
నాగ్‌పూర్: మహిళల చెస్ ప్రపంచకప్ టైటిల్ గెలిచిన భారత క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రూ. 3 కోట్ల నగదు బహుమతిని అందించారు. జార్జియాలో ఇటీవల జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్లో భారత స్టార్ కోనేరు హంపిపై ‘టైబ్రేక్’లో నెగ్గి చాంపియన్‌గా అవతరించిన 19 ఏళ్ల దివ్యను శనివారం ఏర్పాటు చేసిన పౌర సన్మాన కార్యక్రమంలో ఫడ్నవీస్ ప్రత్యేకంగా అభినందించారు.
నాగ్‌పూర్‌కు చెందిన దివ్య యావత్ దేశాన్ని గర్వపడేలా చేసిందని ఫడ్నవీస్ అన్నారు. చిన్న వయసులోనే పెద్ద ఘనత సాధించిన దివ్యను సత్కరించడం ఆనందంగా ఉందని వెల్లడించారు. ఈ సందర్భంగా దివ్య మాట్లాడుతూ... ‘ఇది నాకు ప్రత్యేకమైన సందర్భం. చిన్నారులకు స్ఫూర్తిగా నిలవడంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. సహకరించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు’ అని వెల్లడించింది.
ఇదే కార్యక్రమంలో మహారాష్ట్ర చెస్ సంఘం దివ్యకు రూ. 11 లక్షల నజరానా అందించింది. ఒక్క జీఎం నార్మ్ కూడా లేకుండా ప్రపంచకప్ బరిలోకి దిగిన దివ్య... టైటిల్‌తో పాటు నేరుగా గ్రాండ్‌మాస్టర్ హోదా సైతం దక్కించుకుంది. మరోవైపు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ గవాయ్ శనివారం దివ్య దేశ్‌ముఖ్ ఇంటిని సందర్శించి... వరల్డ్‌కప్ టైటిల్ గెలిచిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. దివ్య కుటుంబంతో తనకున్న అనుంబంధాన్ని గుర్తుచేసుకున్న చీఫ్ జస్టిస్... భవిష్యత్తులో దివ్య మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.