టెహ్రాన్: ఇరాన్‌లో నరమేధం సృష్టించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నారా? ఇరాన్‌పై రాకెట్ దాడులు జరపడానికి అమెరికా సన్నద్ధమవుతోందా?. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చి, ఆయన స్థానంలో ఇరాన్ క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లావీకి పగ్గాలు అప్పగించేందుకు మంతనాలు జరుగుతున్నాయా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు.
ఇరాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం కారణంగా పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఖమేనీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నిరసనకారులపై కాల్పులు జరిపి, ఇప్పటివరకు 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో అమెరికా ఇరాన్ ప్రభుత్వంపై దాడి చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చడం, రెజా పహ్లావీకి పగ్గాలు అప్పగించే ప్రయత్నాలు, ఎర్ఫాన్ సోల్తానీని ఉరితీయాలని జారీ చేసిన ఆదేశాలు, ట్రంప్ హెచ్చరికలు.. ఈ పరిణామాల మధ్య ఏం జరగనుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇరాన్ చర్యలకు ధీటుగా స్పందించాలని అమెరికా భావిస్తోంది. అయితే, తమ దేశంపై దాడి జరిగితే మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేస్తామని ఇరాన్ బెదిరిస్తోంది. ఈ నేపథ్యంలో ఖతార్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, ఇరాక్, టర్కీ వంటి దేశాల్లో ఉన్న తమ సైనిక స్థావరాల నుండి అమెరికా సిబ్బందిని ఖాళీ చేస్తోంది. అమెరికా దాడులు జరిగితే తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని రివల్యూషనరీ గార్డ్స్ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ మాజిద్ మౌసావి ప్రకటించారు.
డిసెంబర్ 28 నుంచి కొనసాగుతున్న నిరసనలను అణచివేయడానికి ఇరాన్ ప్రభుత్వం నిరసనకారుల ప్రాణాలు తీస్తోంది. ఇలాగే కొనసాగితే అయతొల్లా ప్రభుత్వానికి హాని కలిగిస్తామని ట్రంప్ పలుమార్లు హెచ్చరించారు. ఇరాన్ ప్రభుత్వం 3,000 మంది పౌరులు మరణించారని చెబుతుండగా, ప్రతిపక్ష ఛానల్ ఇరాన్ ఇంటర్నేషనల్ 12,000 మందికి పైగా మరణించారని నివేదించింది.


