ఖండాంతర క్షిపణి అభివృద్ధి కోసం పాక్‌ యత్నాలు | Pakistan developing nuclear-armed intercontinental missiles | Sakshi
Sakshi News home page

ఖండాంతర క్షిపణి అభివృద్ధి కోసం పాక్‌ యత్నాలు

Jun 26 2025 5:47 AM | Updated on Jun 26 2025 5:47 AM

Pakistan developing nuclear-armed intercontinental missiles

అమెరికా నిఘా వర్గాలు

పాక్‌ను అమెరికా ‘అణ్వస్త్ర శత్రువు’గా  ప్రకటించే చాన్స్‌

వాషింగ్టన్‌: పాకిస్తాన్‌ తన క్షిపణి సామర్థ్యాన్ని భారీగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తోందని అమెరికా ‘విదేశీ వ్యవహారాల’ నిఘా నివేదిక వెల్లడించింది. అణ్వస్త్ర సామర్థ్యంతో కూడిన ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి (ఐసీబీఎం) తయారీ యత్నాలను ముమ్మరం చేస్తోందని పేర్కొంది. ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి 5,500 కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాలను చేధించగలదు. చైనా సహకారంతో పాక్‌ ఇందుకు పూనుకున్నట్టు సమాచారం. 

ఐసీబీఎంలు తయారుచేస్తే పాక్‌ను అమెరికా తన అణ్వస్త్ర శత్రువుగా ప్రకటించడం ఖాయమని ఆ దేశ ఉన్నతాధికారులు స్పష్టంచేసినట్లు నివేదిక పేర్కొంది. అమెరికా భూభాగాన్ని తాకగలిగే స్థాయిలో సుదూరం నుంచి క్షిపణులను ప్రయోగించే సత్తా ఉన్న రష్యా, చైనా, ఉత్తర కొరియాను అమెరికా ‘అణ్వస్త్ర విరోధులు’గా ప్రకటించింది. ‘‘ఖండాంతర క్షిపణితో అమెరికాను లక్ష్యంగా చేసుకునే ఏ దేశాన్నీ అమెరికా తన మిత్రుడిగా భావించదు’’ అని ఆ దేశ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

ఐసీబీఎంలు లేని పాక్‌
పాక్‌ వద్ద ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి సాంకేతికత లేదు. ఐసీబీఎం క్షిపణులు లేవు. 2022లో భూతలం నుంచి భూతలం మీదకు ప్రయోగించే మధ్యశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి షాహీన్‌–3ను ప్రయోగించింది. ఇది 2,700 కి.మీ.కు పైగా ప్రయాణించగలదు. భారత్‌లోని ఎన్నో నగరాలు దాని పరిధిలోకి వచ్చాయి. దీర్ఘశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు పాక్‌పై అమెరికా పలు ఆంక్షలు విధించింది. క్షిపణులను రూపొందించే ‘నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కాంప్లెక్స్‌’, మరో మూడు సంస్థలపై నిషేధం విధించింది. వీటితో వ్యాపారంచేసే తమ దేశీయ సంస్థల ఆస్తులను స్తంభింపజేస్తామని గతంలోనే అల్టిమేటమిచ్చింది. ఈ చర్యలను పాక్‌ తప్పుబట్టింది. అమెరికా స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తోందని ఆరోపించింది. ఎన్‌పీటీపై సంతకం చేయని పాక్‌ వద్ద 170 అణువార్‌హెడ్‌లు పోగుబడినట్లు పాత నివేదికలు వెల్లడిస్తున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement