భారత్‌ టార్గెట్‌గా పాక్‌ చర్యలు.. ఆ దేశంతో సంచలన ఒప్పందం | Pakistan Defence Minister Khawaja Asif Sensational Comments On India, Pakistan-Saudi Military Pact Details Inside | Sakshi
Sakshi News home page

భారత్‌ టార్గెట్‌గా పాక్‌ చర్యలు.. ఆ దేశంతో సంచలన ఒప్పందం

Sep 20 2025 11:53 AM | Updated on Sep 20 2025 12:01 PM

Pakistan Khawaja Asif Sensational Comments On India

ఇస్లామాబాద్‌: భారత్‌ విషయంలో దాయాది దేశం పాకిస్తాన్‌ మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్‌-సౌదీ అరేబియా మధ్య ఇటీవల కుదిరిన వ్యూహాత్మక రక్షణ ఒప్పందం నేపథ్యంలో పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ భారత్‌తో యుద్ధ పరిస్థితులు తలెత్తితే.. సౌదీ తప్పకుండా పాక్‌కు అండగా పోరాడుతుంది అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది.

పాకిస్తాన్‌-సౌదీ అరేబియా మధ్య ఇటీవలే ఓ రక్షణ ఒప్పందం  కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాల్లో ఏ దేశంపై దాడి జరిగినా రెండింటిపై దాడిగా భావించి ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో పాక్‌-సౌదీ మధ్య కుదిరిన ఒప్పందంపై పాకిస్తాన్‌ రక్షణ మంత్రి స్పందిస్తూ..‘ఒకవేళ పాకిస్తాన్‌, భారత్‌ మధ్య యుద్ధం తలెత్తే పరిస్థితులు ఎదురైతే.. మాకు సౌదీ అండగా పోరాడుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఒప్పందంలో భాగంగా వ్యూహాత్మక పరస్పర సహాయం ఉంటుంది. ఈ ఒప్పందం కింద అణ్వాయుధాలు వాడకూడదన్న నిబంధన ఏమీ లేదు. మాకు ఉన్న అన్ని సామర్థ్యాలను వినియోగిస్తాం. పాకిస్తాన్‌ అణ్వాయుధ తనిఖీలకు ఎప్పుడూ సహకరిస్తుందని.. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడదని పేర్కొన్నారు. అయితే, ఇది కేవలం రక్షణాత్మక ఒప్పందం మాత్రమే అని పేర్కొన్నారు.

చాలా ఏళ్లుగా తాము సౌదీ సైనికులకు శిక్షణ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. దానికి పొడిగింపుగా ఈ ఒప్పందాన్ని అభివర్ణించారు. ఇరు దేశాల్లో దేనిపై దాడి జరిగినా.. సమష్టిగా ఎదుర్కొంటాయని పేర్కొన్నారు. అలాగే, అఫ్గానిస్థాన్‌ను తమ ప్రత్యర్థి దేశంగా అభివర్ణించారు. ఇదే సమయంలో అరబ్‌ దేశాలు కూడా ఈ డీల్‌ భాగం అవుతాయా అని ప్రశ్నించగా.. ముందస్తుగా దీనికి నేనేమీ సమాధానం చెప్పలేను అని క్లారిటీ ఇచ్చారు. ఈ ఒప్పందంలో మూడో దేశం చేరకుండా.. లేదా మరో దేశంతో ఇలాంటి అగ్రిమెంట్‌ చేసుకోకూడదని ఎటువంటి క్లాజు లేదని చెప్పారు. పాకిస్తాన్‌‌కు బలహీనతలు ఉండటంతో.. నాటో వంటి ఏర్పాట్లు ఉండాలని తాను చాలా కాలంగా చెబుతున్నానన్నారు. ముఖ్యంగా ముస్లిం ప్రజలు, దేశాలు ఉన్నచోట సమష్టిగా దేశాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఇక, కొన్ని నెలల క్రితం భారత్‌-పాక్ (India-Pakistan) మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి బదులుగా మన బలగాలు పాక్‌లోని ఉగ్రమూకలను మట్టుపెట్టాయి. దాని తర్వాత రెండు దేశాల మధ్య కొన్నిరోజుల పాటు ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఒప్పందం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా మరోసారి భారత్‌తో యుద్ధం విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement