ఇజ్రాయెల్‌ నౌకపై ఇరాన్‌ దాడి.. నౌకలో 17 మంది భారతీయులు | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌ నౌకపై దాడి.. ఆధీనంలోకి తీసుకున్న ఇరాన్‌​ నేవీ

Published Sat, Apr 13 2024 6:56 PM

Iran Navy Seizes Israel Link Container Ship In Gulf Of Oman - Sakshi

దుబాయ్‌: ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్‌పై దాడి చేస్తామని ఇరాన్‌ ప్రకటించిడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌  బిలియనీర్‌కు చెందిన  ఎమ్‌ఎస్‌సి ఎరిస్‌ కంటెయినర్‌ షిప్‌ను గల్ఫ్‌ ఆఫ్‌ హార్ముజ్‌ వద్ద ఇరాన్‌ నేవీ ఆధీనంలోకి తీసుకుంది.

పోర్చుగల్‌ జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌకలో 25 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 17 మంది భారతీయులుండటం కలవర పరుస్తోంది. వీరి విడుదల కోసం భారత ప్రభుత్వం ఇరాన్‌తో ఇప్పటికే సందప్రదింపులు ప్రారంభించినట్లు సమాచారం.

 నౌకను ఇరాన్‌  తీసుకెళుతున్నట్లు ఇరాన్‌ నేవీ ప్రకటించింది. నౌక డెక్‌పై ఇరాన్‌ కమాండోలు కూర్చున్న వీడియో బయటికి వచ్చింది. ఇజ్రాయెల్‌ బిలియనీర్‌ వ్యాపారవేత్తకు చెందిన జోడియాక్‌ మారిటైమ్‌ గ్రూపు ఈ నౌకను నిర్వహిస్తోంది. 

హెలికాప్టర్‌ ద్వారా ఇరాన్‌నేవీ సిబ్బంది నౌకపై దాడి చేసి లోపలికి ప్రవేశించారు. హర్మూజ్‌ జలసంధివైపు వెళుతుండగా చివరిసారిగా ఎంఎస్‌సి ఎయిరిస్‌ను గుర్తించారు. ఘటన తర్వాత ఇజ్రాయెల్‌ విదేశాంగ మంత్రి స్పందించారు.

ఇరాన్‌ గార్డ్స్‌ను ఉగ్రవాదులుగా గుర్తించాలని ప్రపంచ దేశాలను కోరారు. ఇరాన్‌లో ప్రస్తుతం క్రిమినల్స్‌ పాలన కొనసాగుతోందని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి పైరేట్‌ ఆపరేషన్‌లను ఆ దేశం నిర్వహిస్తోందని ఫైర్‌ అయ్యారు.

హమాస్‌ లాంటి ఉగ్రవాద సంస్థలకు కూడా ఇరాన్‌ మద్దతిస్తోందని మండిపడ్డారు. కాగా, ఇటీవల సిరియాలోని ఇరాన్‌ రాయబార కార్యాలయంపై  ఇజ్రాయెల్‌ దాడులు జరిపింది. ఈ దాడిలో ఏడుగురు ఇరాన్‌ ఆర్మీ ఉన్నతాధికారులు మరణించారు. ఘటనతో ఆగ్రహించిన ఇరాన్‌, ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తామని ప్రకటించింది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.   

ఇదీ చదవండి.. అలర్ట్‌.. 48 గంటల్లో యుద్ధం 

Advertisement
 
Advertisement