చిన్న సందేహం వచ్చినా చాలా మంది కృత్రిమ మేధస్సు (ఏఐ)ను ఆశ్రయిస్తున్నారు. అలా ప్రతిదానికీ కృత్రిమ మేధస్సుపై ఆధారపడితే మెదడుపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆలోచించడం, గుర్తు పెట్టుకోవడం వంటి పనులను మనమే చేయకపోతే మెదడు చురుకుదనం తగ్గవచ్చని చెబుతున్నారు. ఇది వయస్సు పెరిగిన తర్వాత వచ్చే డిమెన్షియా వంటి సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కూడా బలహీనపరచవచ్చని అభిప్రాయపడుతున్నారు.
అమెరికాలోని పొసిబిలిటీ ఇన్‌స్టిట్యూట్ ప్రధాన శాస్త్రవేత్త, సిద్ధాంత న్యూరోసైంటిస్టు వివియెన్ మింగ్ ఈ విషయంపై హెచ్చరిక చేశారు. అయితే కృత్రిమ మేధస్సు వల్ల నేరుగా వ్యాధి రాదని, దాన్ని ఎలా వినియోగిస్తున్నామన్నదే అసలు అంశమని ఆమె స్పష్టం చేశారు.
వివియెన్ మింగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రతిరోజు చిన్న విషయాల గురించి కూడా కృత్రిమ మేధస్సుపై తరచుగా ఆధారపడటం వల్ల డిమెన్షియాను ఎదుర్కొనే మెదడు సహజ రక్షణ బలహీనపడే అవకాశం ఉందని హెచ్చరించారు. దీనికి కారణం నిపుణులు "కాగ్నిటివ్ రిజర్వ్" అని పిలిచే సామర్థ్యం తగ్గిపోవడమేనని చెప్పారు. కాగ్నిటివ్ రిజర్వ్ అంటే వయస్సు పెరగడం లేదా వ్యాధుల ప్రభావం వచ్చినా మెదడు పనితీరును కొనసాగించే సామర్థ్యం.
కృత్రిమ మేధస్సు నేరుగా నాడీ సంబంధిత వ్యాధులను కలిగించదని వివియెన్ మింగ్ చెప్పారు. అయితే, ప్రజలు దాన్ని ఎలా వినియోగిస్తున్నారన్నదే ఆందోళన కలిగించే అంశమని వివరించారు. అసలు సమస్య "క్రానిక్ సబ్‌స్టిట్యూషన్"లో ఉందని తెలిపారు. అంటే, కృత్రిమ మేధస్సు పని చేస్తోందనే కారణంతో యూజర్లు తమ ఆలోచనా శ్రమను మానేయడమేనని వివరించారు.
క్రానిక్ సబ్‌స్టిట్యూషన్ అంటే మనం స్వయంగా ఆలోచించకుండా ఆ పనిని దీర్ఘకాలం పాటు కృత్రిమ మేధస్సుకు పూర్తిగా అప్పగించే అలవాటు. కాలక్రమంలో ఈ అలవాటు వల్ల కాగ్నిటివ్ రిజర్వ్‌ను పెంచుకునే, నిలబెట్టుకునే మెదడు సామర్థ్యం తగ్గే అవకాశం ఉందని చెప్పారు. వయస్సు పెరగడం వల్ల వచ్చే నష్టాన్ని, డిమెన్షియాను ఎదుర్కోవడంలో ఈ సామర్థ్యం కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.
కాగ్నిటివ్ రిజర్వ్ అంటే శారీరక మార్పులు లేదా వ్యాధి వచ్చినా మెదడు పరిస్థితులకు అనుగుణంగా తన పనితీరును కొనసాగించే సామర్థ్యం. నిరంతర మానసిక శ్రమ, కొత్త విషయాల అభ్యాసం, చురుకైన మేధో కార్యకలాపాల వల్ల ఇది బలపడుతుంది.
కృత్రిమ మేధస్సుపై అధికంగా ఆధారపడటం వల్ల ఈ ప్రక్రియ దెబ్బతినే ప్రమాదం ఉందని వివియెన్ మింగ్ అభిప్రాయపడ్డారు. మానసిక చురుకుదనం తగ్గిపోతే, దీర్ఘకాలంలో మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మరింత కష్టమవుతుందని హెచ్చరించారు.
మెక్‌గిల్ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం.. దారి తెలుసుకోవడానికి తరచుగా జీపీఎస్‌పై ఆధారపడిన వారిలో, స్వయంగా దారి గుర్తించే స్థల అవగాహన జ్ఞాపకశక్తి బలహీనంగా కనిపించింది.
అలాగే, ఎంఐటీ మీడియా ల్యాబ్ నిర్వహించిన చిన్న అధ్యయనంలో.. పెద్ద భాషా నమూనాలను ఉపయోగించి రచనలు చేసిన వారిలో, సంప్రదాయ పద్ధతులు ఉపయోగించిన వారితో పోలిస్తే మెదడు నాడీ అనుసంధానం బలహీనంగా కనిపించిందని వెల్లడైంది. అంతేకాదు, తాము ఇప్పుడే రాసిన విషయాన్నే గుర్తు పెట్టుకోవడంలో కూడా వారు ఇబ్బంది పడ్డారని అధ్యయనం తెలిపింది.


