ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అన్నిచోట్లా అప్పుల కోసం పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో సొంత పౌరులే సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నా.. ఏనాడూ ఆ దేశ ప్రభుత్వం స్పందించింది లేదు. తాజాగా.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆ విషయాన్ని అంగీకరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం ఇస్లామాబాద్‌లో జరిగిన బిజినెస్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో కలిసి నేను రహస్యంగా చాలా దేశాల వద్దకు వెళ్లి అప్పులు అడిగాం. ఆ సమయంలో మాకు చాలా సిగ్గుగా అనిపించి తలలు దించుకునేవాళ్లం. రుణాలు తీసుకోవడం ఆత్మగౌరవానికి పెద్ద దెబ్బ. డబ్బులు ఇచ్చేవారు ఏం డిమాండు చేసినా సరే.. అడ్డు చెప్పలేని పరిస్థితి ఉంటుంది’ అంటూ షరీఫ్ ప్రసంగించారు. అయితే..
రుణాలు ఇచ్చే విషయంలో చాలా దేశాలు పాక్‌ను నిరాశ పరచలేదని షరీఫ్ చెప్పుకొచ్చారు. పరిస్థితులతో సంబంధం లేకుండా పాక్‌కు మద్దతుగా నిలిచిన సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, చైనా.. ఇలా మిత్ర దేశాలన్నింటికీ కృతజ్ఞతలు చెప్పారాయన. అదే సమయంలో.. దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోవడంపై షరీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు.
మిత్ర దేశాల నుంచి అప్పులు కోరడంపై పాక్ ప్రధాని నిరాశ వ్యక్తంచేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలో సౌదీ ఆరేబియా ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చినప్పటికీ.. మరిన్ని రుణాలు అడగడం తనను ఇబ్బంది పెట్టిందన్నారు. ఇదిలా ఉంటే.. పాక్‌కు ఆర్థికసాయం అందించిన దేశాల్లో మొదటి స్థానంలో చైనా ఉంది.
ఇదీ చదవండి: వాళ్లంతా బిచ్చగాళ్లే.. పాక్ పరువు పోయిందిగా!


