అమెరికా, ఇరాన్, ఖతార్ ఒత్తిడితో ఇజ్రాయెల్, హెజ్‌బోల్లా అంగీకారం
అంతకుముందు దక్షిణ, తూర్పు లెబనాన్‌లో ఇజ్రాయెల్, హెజ్‌బోల్లా మధ్య హోరాహోరీ
47 మంది మృతి చెందినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడి
హెజ్‌బోల్లా దాడుల్లో నలుగురు ఇజ్రాయెల్ జవాన్లు బలి.. ఐదుగురికి గాయాలు
స్విట్జర్లాండ్‌లో జరగాల్సిన చర్చలు వాయిదా
ప్రయాణం విరమించుకున్న ఇరాన్ ప్రతినిధులు
అమెరికాలోనే ఆగిపోయిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
జెరూసలేం: అమెరికా–ఇరాన్‌ల మధ్య తాత్కాలిక ఒప్పందంపై సంతకాలు జరిగిన తర్వాత పశ్చిమాసియాలో భగ్గుమన్న ఉద్రిక్తతలు ఒక్కరోజులోనే చల్లారాయి. అమెరికా, ఇరాన్, ఖతార్ దేశాల ఒత్తిడితో ఇజ్రాయెల్, హెజ్‌బోల్లా మిలిటెంట్ గ్రూప్ దాడులు ఆపేశాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవడానికి అంగీకరించాయి. దాంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. అంతకుముందు ఇజ్రాయెల్ సైన్యం తమ పొరుగుదేశం లెబనాన్‌పై విరుచుకుపడింది.
గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం దాకా దక్షిణ, తూర్పు లెబనాన్‌పై భీకర స్థాయిలో వైమానిక దాడులకు దిగింది. ఇజ్రాయెల్, హెజ్‌బోల్లా మిలిటెంట్ గ్రూప్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఈ దాడుల్లో లెబనాన్‌లో కనీసం 47 మంది మరణించారని ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే తమ జవాన్లు నలుగురు మృతిచెందినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. హెజ్‌బోల్లా మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది.
ఒప్పందంపై సంతకాలు జరిగిన మరుసటి రోజే ఇజ్రాయెల్ రెచ్చిపోవడం నివ్వెరపర్చింది. స్విట్జర్లాండ్‌లో శుక్రవారం అమెరికా, ఇరాన్‌ల మధ్య జరగాల్సిన కీలక చర్చలు తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదాపడ్డాయి. తదుపరి చర్చలు ఎప్పుడు జరుగుతాయన్నది తెలియరాలేదు. అసలు తాత్కాలిక ఒప్పందం అమలవుతుందా? పరిస్థితి మళ్లీ మొదటికొస్తుందా? అనే సందేహాలు తలెత్తాయి.
తుది ఒప్పందం కోసం చర్చలు జరగాలంటే లెబనాన్‌లో దాడులు ఆగాల్సిందేనని ఇరాన్ ప్రతినిధులు తేల్చిచెప్పారు. స్విట్జర్లాండ్ ప్రయాణాన్ని విరమించుకున్నారు. స్విట్జర్లాండ్ చర్చల్లో పాల్గొనాల్సిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. చర్చలను రీషెడ్యూల్ చేయడానికి మధ్యవర్తులు తీవ్రంగా ప్రయతి్నస్తున్నట్లు సమాచారం. తాత్కాలిక ఒప్పందం ప్రకారం.. తుది విడత ఒప్పందం కోసం 60 రోజుల్లోగా చర్చలు పూర్తికావాల్సి ఉంది.
ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతుగల హెజ్‌బోల్లా మధ్యనున్న సంఘర్షణే అమెరికా–ఇరాన్ ఒప్పందంలో అత్యంత ముఖ్యమైన అంశం. దీనిపై ఇజ్రాయెల్ గానీ, హెజ్‌బోల్లా గానీ సంతకాలు చేయలేదు. అందులో తాము భాగస్వాములం కాదని ఇరుపక్షాలు చెబుతున్నాయి. తమ మిత్ర దేశమైన లెబనాన్‌పై దాడులను సహించబోమని, అవసరమైతే ఇజ్రాయెల్‌పై యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ సంకేతాలిస్తోంది. పశ్చిమాసియాలో సంఘర్షణను శాశ్వతంగా ముగించి, శాంతిని నెలకొల్పడానికి చర్చలు ఎప్పుడు జరుగుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.
హార్మూజ్‌లో నౌకలరిజి్రస్టేషన్ తప్పనిసరి
అవగాహనా ఒప్పందంపై అమెరికా, ఇరాన్‌లు సంతకాలు చేయడంతో హార్మూజ్ జలసంధి తెరుచుకుంది. చమురు నౌకల రాకపోకలు మొదలయ్యాయి. జలసంధి పర్యవేక్షణ బాధ్యతను నూతన ఇరానియన్ అథారిటీకి అప్పగించారు. ప్రస్తుతం హార్మూజ్‌లో నౌకల రవాణా ఉచితం (టోల్–ప్రీ) అయినప్పటికీ అవి తమ వద్ద తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని ఈ అథారిటీ శుక్రవారం మార్గదర్శకాలను జారీ చేసింది. త్వరలో విదేశీ నౌకల నుంచి టోల్ ఫీజు వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హెజ్‌బోల్లా మూల్యం చెల్లించుకోవాల్సిందే: నెతన్యాహు
హెజ్‌బోల్లా దాడుల్లో లెఫ్టినెంట్ కల్నల్ సహా నలుగురు జవాన్లు మృతి చెందారని, ఐదుగురు గాయపడ్డారని ఇజ్రాయెల్ సైన్యం తెలియజేసింది. హెజ్‌బోల్లా గ్రూప్ బహిరంగంగా కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడిందని ఆరోపించింది. హెజ్‌బోల్లా దాడులపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. ‘‘మా సైనికులపై గానీ, మా భూభాగంపై గానీ దాడులను సహించం. ఈ దాడులకు హెజ్‌బోల్లా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’’అని హెచ్చరించారు. ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులను లక్ష్యంగా చేసుకున్నట్లు హెజ్‌బోల్లా అంగీకరించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ స్వయంగా ఉల్లంఘించడం వల్లే తాము ప్రతిస్పందించాల్సి వచ్చినట్లు తేల్చిచెప్పింది.
10 సెంట్లు కూడా ఇవ్వం: ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్ పని అయిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. యుద్ధం ఇరాన్ సైనిక సామర్థ్యాలను నాశనం చేసిందని చెప్పారు. అక్కడ వైమానిక దళం, నౌకాదళం, కీలక రక్షణ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలిపారు. ఇరాన్‌కు అమెరికా నుంచి 10 సెంట్లు కూడా దక్కవని తేల్చిచెప్పారు. ఈ మేరకు ట్రంప్ తాజాగా ట్రూత్ సోషల్‌లో పోస్టుచేశారు. ఇరాన్‌కు తాము ఆర్థిక సాయం అందజేసే ప్రసక్తే లేదని తేల్చేశారు. యుద్ధం తర్వాత ఇరాన్ బలపడిందని, అమెరికా నష్టపోయిందని రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. ఈ యుద్ధం ఇరాన్ సైనిక బలాన్ని గణనీయంగా తగ్గించిందని పేర్కొన్నారు.
ఐఏఈఏకు ఇరాన్ ఆహ్వానం!
వాషింగ్టన్: ఇరాన్ అణు స్థావరాలను తనిఖీ చేయడానికి, అలాగే శుద్ధి చేసిన యురేజియం స్థానాలను గుర్తించి, వెలికితీసే పనిని ప్రారంభించడానికి ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ)ను ఇరాన్ ఆహ్వానిస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూత స్టీవ్ విట్కాఫ్ అమెరికా చట్టసభ సభ్యులకు తెలియజేశారు. ఐఏఈఏను ఆహ్వానించడానికి ఇరాన్ అంగీకరించిందని చెప్పారు. అయితే, దీనిపై ఐఏఈఏ ఇంకా స్పందించలేదు. ఇరాన్ వద్దనున్న శుద్ధిచేసిన యురేనియం నిల్వలను అంతర్జాతీయ పర్యవేక్షణలో నిరీ్వర్యం చేయాలన్న షరతును తాత్కాలిక ఒప్పందంలో చేర్చిన సంగతి తెలిసిందే. అలాగే ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకోకూడదని, అభివృద్ధి చేయకూడదని ఒప్పందంలో ప్రస్తావించారు.
ఫలించిన ఒత్తిడి
ఇజ్రాయెల్ సైన్యం, హెజ్‌బోల్లా మధ్య దాడుల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. పరిస్థితి చెయ్యి దాటిపోయేలా ఉండడంతో అమెరికా, ఇరాన్, ఖతార్ శుక్రవారం రంగంలోకి దిగాయి. ఇజ్రాయెల్‌తోపాటు హెజ్‌బోల్లా గ్రూప్‌పై ఒత్తిడి పెంచాయి. వెంటనే దాడులు ఆపాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని తేలి్చచెప్పాయి. దాంతో ఇజ్రాయెల్, హెజ్‌బోల్లా దిగిరాక తప్పలేదు. కాల్పుల విరమణకు ఇరుపక్షాలు అంగీకరించినట్లు అమెరికా అధికారులు ధ్రువీకరించారు.


