వీడియో: బతుకు జీవుడా.. గాజాకు నడుచుకుంటూ లక్షల మంది.. | Thousands Of Palestinians Left To Gaza At Different Places, Walk Along The Coastal Road Video Goes Viral | Sakshi
Sakshi News home page

వీడియో: బతుకు జీవుడా.. గాజాకు నడుచుకుంటూ లక్షల మంది..

Jan 27 2025 9:33 PM | Updated on Jan 28 2025 9:32 AM

Many Palestinians Left To Gaza At Different Places Video Viral

జెరూసలేం: ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య యుద్ధం కారణంగా గాజా ప్రజలు సర్వస్వం కోల్పోయారు. వేల సంఖ్యలో మరణాలు, కోట్ల సంఖ్యలో ఆస్తి నష్టం జరిగింది. అనేక మంది గాజా ప్రజలు తాము పుట్టిన భూమిని వదిలి శరణార్థి శిబిరాలకు వెళ్లారు.

ఇప్పుడు యుద్ధం ముగిసిన నేపథ్యంలో మళ్లీ బతుకు జీవుడా అంటూ తమ నివాసాలకు చేరుకుంటున్నారు. పొట్టచేతపట్టుకొని ఎలా వెళ్లారో అలాగే, మళ్లీ తిరిగి వెళ్తుంటే అక్కడ తమకంటూ ఏమైనా మిగిలుందో లేదో తెలియని దుస్థితి వారిని వేధిస్తోంది. ఎలాబతకాలో తెలియని ఆందోళన వారి హృదయాలను బరువెక్కిస్తోంది. ఇవన్నీ ఆలోచించుకుంటూ లక్షలాది మంది గాజా ప్రజలు తమ ప్రాంతానికి బయలుదేరారు. మార్గమధ్యంలో ఎన్నో ఆలోచనలు వారిని వెంటాడుతున్నాయి. కొన్ని లక్షల మంది గుంపు గాజా వైపు వెళ్తున్న దృశ్యాలను నెటిజన్లను కన్నీరుపెట్టిస్తున్నాయి.

కాగా, అక్టోబర్ 7, 2023లో ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడి గాజా ప్రజల పాలిట శాపమైంది. హమాస్‌ దాడితో ఇజ్రాయెల్ ప్రతి దాడి మొదలుపెట్టడంతో ఉత్తర గాజా నుంచి సుమారు 10 లక్షల మంది దక్షణాదికి తరలివెళ్లిపోయారు. శరణార్థి శిబిరాల్లో కాలం వెళ్లదీశారు. ఉత్తర ప్రాంతంలో బెంజమిన్ నెతన్యాహు సేనల దాడులతో ఆ ప్రాంతంలో ఉన్న కొద్దిపాటి సౌకర్యాలు శిథిలమయ్యాయి. ఈ ఘర్షణలో హమాస్ అగ్రనాయకత్వం మొత్తం మృత్యువాతపడింది. ఈ నేపథ్యంలో హమాస్‌-ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దీంతో, వీరంతా స్వస్థలం బాటపడ్డారు.

 

ఇదిలా ఉండగా..ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ఓ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. నిరాశ్రయులుగా మారిన పాలస్తీనీయులకు గాజా పొరుగునే ఉన్న ఈజిప్టు, జోర్డాన్‌లు పునరావాసం కల్పించాలన్నారు. ఈ ప్రతిపాదన వారిని తమ సొంత ప్రాంతానికి శాశ్వతంగా దూరంగా చేస్తుందా? అనే ఆందోళనా వ్యక్తమైంది. ఇక పాలస్తీనా వాసులు తిరిగి రావడాన్ని హమాస్ విక్టరీగా అభివర్ణించుకుంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement