రష్యా, ఉక్రెయిన్‌ మధ్య భీకర దాడులు | Russia-Ukraine Fresh-Missile-Drone-Attacks | Sakshi
Sakshi News home page

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య భీకర దాడులు.. 15 మంది మృతి

Jul 3 2026 11:35 PM | Updated on Jul 3 2026 11:38 PM

Russia-Ukraine Fresh-Missile-Drone-Attacks

నాలుగేళ్లుగా సాగుతోన్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది. ఒకరోజు క్రితం కీప్పై రష్యా భారీ క్షిపణి, డ్రోన్ దాడులు జరపగా.. శుక్రవారం కూడా ఇరు దేశాలు పరస్పరం దాడులు కొనసాగించాయి. తాజా దాడుల్లో ఇరు దేశాల్లో కలిపి కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. 

ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపిన వివరాల ప్రకారం.. రష్యా రాత్రికి రాత్రే 2 క్షిపణులు, 105 డ్రోన్లతో దాడులు చేసింది. మరోవైపు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ.. ఉక్రెయిన్ ప్రయోగించిన 155 డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు రష్యా భూభాగంతో పాటు ఆక్రమిత క్రిమియా ద్వీపకల్పం మీద కూల్చివేసినట్లు ప్రకటించింది. 

ఉక్రెయిన్లోని రష్యా ఆక్రమిత జపోరిజ్జియా ప్రాంతంలో జరిగిన ఉక్రెయిన్ దాడిలో స్థానిక మార్కెట్ లక్ష్యంగా మారింది. ఈ ఘటనలో ఐదుగురు పౌరులు మృతి చెందగా మరో మూడు వేర్వేరు దాడుల్లో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ ప్రాంతానికి రష్యా నియమించిన గవర్నర్ యెన్గెనీ బాలిట్స్కీ తెలిపారు. షాపింగ్ చేస్తున్న సాధారణ ప్రజలనే ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు.

రష్యాలోని బెల్గారోడ్ ప్రాంతంలో ఒకరు, పొరుగున ఉన్న బ్రయాన్క్ ప్రాంతంలో మరో వ్యక్తి ఉక్రెయిన్ దాడుల్లో మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ ఈశాన్యంలోని సుమీ ప్రాంతంలో రష్యా దాడి ఓ నివాస ప్రాంతాన్ని తాకింది. ఇల్లు మంటల్లో చిక్కుకోవడంతో రెండేళ్లలోపు చిన్నారి సహా నలుగురు మృతి చెందారు. మృతుల్లో చిన్నారి తల్లి, మరో మహిళ, వృద్ధుడు ఉన్నట్లు గవర్నర్ ఒలెహ్ హ్రిహొరోవ్ తెలిపారు. మరో ముగ్గురు గాయపడ్డారు. 

అలాగే డ్నిప్రోపెట్రోవ్స్ ప్రాంతంలో జరిగిన మరో రష్యా దాడిలో ఒకరు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ.. “యుద్ధాన్ని ఆపకుండా కొనసాగించేందుకు రష్యా దగ్గర మిగిలింది ఉగ్రవాదమే. కావాలనే పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటోంది.” అని ఆరోపించారు. అయితే రష్యా -రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం ఉక్రెయిన్ సైనిక పరిశ్రమలు, ఇంధన మౌలిక సదుపాయాలనే లక్ష్యంగా చేసుకున్నామని.. -ఇది ఉక్రెయిన్ దాడులకు ప్రతీకార చర్య అని పేర్కొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement