సియోల్: అణు పాటవం విషయంలో ఉత్తర కొరియా కీలక ముందడుగు వేసింది. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చిరకాల స్వప్నమైన అణు జలాంతర్గామి నిర్మాణాన్ని దాదాపుగా పూర్తి చేసేసింది. కొద్ది నెలల్లో అది జలప్రవేశం చేయనుందని దక్షిణ కొరియా రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. కిమ్ ఇటీవలే తన కూతురితో పాటు షిప్ యార్డ్ ను సందర్శించి పనుల ప్రగతిని సమీక్షించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఉత్తర కొరియా అధికారిక మీడియా గురువారం విడుదల చేసింది.
అందులో ఆయన నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న జలాంతర్గామిని చూస్తూ కనిపిస్తున్నారు. ఇందుకు అవసరమైన రియాక్టర్ ను రష్యా నుంచి సంపాదించి ఉంటుందని భావిస్తున్నారు. లేదంటే రష్యా సాంకేతిక సహకారంతో ఉత్తర కొరియానే దాన్ని స్వయంగా రూపొందించుకుని ఉండొచ్చన్నది దక్షిణ కొరియా రక్షణ వర్గాల అభిప్రాయం. జలాంతర్గామి 8,700 టన్నుల బరువుంటుందని కొరియా మీడియా పేర్కొంది. పరిమాణంలో ఇది అమెరికా వద్ద ఉన్న అతి పెద్ద జలాంతర్గాములకు సమానం.


