
ప్రిన్స్ విలియం వ్యాఖ్య
లండన్: తన జీవితంలో 2024 సంవత్సరం అత్యంత కఠినమైనదని ప్రిన్స్ విలియం వ్యాఖ్యానించారు.గత ఏడాది విలియం భార్య కేట్, ఆయన తండ్రి కింగ్ చార్లెస్–3 ఇద్దరూ క్యాన్సర్ చికిత్స చేయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే లెవీ నిర్వహిస్తున్న ’ది రెలుక్టెంట్ ట్రావెలర్’ షోలో విలియం ఈ విషయాలు పంచుకున్నారు.
’షిట్స్ క్రీక్’ నటుడు యూజీన్ లెవీ నిర్వహిస్తున్న ఆపిల్ టీవీ+ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రివ్యూలో విలియం మాట్లాడుతూ.. ‘2024 నా జీవితంలోనే అత్యంత కఠినమైన సంవత్సరం అని నేను చెబుతాను. జీవితం మమ్మల్ని పరీక్షించాలని నిర్ణయించుకుంది.. ఆ పరీక్షను అధిగమించగలిగినప్పుడే మనమేమిటో తెలుస్తుంది.’ అని వ్యాఖ్యానించారు. అక్టోబర్ 3న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ ప్రివ్యూలో విలియం.. లెవీని విండ్సర్ కోట చుట్టూ తిప్పుతూ చూపించడం, వారిద్దరూ ఒక పబ్‌లో బీరు పంచుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్న దృశ్యాలున్నాయి.
కేట్ జనవరిలో తనకు క్యాన్సర్ నయమైందని ప్రకటించారు. ఇటీవల ఆమె అనేక బహిరంగ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ నెల ప్రారంభంలో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూకే పర్యటనలో.. ఆయనకు రాజ మర్యాదలతో ఆహ్వానం పలకడంలో ఆమె, విలియం కీలక పాత్ర పోషించారు. కింగ్ చార్లెస్ కూడా గత సంవత్సరం చికిత్స కోసం నెలల పాటు విరామం తీసుకున్న తర్వాత దైనందిన జీవితంలో పాల్గొంటున్నారు. కానీ కింగ్ చార్లెస్–3, కేట్‌లు ఇద్దరూ తాము ఏ రకమైన క్యాన్సర్‌కు చికిత్స చేయించుకున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.