బంపర్‌ ఆఫర్‌: పిల్లలను కంటే రూ. 30 లక్షలు | Italy Birth Rate Historic Low, Government Offers Cash to Revive Population | Sakshi
Sakshi News home page

బంపర్‌ ఆఫర్‌: పిల్లలను కంటే రూ. 30 లక్షలు

Nov 13 2025 12:07 PM | Updated on Nov 13 2025 12:13 PM

Italy Birth Rate Historic Low, Government Offers Cash to Revive Population

రోమ్‌: ఆధునిక యువత పెళ్లి చేసుకోవడం, పిల్లలను కనడాన్ని భారంగా భావిస్తోంది. దీనికి ఆర్థిక అంశాలతో పాటు, ఉరుకులు పరుగుల జీవితం కూడా ఒక కారణంగా నిలుస్తోంది. ఇటువంటి నేపధ్యంలో జననాల రేటు తగ్గుతున్నదనే వాదన కూడా వినిపిస్తోంది. దీనిని గుర్తించిన ఒక దేశం పరిష్కార మార్గాన్ని కనుగొంది. పెళ్లి చేసుకునే యువతకు భారీ నగదు బహమతులు, గ్రాంట్‌లను ప్రకటించింది.

ఇటలీ అసాధారణ జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశ ఏకీకరణ (1861) తర్వాత 2024లో కేవలం 370,000 జననాలతో అత్యల్ప సంఖ్యను నమోదు చేసింది. ప్రతి మహిళకు జనన రేటు రికార్డు స్థాయిలో 1.13కి పడిపోయింది. నిపుణులు దీనిని ‘జనాభా శీతాకాలం’(తక్కువ సంతానోత్పత్తి రేట్లు, వృద్ధాప్య జనాభా, పెరిగిన మరణాల రేటుతో ఏర్పడిన పరిస్థితి) గా అభివర్ణిస్తున్నారు.

ఆర్థిక అనిశ్చితి, పెరుగుతున్న జీవన వ్యయాలు,  పరిమిత ఉద్యోగ అవకాశాల కారణంగా యువ ఇటాలియన్లు వివాహం చేసుకునేందుకు, పిల్లలను కనేందుకు ఆలస్యం చేస్తున్నారు. ఇది ఇటలీ  ఆర్థిక, సామాజిక స్థిరత్వానికి తీవ్రమైన ముప్పుగా పరిణమించింది. యువతలో ఉన్న ఈ ధోరణిని తిప్పికొట్టేందుకు, జనాభా పెరుగుదలను ప్రోత్సహించేందుకు తక్షణమే చర్యలకు ఇటలీ ప్రభుత్వం ఉపక్రమించింది.

తగ్గుతున్న జననాల సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇటాలియన్ ప్రభుత్వం యువతకు విస్తృతమైన ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీనిలో గ్రామీణ పునరావాస గ్రాంట్‌ ఒకటి. దీని కింద గ్రామాలలో వదిలివేసిన ఇళ్లను కొనుగోలు చేసి,వాటిని పునరుద్ధరించే వారికి  €30,000(రూ.30 లక్షలు) వరకు అందించనున్నారు. పుగ్లియాలోని ప్రెసిస్-అక్వారికా తదితర చిన్న పట్టణాల్లో నివాస స్థిరత్వం కోసం అక్కడి ప్రజలకు నెలవారీ స్టైపెండ్‌లు, వ్యాపార మద్దతును అందిస్తున్నారు. ఈ పథకం ముఖ్యంగా ఇటలీలో ఖాళీ అవుతున్న చిన్న,చారిత్రక పట్టణాలకు ఊపిరి పోయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది అక్కడి జనాభా పెరిగేందుకు దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

అలాగే దేశంలో జనాభా పెరిగేందుకు దోహదపడేలా  పన్ను వ్యవస్థలో ముఖ్యమైన రాయితీలను ప్రవేశపెట్టింది.  ఉద్యోగాల కోసం ఇటలీకి తరలివచ్చే నిపుణుల కోసం, ముఖ్యంగా దక్షిణ ప్రాంతాల వారికి పదేళ్ల వరకూ వరకు వారి ఆదాయంలో 70 శాతం నుండి 90 శాతం వరకు ఆదాయపు పన్ను మినహాయింపునిస్తున్నారు. దీనికితోడు విదేశీ కార్మికులు స్థానికంగా నివసించేందుకు, ఆర్థిక వ్యవస్థకు దోహదపడటానికి అనుమతించే డిజిటల్ నోమాడ్ వీసాను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఈ ప్రోత్సాహకాలు జనాభా క్షీణతను తిప్పికొట్టందుకు సరిపోకపోవచ్చని విశ్లేషకులు సూచిస్తునన్నారు.  పిల్లల సంరక్షణ, కుటుంబ జీవితాన్ని ప్రోత్సహించేందుకు సాంస్కృతిక ప్రచారాలు వంటి నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమని వారు సూచిస్తున్నారు. 

ఇది  కూడా చదవండి: ‘యూనస్‌ ఉగ్రవాదుల ఫ్రంట్‌మన్’.. హసీనా ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement