మృత్యువుతో 108 గంటల పోరాటం | Myanmar: Man pulled alive from Myanmar hotel wreckage after 5 days | Sakshi
Sakshi News home page

మృత్యువుతో 108 గంటల పోరాటం

Apr 3 2025 5:41 AM | Updated on Apr 3 2025 5:41 AM

Myanmar: Man pulled alive from Myanmar hotel wreckage after 5 days

మయన్మార్‌లో శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడిన నాయింగ్‌ లిన్‌ టున్‌  

9 గంటలపాటు భారీ ఆపరేషన్‌ చేపట్టిన సహాయక సిబ్బంది  

బ్యాంకాక్‌: భారీ భూకంపం మయన్మార్‌ను అతలాకుతలం చేసింది. వేలాది మంది మరణించారు. మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. వందలాదిగా భారీ భవనాలు, వంతెనలు, రహదారులు ధ్వంసమయ్యాయి. ఎటుచూసినా విధ్వంసమే కనిపిస్తోంది. శిథిలాల నుంచి తవ్వినకొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. అదృష్టవశాత్తూ కొందరు ప్రాణాలతో మిగిలి ఉంటున్నారు. 

హోటల్‌లో కార్మికుడిగా పని చేస్తున్న 26 ఏళ్ల నాయింగ్‌ లిన్‌ టున్‌ అదృష్టం కూడా బాగున్నట్లుంది. 108 గంటలపాటు మృత్యువుతో పోరాడి ఎట్టకేలకు ప్రాణాలతో బయటకు వచ్చాడు. బుధవారం తెల్లవారుజామున రెస్క్యూ సిబ్బంది అతడిని కాపాడారు. ఇందుకోసం చాలా శ్రమించాల్సి వచ్చింది. నాయింగ్‌ లిన్‌ టున్‌ మయన్మార్‌ రాజధాని నేపడాలోని క్యాపిటల్‌ సిటీ హోటల్‌లో పని చేస్తున్నాడు. గత శుక్రవారం సంభవించిన భూకంపం ధాటికి ఈ హోటల్‌ కుప్పకూలింది. శిథిలాలు గుట్టలుగా పేరుకుపోయాయి. 

ఇక్కడ గత ఐదు రోజులుగా జరుగుతున్న సహాయక చర్యల్లో కేవలం మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. శిథిలాల కింద ఎవరైనా బతికి ఉండొచ్చన్న అంచనాతో ఎండోస్కోపిక్‌ కెమెరాతో గాలించారు. శిథిలాల కింద చిక్కుకున్న నాయింగ్‌ లిన్‌ టున్‌ ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించారు. యంత్రాల సాయంతో కాంక్రీట్‌ దిమ్మెలకు భారీ రంధ్రం చేసి అతడిని జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఆపరేషన్‌ పూర్తికావడానికి 9 గంటలకు పైగా సమయం పట్టింది. ఆహారం, నీరు లేక పూర్తిగా నీరసించిపోయినప్పటికీ స్పృహలోనే ఉన్న నాయింగ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు ప్రకటించారు.  

3,000 దాటిన మృతుల సంఖ్య  
ఇదిలా ఉండగా, మయన్మార్‌ భూకంపంలో మృతుల సంఖ్య 3,000కు చేరుకున్నట్లు స్థానిక మీడియా ప్రకటించింది. మరో 4,639 మంది గాయపడ్డారని తెలియజేసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు బ్యాంకాక్‌లో భూకంపం మృతుల సంఖ్య 22కు చేరుకుంది. 34 మంది క్షతగాత్రులయ్యారు. బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న భారీ భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇక్కడ బుధవారం మరో మృతదేహాన్ని వెలికితీశారు. భూకంపం వల్ల తీవ్రంగా నష్టపోయిన మయన్మార్‌కు మానవతా సాయం అందించేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. 

ఆ్రస్టేలియా ప్రభుత్వం ఇప్పటికే 1.25 మిలియన్‌ డాలర్ల సాయం ప్రకటించగా, అదనంగా మరో 4.5 మిలియన్‌ డాలర్లు అందజేస్తామని బుధవారం ప్రకటించారు. సహాయక చర్యల కోసం భారత ప్రభుత్వం 200 మందిని పంపించింది. చైనా 270 మందిని, రష్యా 212 మందిని, యూఏఈ 122 మందిని పంపించాయి. మయన్మార్‌లో ఎంత నష్టం వాటిల్లిందనేది ఇంకా నిర్ధారించలేదు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, సెల్‌ఫోన్‌ సేవలను ఇంకా పునరుద్ధరించలేదు. రోడ్లు చాలావరకు దెబ్బతినడంతో సహాయక బృందాలు అక్కడికి చేరుకోలేకపోతున్నాయి. మాండలే నగరానికి 65 కిలోమీటర్ల దూరంలోని సింగు టౌన్‌షిప్‌లో ఓ బంగారు గని భూకంపం వల్ల కుప్పకూలడంతో అందులో ఉన్న 27 మంది కార్మికులు మృత్యువాత పడినట్లు తాజాగా వెల్లడయ్యింది.   
 

Advertisement
 
Advertisement
Advertisement