ఎగుమతులపై ఎఫెక్ట్‌ | More burden on exports to America | Sakshi
Sakshi News home page

ఎగుమతులపై ఎఫెక్ట్‌

Aug 7 2025 5:58 AM | Updated on Aug 7 2025 5:58 AM

More burden on exports to America

అమెరికాకు ఎగుమతులపై మరింత భారం

ఎక్స్‌పోర్ట్స్‌ 50 శాతం వరకు క్షీణించవచ్చని అంచనా

రత్నాభరణాలు, వస్త్రాలు తదితర పరిశ్రమలపై తీవ్ర ప్రభావం

ఆందోళనలో ఎగుమతి రంగాల సంస్థలు

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై గుర్రుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ మన ఎగుమతులను టార్గెట్‌ చేసుకున్నారు. ఇటీవలే వేసిన పాతిక శాతం సుంకాలను రెట్టింపు చేసి 50 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో అగ్రరాజ్యం 50 శాతం టారిఫ్‌లతో మనల్ని బ్రెజిల్‌ సరసన చేర్చినట్లయింది. మొదటి విడత టారిఫ్‌లు ఆగస్టు 7 నుంచి, కొత్తగా వేసిన మరో పాతిక శాతం సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తాయి. ఇప్పటికే మొదటి విడత పాతిక శాతం సుంకాల దెబ్బతోనే సతమతమవుతున్న మన ఎగుమతి పరిశ్రమలకు ఇవి మరింత భారంగా మారనున్నాయి. 

తాజా వడ్డింపుతో బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లాంటి చిన్న పొరుగు దేశాలపై సుంకాలు మనతో పోలిస్తే సగానికన్నా తక్కువగా ఉండటంతో వాటి నుంచి పోటీ మరింత పెరిగితే మన ఉత్పత్తులకు డిమాండ్‌ పడిపోయే ముప్పు పొంచి ఉంది. దీంతో ఎగుమతుల కోసం అగ్రరాజ్యంపై ఎక్కువగా ఆధారపడుతున్న వస్త్రాలు, రత్నాభరణాలు, సీఫుడ్‌ మొదలైన రంగాల సంస్థల్లో ఈ విపత్తును ఎలా ఎదుర్కొనాలనే ఆందోళన నెలకొంది. దీని వల్ల అమెరికాకు ఎగుమతులు 40–50 శాతం పడిపోయే ముప్పు ఉందని మేధావుల సంఘం జీటీఆర్‌ఐ అంచనా వేస్తోంది.

షాకింగ్‌ నిర్ణయం..
ట్రంప్‌ డబుల్‌ టారిఫ్‌లు తీవ్ర షాక్‌కి గురి చేశాయని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్‌ఐఈవో డైరెక్టర్‌ జనరల్‌ అజయ్‌ సహాయ్‌ వ్యాఖ్యానించారు.  దీని వల్ల అమెరికాకు 55 శాతం ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు. ఇప్పటికే పలు సంస్థలు ఆర్డర్లను ఆపి ఉంచాయని తెలిపారు. టారిఫ్‌ల భారం వల్ల పోటీ దేశాలతో పోలిస్తే ధరల విషయంలో 30–35 శాతం మేర మన ఎగుమతిదారులు వెనుకబడతారని సహాయ్‌ వివరించారు. చిన్న, మధ్య తరహా సంస్థలపై పెను భారం పడుతుందని, మార్జిన్లు మరింత తగ్గిపోవడంతో పాటు క్లయింట్లను కోల్పోయే ముప్పు నెలకొందన్నారు. 

ప్రభుత్వానికి పరిశ్రమ వినతి
కీలకమైన అమెరికా మార్కెట్లో టారిఫ్‌ల మోత వల్ల నుంచి ఉపశమనం కల్పించేందుకు తగు తోడ్పాటు అందించాలని కేంద్రానికి ఎగుమతిదారులు విజ్ఞప్తి చేశారు. వడ్డీ రాయితీలు ఇవ్వాలని, ఆర్‌వోడీటీఈపీ స్కీమ్‌ (ఎగుమతి చేసే ఉత్పత్తులపై సుంకాలు, పన్నుల రెమిషన్‌), రాష్ట్ర, కేంద్ర ట్యాక్సులు, లెవీల్లో రిబేటుకు సంబంధించిన ఆర్‌వోఎస్‌సీటీఎల్‌ మొదలైన వాటిని పొడిగించాలని పరిశ్రమ వర్గాలు కోరాయి.

30 బిలియన్‌ డాలర్ల ఎగుమతులకు మినహాయింపు
ప్రస్తుతం అమెరికాకు 86 బిలియన్‌ డాలర్ల మేర ఎగుమతులు ఉండగా, అందులో 48 బిలియన్‌ డాలర్ల విలువ చేసే ఎగుమతులపై సుంకాల ఎఫెక్ట్‌ పడుతుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఫార్మా, స్మార్ట్‌ఫోన్లు, సెమీకండక్టర్లు లాంటి 30 బిలియన్‌ డాలర్ల విలువ చేసే ఎగుమతులు ప్రస్తుతం మినహాయింపుల జాబితాలో ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 

గత ఆర్థిక సంవత్సరం అమెరికాకు భారత్‌ నుంచి 10.5 బిలియన్‌ డాలర్లు, ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులు (చాలా మటుకు స్మార్ట్‌ఫోన్లు) ఎగుమతులు 14.6 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే, విదేశీ ఔషధాలపై 250 శాతం వరకు సుంకాలు విధిస్తానంటూ ట్రంప్‌ బెదిరిస్తున్న నేపథ్యంలో ఫార్మాకు కూడా రిస్కులు ఉండొచ్చని భావిస్తున్నారు.

అవకాశంగా మల్చుకోవాలి: ఆనంద్‌ మహీంద్రా
టారిఫ్‌ల గురించి ఆందోళన చెందకుండా దీన్ని అవకాశంగా మల్చుకోవడం ఎలా అనే అంశంపై దృష్టి సారించే ప్రయత్నాలు చేయాలని పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా అభిప్రాయపడ్డారు. 1991 నాటి ఫారెక్స్‌ సంక్షోభం ఎలాగైతే ఆర్థిక సరళీకరణకు దారి తీసిందో.. అదే విధంగా ఈ టారిఫ్‌ల సాగర మథనం నుంచి భారత్‌కు అమృతం లభించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇందుకోసం వ్యాపారాల నిర్వహణను మరింత వేగంగా సులభతరం చేయాలని, విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూర్చే ఇంజిన్‌గా టూరిజంను మార్చుకోవాలని ఆనంద్‌ మహీంద్రా సూచించారు. ఇందులో భాగంగా వీసా ప్రాసెసింగ్‌ వేగవంతం చేయడం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని అప్‌గ్రేడ్‌ చేయడంలాంటి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 

రత్నాభరణాలు .. 12 బిలియన్‌ డాలర్లు
మన రత్నాభరణాల ఎగుమతులకు అగ్రరాజ్యం పెద్ద మార్కెట్‌గా ఉంటోంది. అక్కడికి ఎగుమతులు సుమారు 12 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉంటున్నాయి. మొత్తం ఎగుమతుల్లో 30 శాతం వాటా అమెరికాదే ఉన్న నేపథ్యంలో టారిఫ్‌లను రెట్టింపు చేయడం వల్ల చిన్న వ్యాపారుల నుంచి బడా కంపెనీల వరకు అందరిపైనా ప్రభావం పడనుంది. పోటీ దేశాల నుంచి చౌకగా ఉత్పత్తులు లభిస్తాయి కాబట్టి కొనుగోలుదారులు మరింతగా బేరసారాలకు దిగొచ్చని, మార్జిన్లు తగ్గిపోవచ్చని, ఆర్డర్లు రద్దు కావచ్చని పరిశ్రమలో ఆందోళన నెలకొంది. 

ఇంజనీరింగ్‌ ఉత్పత్తులు..
అమెరికాకు ఇంజనీరింగ్‌ ఉత్పత్తుల ఎగుమతులు 18.3 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. ఇవి ఖరీదుగా మారితే మెక్సికోలాంటి దేశాలవైపు అమెరికా మళ్లే అవకాశం ఉంది. 

రసాయనాలు.. వ్యవసాయోత్పత్తులు..
అగ్రరాజ్యానికి మన వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు సుమారు 5.6 బిలియన్‌ డాలర్లుగా, ఉక్కు..రసాయనాలు.. పెట్రోలియం ఉత్పత్తులు మొదలైన వాటి ఎగుమతులు 8 బిలియన్‌ డాలర్ల పైగా ఉంటున్నాయి. డబుల్‌ సుంకాల వల్ల భారత ఉత్పత్తుల రేట్లు పెరిగిపోయి, అమెరికా దిగుమతులను తగ్గించుకునే అవకాశం ఉంది. కొన్ని రంగాల్లో బ్రెజిల్, వియత్నాంలాటి దేశాలతో పోటీపడలేక మన దగ్గర పలు కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడొచ్చు. 

టెక్స్‌టైల్స్‌ ..
దేశీయంగా టెక్స్‌టైల్స్, అపారెల్‌ పరిశ్రమ దాదాపు 4.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. 5.6 బిలియన్‌ డాలర్ల విలువ చేసే రెడీమేడ్‌ దుస్తులు అమెరికాకు ఎగుమతవుతు న్నాయి. లెదర్‌ ఉత్పత్తులు, దుస్తు ల్లాంటి రంగాల ఎగుమతుల్లో అమె రికా వాటా 30 శాతం పైగా ఉంటోంది. వియత్నాం, ఇండొనేషియాలాంటి దేశాల్లో తక్కువ సుంకాల వల్ల మనం పోటీపడే పరిస్థితి లేకుండా పోతుందని, ఈ రంగంలో ఉపాధి అవకాశాలూ దెబ్బతింటాయని పరి శ్రమ వర్గాలు భావిస్తున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement