసింది.  

నవభారత శకమిది శుభాంశు భావోద్వేగం 
భూమికి తిరుగు ప్రయాణమయ్యే ముందు శుభాంశు ఐఎస్‌ఎస్‌లో వీడ్కోలు ప్రసంగం చేశారు. 41 ఏళ్ల ముందు రాకేశ్‌ శర్మ రూపంలో తొలి భారతీయుడు అంతరిక్షంలో కాలు పెట్టిన క్షణాలను, అక్కడినుంచి భారత్‌ కనిపించిన  తీరును వర్ణించిన వైనాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ‘‘మా తిరుగు ప్రయాణం సందర్భంగా ఈ రోజు ఆకాశం నుంచి భారత్‌ ఎలా కనిపిస్తుందో చూడాలని మా బృందమంతా ఉత్సాహపడుతోంది. నేటి భారత్‌ ఘనమైన ఆకాంక్షల భారత్‌. నిర్భయ భారత్‌. సగర్వంగా తలెత్తుకుని సాగుతున్న భారత్‌. అందుకే నేడు కూడా నా దేశం మిగతా ప్రపంచమంతటి కంటే మిన్నగా (సారే జహా సే అచ్ఛా) కనిపిస్తోందని చెప్పగలను’’ అంటూ నాడు రాకేశ్‌ శర్మ చేసిన వ్యాఖ్యలను శుభాంశు పునరుద్ఘాటించారు.

 అక్కడి సహచరులపై శుభాంశు ఈ సందర్భంగా ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘ఈ యాత్ర ఇంత అద్భుతంగా సాగుతుందని జూన్‌ 25న ఫాల్కన్‌–9 రాకెట్‌ ద్వారా అంతరిక్షానికి పయనమయ్యే క్షణాల్లో నేనస్సలు ఊహించలేదు! ఇదంతా ఇదుగో, ఇక్కడ నా వెనక నుంచున్న ఈ అద్భుతమైన వ్యక్తుల వల్లే సాధ్యమైంది. ఈ యాత్రను మా నలుగురికీ అత్యంత ప్రత్యేకమైనదిగా మార్చింది వీళ్లే. అంకితభావంతో కూడిన ఇలాంటి అద్భుతమైన వృత్తి నిపుణులతో కలిసి పని చేయడం నిజంగా మరచి పోలేని అనుభూతి’’ అంటూ హర్షం వెలిబుచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement