breaking news
Hotel workers
-
మృత్యువుతో 108 గంటల పోరాటం
బ్యాంకాక్: భారీ భూకంపం మయన్మార్‌ను అతలాకుతలం చేసింది. వేలాది మంది మరణించారు. మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. వందలాదిగా భారీ భవనాలు, వంతెనలు, రహదారులు ధ్వంసమయ్యాయి. ఎటుచూసినా విధ్వంసమే కనిపిస్తోంది. శిథిలాల నుంచి తవ్వినకొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. అదృష్టవశాత్తూ కొందరు ప్రాణాలతో మిగిలి ఉంటున్నారు. హోటల్లో కార్మికుడిగా పని చేస్తున్న 26 ఏళ్ల నాయింగ్ లిన్ టున్ అదృష్టం కూడా బాగున్నట్లుంది. 108 గంటలపాటు మృత్యువుతో పోరాడి ఎట్టకేలకు ప్రాణాలతో బయటకు వచ్చాడు. బుధవారం తెల్లవారుజామున రెస్క్యూ సిబ్బంది అతడిని కాపాడారు. ఇందుకోసం చాలా శ్రమించాల్సి వచ్చింది. నాయింగ్ లిన్ టున్ మయన్మార్ రాజధాని నేపడాలోని క్యాపిటల్ సిటీ హోటల్లో పని చేస్తున్నాడు. గత శుక్రవారం సంభవించిన భూకంపం ధాటికి ఈ హోటల్ కుప్పకూలింది. శిథిలాలు గుట్టలుగా పేరుకుపోయాయి. ఇక్కడ గత ఐదు రోజులుగా జరుగుతున్న సహాయక చర్యల్లో కేవలం మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. శిథిలాల కింద ఎవరైనా బతికి ఉండొచ్చన్న అంచనాతో ఎండోస్కోపిక్ కెమెరాతో గాలించారు. శిథిలాల కింద చిక్కుకున్న నాయింగ్ లిన్ టున్ ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించారు. యంత్రాల సాయంతో కాంక్రీట్ దిమ్మెలకు భారీ రంధ్రం చేసి అతడిని జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఆపరేషన్ పూర్తికావడానికి 9 గంటలకు పైగా సమయం పట్టింది. ఆహారం, నీరు లేక పూర్తిగా నీరసించిపోయినప్పటికీ స్పృహలోనే ఉన్న నాయింగ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు ప్రకటించారు. 3,000 దాటిన మృతుల సంఖ్య ఇదిలా ఉండగా, మయన్మార్ భూకంపంలో మృతుల సంఖ్య 3,000కు చేరుకున్నట్లు స్థానిక మీడియా ప్రకటించింది. మరో 4,639 మంది గాయపడ్డారని తెలియజేసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు బ్యాంకాక్‌లో భూకంపం మృతుల సంఖ్య 22కు చేరుకుంది. 34 మంది క్షతగాత్రులయ్యారు. బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న భారీ భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇక్కడ బుధవారం మరో మృతదేహాన్ని వెలికితీశారు. భూకంపం వల్ల తీవ్రంగా నష్టపోయిన మయన్మార్‌కు మానవతా సాయం అందించేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. ఆ్రస్టేలియా ప్రభుత్వం ఇప్పటికే 1.25 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించగా, అదనంగా మరో 4.5 మిలియన్ డాలర్లు అందజేస్తామని బుధవారం ప్రకటించారు. సహాయక చర్యల కోసం భారత ప్రభుత్వం 200 మందిని పంపించింది. చైనా 270 మందిని, రష్యా 212 మందిని, యూఏఈ 122 మందిని పంపించాయి. మయన్మార్‌లో ఎంత నష్టం వాటిల్లిందనేది ఇంకా నిర్ధారించలేదు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, సెల్‌ఫోన్ సేవలను ఇంకా పునరుద్ధరించలేదు. రోడ్లు చాలావరకు దెబ్బతినడంతో సహాయక బృందాలు అక్కడికి చేరుకోలేకపోతున్నాయి. మాండలే నగరానికి 65 కిలోమీటర్ల దూరంలోని సింగు టౌన్షిప్లో ఓ బంగారు గని భూకంపం వల్ల కుప్పకూలడంతో అందులో ఉన్న 27 మంది కార్మికులు మృత్యువాత పడినట్లు తాజాగా వెల్లడయ్యింది. -
రూ.130... ఒక ప్రాణం!
- ఒకరినొకరు తోసుకున్న హోటల్ కార్మికులు - కింద పడిపోయిన కార్మికుడు రాజు - సిమెంట్ దిమ్మకు తల తగిలి మృతి హైదరాబాద్: రూ.130 కోసం ఇద్దరు హోటల్ కార్మికుల మధ్య తలెత్తిన ఘర్షణ ఒకరి మరణానికి కారణమైంది. రాజధాని కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్పైస్ బావర్చీ హోటల్ వద్ద సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది హత్య కాదని, ఐపీసీ సెక్షన్ 304(2) కింద కేసు నమోదు చేశామని కంచన్‌బాగ్ ఇన్స్పెక్టర్ శంకర్ తెలిపారు. మహరాష్ట్రకు చెందిన రాజు (28), ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన కమలేశ్ (30) బతుకుతెరువు కోసం నగరానికి వచ్చారు. అడ్డా కూలీలైన వీరు పబ్లిక్ గార్డెన్లో నివసిస్తున్నారు. ఇటీవల ఇరువురినీ హఫీజ్‌బాబానగర్‌లోని స్పైస్ బావర్చి రెస్టారెంట్ నిర్వాహకుడు పనికి కుదుర్చుకున్నాడు. మూడు రోజుల క్రితం రూ.130 అప్పుగా ఇచ్చానని, ఈ మొత్తం తిరిగి ఇవ్వాలని సోమవారం రాజును కమలేశ్ అడిగాడు. అయితే తాను డబ్బే తీసుకోలేదని, అలాంటప్పుడు ఎలా తిరిగిస్తానంటూ రాజు వాదించాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. తన డబ్బులిచ్చే వరకు పనికి కూడా వెళ్లనీయనంటూ రాజును కమలేశ్ అడ్డుకున్నాడు. ఈ ఘర్షణలో కమలేశ్ బలంగా తోయగా... రాజు అక్కడే ఉన్న సిమెంట్‌తో నిర్మించిన డ్రైనేజీ రెయిలింగ్‌పై పడ్డాడు. కణత భాగానికి బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న కంచన్‌బాగ్ పోలీసులు... నిందితుడిని అదుపులోకి తీసుకుని, ఐపీసీ సెక్షన్ 304(2) కింద కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. -
హోటల్ వర్కర్ల ఘర్షణ: ఒకరి మృతి
దామరచర్ల: నల్గొండ జిల్లా దామరచర్ల మండలకేంద్రంలోని ఓ హోటల్లో వర్కర్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో హరినాయక్(38) అనే వ్యక్తి మృతి చెందాడు. వర్కర్ల మధ్య ఘర్షణకు కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటనాస్థలాన్ని మిర్యాలగూడ రూరల్ సీఐ రవీందర్ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.