టెహ్రాన్: ఇరాన్‌లోని హార్మూజ్ జలసంధిపై మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు కాస్త చల్లారుతున్నాయనుకుంటున్న తరుణంలో ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయగా భావించే హార్మూజ్ జలసంధిపై ఇరాన్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. హార్మూజ్ గుండా ప్రయాణించే నౌకలు ఇరాన్ నిర్దేశించిన మార్గాలనే అనుసరించాలని, తమతో సంప్రదింపులు లేకుండా ప్రకటించే కొత్త మార్గాలను అంగీకరించబోమని ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ స్పష్టం చేసింది.
ఈ సందర్బంగా ఐఆర్‌జీసీ.. హార్మూజ్‌లో సురక్షిత ప్రయాణం కావాలంటే ఇరాన్ నిర్దేశించిన నావిగేషన్ మార్గాలనే అనుసరించాలి. మా సమన్వయం లేకుండా ప్రకటించిన మార్గాలు భద్రతకు ముప్పుగా మారతాయి అని హెచ్చరించింది. అంతేకాదు, ఈ నిబంధనలను పాటించని నౌకలపై చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేసింది. దీంతో, హార్మూజ్‌పై మరోసారి పెత్తనం చెలయించేందుకు ఐఆర్‌జీసీ ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. యుద్ధం తీవ్రత తగ్గినా, హార్మూజ్ జలసంధిపై ఇరాన్ తాజా హెచ్చరిక ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో చిన్న ఉద్రిక్తత కూడా ప్రపంచ చమురు మార్కెట్లను కుదిపేయగలదు. అందుకే ప్రస్తుతం ప్రపంచ రాజకీయాలు, ఇంధన భద్రత, అంతర్జాతీయ వాణిజ్యం అన్నీ హార్మూజ్ చుట్టూనే తిరుగుతున్నాయి.
ఇక, ప్రపంచ ఇంధన భద్రతలో హార్మూజ్ జలసంధికి అత్యంత కీలక స్థానం ఉంది. పర్షియన్ గల్ఫ్‌లోని చమురు ఉత్పత్తి దేశాల నుంచి బయలుదేరే భారీ మొత్తంలో ముడి చమురు, సహజ వాయువు (LNG) ఈ మార్గం గుండా ప్రపంచ మార్కెట్లకు చేరుతుంది. రోజుకు సుమారు 20 మిలియన్ బ్యారెళ్ల చమురు ఈ జలసంధి గుండా రవాణా అవుతుందని అంచనా. అందుకే హార్మూజ్‌లో ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారీ చమురు ధరలు ఆకాశాన్నంటుతాయి. భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలు పరిస్థితిని నిశితంగా గమనిస్తుంటాయి.
అయితే, హార్మూజ్‌పై ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 72 డాలర్లకు పడిపోయింది. అమెరికా-ఇరాన్ ఘర్షణలు ప్రారంభమయ్యే ముందు ఉన్న స్థాయికి ధరలు తిరిగి చేరడం మార్కెట్లకు ఊరటనిచ్చింది. అలాగే హార్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన కొన్ని చమురు ట్యాంకర్లు మళ్లీ తమ ప్రయాణాన్ని ప్రారంభించడం కూడా సరఫరాపై నెలకొన్న ఆందోళనలను తగ్గించింది.


