ఇజ్రాయెల్‌ దాడిలో తాబేళ్ల సంరక్షకురాలు మృతి | Lebanese turtle conservationist Mona Khalil killed by Israeli strike | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌ దాడిలో తాబేళ్ల సంరక్షకురాలు మృతి

Jun 21 2026 12:58 AM | Updated on Jun 21 2026 11:06 AM

Lebanese turtle conservationist Mona Khalil killed by Israeli strike

దక్షిణ లెబనాన్‌లో అంతరించిపోతున్న సముద్ర తాబేళ్ల సంరక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ పర్యావరణ కార్యకర్త మోనా ఖలీల్‌ (76) మరణించారు. రెండు వారాల క్రితం దక్షిణ లెబనాన్‌లో జరిగిన ఇజ్రాయెల్‌ వైమానిక దాడిలో ఆమె గాయపడగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు.

తాబేళ్ల కోసం జీవితాంతం పోరాటం
1999లో మన్‌సౌరీ బీచ్‌లో ఒక ఆకుపచ్చ సముద్ర తాబేలు గుడ్లు పెట్టడాన్ని చూసిన తర్వాత మోనా ఖలీల్ జీవితం పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు నెదర్లాండ్స్‌లో నివసిస్తున్న ఆమె, లెబనాన్ తీర ప్రాంతాల్లో తాబేళ్ల మనుగడ ప్రమాదంలో ఉందని తెలుసుకుని స్వదేశానికి తిరిగి వచ్చింది.

2000లో ఆమె స్థాపించిన "ఆరెంజ్ హౌస్ ప్రాజెక్ట్" సముద్ర జీవ సంరక్షణ, పర్యావరణ అవగాహన, పర్యాటక అభివృద్ధికి కేంద్రంగా మారింది. ముఖ్యంగా మన్‌సౌరీ తీరాన్ని తూర్పు మధ్యధరా ప్రాంతంలో సముద్ర తాబేళ్లకు అత్యంత కీలక గూళ్ల ప్రాంతంగా తీర్చిదిద్దడంలో ఆమె కీలక పాత్ర పోషించింది.

యుద్ధాల జరుగుతున్నా సేవ కొనసాగింపు
2006 లెబనాన్‌ యుద్ద సమయంలో ఆమె ఇల్లు దెబ్బతిన్నప్పటికీ, తాను ప్రేమించిన తీరప్రాంతాన్ని విడిచి వెళ్లడానికి నిరాకరించింది. ఇటీవల కూడా పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ, "నేను పౌరురాలిని కాబట్టి సురక్షితంగానే ఉంటాను" అనే నమ్మకంతో అక్కడే కొనసాగారని ఆమె స్నేహితులు తెలిపారు.

నిలిచిపోయే వారసత్వం
సముద్ర తాబేళ్ల గూళ్లను గుర్తించడం, వాటి సంరక్షణ, కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం, తీరప్రాంతాల పరిరక్షణ కోసం పోరాడడం వంటి పనుల్లో మోనా ఖలీల్ దశాబ్దాల పాటు కృషి చేశారు. ఆమె నిర్మించిన సంరక్షణ ఉద్యమం, ఆమె కాపాడిన తాబేళ్ల తరాలు ఆమెను చిరస్థాయిగా గుర్తుంచుకుంటాయని పర్యావరణ సంస్థలు పేర్కొన్నాయి.

"ఆమె తాబేళ్లను మాత్రమే రక్షించలేదు... వాటిని ప్రేమించేలా వేల మందిని ప్రేరేపించింది" అని ఆమె సహచరులు నివాళులర్పించారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement