
జెనీవా: ఐక్యరాజ్యసమితి (United Nations)లో పాకిస్తాన్ మరోసారి పరువు పోగొట్టుకొంది. మానవ హక్కుల మండలిలో పాక్ వక్ర బుద్ధిని భారత్ దుయ్యబట్టింది. పాక్ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించింది. మైనారిటీలపై దాడులు జరిపే ఆ దేశం మానవహక్కులపై ఉపన్యాసాలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందంటూ భారతీయ దౌత్యవేత్త మొహమ్మద్ హుస్సేన్ చురకలు అంటించారు. పాక్ తప్పుడు ప్రచారాలు చేసే బదులు తన దేశంలోని మైనారిటీలపై చూపుతున్న వివక్షతో పోరాడాలంటూ హితవు పలికారు.
ఇటీవల పాకిస్తాన్‌లో ఆ దేశ సైన్యం చేసిన దాడిలో మహిళలు, పిల్లలతో సహా 23 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడులపై భారత్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ హక్కుల కార్యకర్త ఆరిఫ్ అజాకియా కూడా పాక్ సర్కార్ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. బలోచిస్థాన్, ఖైబర్ ప్రావిన్స్‌లు సుదీర్ఘకాలంగా సైనిక ఆపరేషన్లకు కేంద్రాలుగా మారిపోయాయని మండిపడ్డారు. పాకిస్తాన్ ఇతరుల ముందు మానవ హక్కుల పాఠాలు చెబుతోంది కానీ.. అక్కడి పరిస్థితులు చూస్తే వాటికి పూర్తిగా విరుద్ధం.. తప్పుడు ప్రచారాలతో మోసం చేస్తోందంటూ హుస్సేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, పాకిస్తాన్ ప్రభుత్వం తమ కనీస ప్రాథమిక హక్కుల్ని సైతం కాలరాస్తోందంటూ ఆవామీ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో నిరసనలు మూడో రోజుకు చేరుకున్నాయి. నిరసనకారులను అదుపు చేసేందుకు పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బాఘ్ జిల్లా దిర్‌కోట్‌లో నలుగురు, ముజఫ రాబాద్, మిర్‌పూర్‌లలో ఇద్దరు చొప్పున చనిపో యారు. ముజఫరాబాద్‌లో మంగళవారం జరిగిన నిరసనల్లో ఇద్దరు చనిపోవడం తెల్సిందే. దీంతో, బలగాల కాల్పుల్లో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10కి చేరుకుంది.