విశాఖ తీరంలో పరీక్షించిన భారత్
క్షిపణికి 3,500 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం
సాక్షి, విశాఖపట్నం: అణ్వాయుధ పరీక్షల్లో భారత రక్షణ దళం మరోసారి సత్తా చాటింది. విశాఖ తీరం వేదికగా అత్యంత కీలకమైన ప్రయోగాన్ని నౌకాదళం విజయవంతంగా నిర్వహించింది. అణ్వాయుధ సామర్థ్యం గల కే–4 క్షిపణిని అరిఘాత్ జలాంతర్గామి నుంచి బుధవారం ప్రయోగించారు. దీంతో శత్రుదేశాల దాడిని వ్యూహాత్మకంగా నిరోధించే సామర్థ్యం భారత్‌కు మరింత పెరిగిందని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. అరిఘాత్ నుంచి కే–4 బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగం చేయడం ఇది రెండోసారి. గతేడాది నవంబర్‌లోనూ ఈ ప్రయోగం నిర్వహించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఈ ప్రయోగం ప్రత్యర్థులకు ఓ హెచ్చరిక అని రక్షణ వర్గాలు చెబుతున్నాయి.
ఆసియాలో రెండో దేశంగా భారత్
ఈ ప్రయోగంతో ఆసియా దేశాల్లో చైనాతో పోటీగా భారత్ నిలిచింది. ఇప్పటి వరకూ సబ్‌మెరైన్ల నుంచి మిసైల్ దాడి చెయ్యగల సామర్థ్యం ఆసియా దేశాల్లో చైనాకు మాత్రమే ఉండేది. కే–4 బాలిస్టిక్ క్షిపణి వరుస ప్రయోగాల తర్వాత సబ్‌మెరైన్ నుంచి అణుదాడి చేయగల సామర్థ్యం కలిగి ఉన్న ఆసియాలో రెండో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. భవిష్యత్‌లో మరో అణు జలాంతర్గామి భారత్ అమ్ముల పొదిలోకి చేరనున్న క్రమంలో 5 వేల కి.మీ. రేంజ్ ఉన్న కే–5 మిసైల్స్‌ని కూడా ప్రయోగించే సామర్థ్యం మున్ముందు భారత్ సొంతం కానుందని, కే–5 సామర్థ్యం కూడా కలిస్తే, అణుదాడిలో ఇండియా తిరుగులేని శక్తిగా అవతరిస్తుందని రక్షణ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
కే– 4 బాలిస్టిక్ మిసైల్ సత్తా ఇదీ
కే–4 బాలిస్టిక్ మిసైల్ అంటే కలామ్–4 అని అర్థం. పూర్తి అణు సామర్థ్యం కలిగిన ఇంటరీ్మడియట్ రేంజ్ సబ్‌మెరైన్ లాంచ్ బాలిస్టిక్ క్షిపణిగా దీన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీవో) తయారు చేసింది. ఐఎన్‌ఎస్ అరిఘాత్‌లో ఈ క్షిపణి అమర్చి ఉంటుంది. 3,500 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాల్ని సులువుగా ఛేదించగల సత్తా కే–4 సొంతం. 17 టన్నుల బరువు, 10 మీటర్ల పొడవు, 4.3 మీటర్ల వెడల్పు ఉన్న ఈ మిసైల్ 2,500 కిలోల వరకు న్యూక్లియర్ వార్‌హెడ్‌ని మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంటుంది.


