నావికులకు భద్రత కల్పించాలి! | Safety of seafarers is our collective responsibility says PM Narendra Modi | Sakshi
Sakshi News home page

నావికులకు భద్రత కల్పించాలి!

Jun 17 2026 5:44 AM | Updated on Jun 17 2026 5:58 AM

Safety of seafarers is our collective responsibility says PM Narendra Modi

సముద్ర రవాణా మార్గాలు సురక్షితంగా ఉండేలా చూడాలి  

నావికులు నిర్భయంగా విధులను నిర్వర్తించేలా చర్యలు చేపట్టాలి   

జీ7 సదస్సులో డొనాల్డ్‌ ట్రంప్‌ సమక్షంలో తేల్చిచెప్పిన ప్రధాని మోదీ 

ఎవియన్‌–లెస్‌–బెయిన్స్‌: సముద్ర రవాణా మార్గాలు సురక్షితంగా ఉండేలా, నావికులు నిర్భయంగా తమ విధులను నిర్వర్తించేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అన్ని దేశాలపైనా ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. సముద్ర వాణిజ్యం ద్వారా అన్ని దేశాలను అనుసంధానించే నావికులకు తగిన భద్రత కచ్చితంగా కల్పించాలన్నారు. మంగళవారం ఫ్రాన్స్‌లో జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. 

నౌకల్లో విధులు నిర్వర్తించే నావికుల భద్రత గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సమక్షంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇటీవల ఒమన్‌ తీరంపై వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం దాడులు చేయడంతో ముగ్గురు భారతీయులు మరణించిన సంగతి తెలిసిందే. అమెరికా దుశ్చర్యను భారత్‌ ఇప్పటికే తీవ్రంగా ఖండించింది. హార్మూజ్‌ జలసంధిలో సముద్ర వాణిజ్యానికి కలిగిన అంతరాయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించాయని మోదీ తెలిపారు. 

పశ్చిమాసియా సంఘర్షణలో పలువురు భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. సంఘర్షణలకు శాశ్వత పరిష్కార మార్గాలను చర్చలు, దౌత్యం, అంతర్జాతీయ సహకారం ద్వారా మాత్రమే కనుగొనాలని చెప్పారు. ప్రపంచం ‘దాత–గ్రహీత’ అనే విధానం నుంచి సంఘీభావం, సమానత్వంపై ఆధారపడిన భాగస్వామ్యాల వైపు పయనించాలని మోదీ చెప్పారు. 

పరస్పర అనుసంధానం వేగంగా పెరుగుతున్న నేటి ప్రపంచంలో అంతర్జాతీయ భాగస్వామ్యాలను పెంపొందించడంలో ‘విశ్వాసం’అత్యంత కీలకమని స్పష్టంచేశారు. ‘ఒకరు దాత, మరొకరు గ్రహీత’ అనే విధానాన్ని వదులుకోవాలని, మనమంతా సమాన భాగస్వాములుగా పనిచేయాలని వ్యాఖ్యానించారు. మనం కేవలం ఒకరి పక్కన ఒకరు నడవడమే కాకుండా.. కలిసి నడవాలన్నారు. భాగస్వామ్యాలు గౌరవంతో ముడిపడి ఉండాలి తప్ప పరా«దీనతతో కాదని 
తేల్చిచెప్పారు. 

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంపై దృష్టి: ట్రంప్‌ 
మూడున్నర నెలలుగా కొనసాగుతున్న పశ్చిమాసియా యుద్ధానికి ముగింపు పలికే శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇకపై రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధానికి తెరదించడంపై దృష్టి పెడతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంకేతాలిచ్చారు. ఇటీవలి కాలంలో ఉక్రెయిన్‌ అంశం కంటే ఇరాన్‌ వివాదమే ఎక్కువగా చర్చనీయాంశమైంది. ఇరాన్‌ వ్యవహారం ఇక వెనక్కి వెళ్లిపోయినట్లేనని ట్రంప్‌ అన్నారు. రష్యా–ఉక్రెయిన్‌ సంఘర్షణను ముగించడానికి తాను చేయల్సిందంతా చేస్తానని వెల్లడించారు. జీ7 సదస్సులో ట్రంప్‌తోపాటు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సైతం పాల్గొన్నారు.

 ఉదయం వర్కింగ్‌ సెషన్‌ 75 నిమిషాల్లోనే ముగిసింది. రష్యా చమురు, సహజ వాయువు రంగాలను లక్ష్యంగా చేసుకుని ఆంక్షల ద్వారా ఆ దేశంపై ఒత్తిడిని పెంచడానికి ట్రంప్‌తో సహా జీ7 దేశాల నాయకులు అంగీకరించినట్లు సమాచారం. ఈ సదస్సులో ఉక్రెయిన్‌ అంశంపై చాలా ఫలవంతమైన సంభాషణ జరిగిందని ఓ దౌత్యవేత్త చెప్పారు. అదనపు వైమానిక రక్షణ సామర్థ్యాలు, ఇతర రక్షణలు సమకూర్చడం ద్వారా ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడంపైనా నాయకులు అంగీకారానికి వచ్చారని తెలిపారు.  

కెనడా ప్రధానితో మోదీ భేటీ  
ప్రధాని మోదీ మంగళవారం కెనడా ప్రధానమంత్రి మార్క్‌ కార్నీతో సమావేశమయ్యారు. వాణిజ్యం, ఇంధనం, ఆవిష్కరణలు, విద్య, ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాల ద్వారా బలమైన భాగస్వామ్యాన్ని పెంపొందించే మార్గాలపై చర్చించారు. ఫ్రాన్స్‌లో జీ7 సదస్సు సందర్భంగా ఈ భేటీ జరిగింది. భారత్, కెనడా మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో సాధించిన పురోగతిని సమీక్షించారు.  

హలో మై ఫ్రెండ్‌ 
జీ7 సదస్సు వేదిక వద్ద మోదీ, ట్రంప్‌ ఆత్మీయ సంభాషణ 
16 నెలల తర్వాత ముఖాముఖి 
నేడు పూర్తిస్థాయి ద్వైపాక్షిక సమావేశం   
ఎవియన్‌–లెస్‌–బెయిన్స్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 16 నెలల తర్వాత ముఖాముఖి కలుసుకున్నారు. ఫ్రాన్స్‌లోని ఎవియన్‌–లెస్‌–బెయిన్స్‌లో జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మంగళవారం వారిద్దరూ ఆప్యాయంగా కరచాలనం చేసుకుని, ఆ తర్వాత కాసేపు సంభాషించారు. క్లుప్తంగా చర్చించుకున్నారు. వారు సంభాషణకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఇరువురు నేతల మధ్య పూర్తిస్థాయి ద్వైపాక్షిక చర్చలు బుధవారం జరుగుతాయి. 

పశ్చిమాసియా సంక్షోభం, రష్యా–ఉక్రెయిన్‌ సంఘర్షణ, భారత్‌–అమెరికా సంబంధాలు సహా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై వారు తమ అభిప్రాయాలను పంచుకొనే అవకాశం ఉంది. మోదీ గత ఏడాది ఫిబ్రవరిలో అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో పర్యటించారు. అప్పట్లో ట్రంప్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఇద్దరు నాయకులు ఫోన్‌లో పలుమార్లు మాట్లాడుకున్నప్పటికీ ముఖాముఖి కలుసుకొని చర్చించుకోవడం ఇదే మొదటిసారి. 

ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్, అమెరికా మధ్య సంబంధాలు కొంత బలహీనపడ్డాయి. ఇరుదేశాల మధ్య కొన్నాళ్లు టారిఫ్‌ల యుద్ధం సాగింది. చమురు కొనుగోలు విషయంలోనూ భారత్‌పై ఆంక్షలు విధించేందుకు ట్రంప్‌ ప్రయత్నించారు. భారత్, అమెరికా మధ్య యుద్ధాన్ని తానే ఆపేశానని ట్రంప్‌ ప్రకటించడం భారత్‌కు ఇబ్బందికరంగా మారింది. ఆపరేషన్‌ సింధూర్‌ను నిలిపివేయడం వెనుక ట్రంప్‌ ప్రమేయం లేదని భారత్‌ పలుమార్లు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అలాగే ట్రంప్‌ తీసుకొచ్చిన నూతన వలస విధానం, హెచ్‌–1బీ వీసా రుసుమును పెంచడం వంటి నిర్ణయాలు భారత్‌–అమెరికా సంబంధాలపై ఒత్తిడి పెంచాయి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement